హీరోయిన్‌ అంకితతో మీకు గొడవేంటి?

వెండితెరపైనా, బుల్లితెరపైనా నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పాత్ర ఏదైనా

Updated : 04 Nov 2020 09:56 IST

వెండితెరపైనా, బుల్లితెరపైనా నటుడిగా అతనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతాడు. సినిమా.. రియాల్టీ షో.. వెబ్‌ సిరీస్‌ మాధ్యమం ఏదైనా అందులోని పాత్రకు తగిన విధంగా ఒదిగిపోతాడు. ‘జై’ కొట్టి వెండితెరకు పరిచయమై, గౌతమ్‌గా ఎస్‌.ఎస్‌.సి. పాసై, ‘చందమామ’తో కలిసి ప్రేమను మరిపించి, మురిపించిన యువ కథానాయకుడు నవదీప్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సినిమాల్లో తాను ఎలా వచ్చారు? కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, ఇలా ఎన్నో విషయాలను సరదాగా నవ్వుతూ పంచుకున్నారిలా..!

మీరు నిజంగా మిస్టర్‌ పర్‌ఫెక్టా?

నవదీప్‌: ఊరుకోండి అన్నయ్యా..! మీరు అన్ని తెలిసే అడుగుతారు. నా గురించి మీకు తెలియదా! మనం(ఆలీ) నవ్వాపుకోలేక ఎన్నో షూటింగ్‌ల మధ్యలోనే ఆగిపోయాయి. ‘ప్రేమంటే ఇంతే’ సినిమా సందర్భంగా మనం ఎక్కువ రోజులు కలిసి జర్నీ చేశాం.

అతి చిన్న వయసులో హీరో అయ్యావు కదా! అప్పుడు నీ వయసెంత?

నవదీప్‌: 17 సంవత్సరాలు. తేజగారి దర్శకత్వంలో వచ్చిన ‘జై’ నా తొలి సినిమా.

ఆయన మిమ్మల్ని ఎక్కడ చూశారు?

నవదీప్‌: నిర్మాత, దర్శకుడు నిధి ప్రసాద్‌గారు ద్వారా ఆయన బంధువు సమీర్‌గారు పరిచయం అయ్యారు. అప్పుడు తేజగారు కొత్తవాళ్ల కోసం వెతుకుతున్నారని తెలిసింది. ‘నువ్వు కృష్ణానగర్‌లో తిరగడం కాదు. ఫొటో తీసుకుని రా వెళ్దాం’ అని నన్ను తీసుకెళ్లారు. అప్పుడు ‘చిత్రం’ ఆఫీస్‌కు రోజుకు 200లకు పైగా ఫొటోలు వస్తుండేవి. వాటన్నింటినీ దాటుకుని ‘జై’లో నటించే అవకాశం నాకు వచ్చింది. అయితే, బయట టాక్‌ ఉన్నట్లు తేజగారు నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదు. బహుశా ఆయన కొట్టి ఉంటే మా సినిమా సూపర్‌హిట్‌ అయ్యేదేమో! అయితే, నటుడిగా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా.

ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది?

నవదీప్‌: విజయవాడ ఊర్వశి థియేటర్‌లో సినిమా చూసి రిక్షా ఎక్కి ఇంటికి వెళ్తుంటే రిక్షా తొక్కే వ్యక్తి ‘మీరు చాలా బాగున్నారు బాబు. సినిమా హీరో అవ్వొచ్చు కదా’ అన్నాడు. అది నా మైండ్‌లో బాగా నాటుకు పోయింది. తేజగారు రాకముందు సినిమాల్లో అవకాశం అంటే, ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. జీవితం ఇక అయిపోయినట్లే అనుకుని అవకాశాల కోసం తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో తేజగారి సినిమాలో అవకాశం వచ్చింది. ‘నువ్వు సినిమాల్లో నటిస్తున్నట్లు ఇంట్లో తెలుసా?’ అని మా అమ్మానాన్నలను పిలిపించారు. వాళ్లకు కూడా అప్పుడే తెలిసింది. తేజలాంటి డైరెక్టర్‌ అవకాశం ఇస్తానంటే ఎవరైనా ఎందుకు వద్దని చెబుతారు. దాంతో ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకొన్నారు.

మీ తండ్రి ఏం చేస్తారు?

నవదీప్‌: నాన్నకు ఎలక్ట్రానిక్స్‌ ఇండస్ట్రీ ఉంది. అమ్మానాన్నలది ప్రేమ వివాహం. మేము ఇద్దరం పిల్లలం. నాకు అక్క ఉంది. ఆమెకు వివాహం కూడా అయిపోయింది. తను హైదరాబాద్‌లో ఉంటుంది.

మీ పెళ్లెప్పుడు?

నవదీప్‌: (నవ్వులు) అన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది కానీ, ఆ ఒక్క విషయంలోనే రావడం లేదు. రానా మ్యారేజ్‌ నిజంగా షాక్‌. ఈ కరోనా సమయంలో చాలా మంది పెళ్లిళ్లు అయిపోయాయి. అయితే, శర్వా, రామ్‌, కార్తికేయ ఇంకా నాతో పాటు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే. పెళ్లి విషయంలో నాన్న కూడా ఒత్తిడి చేస్తున్నారు.

సినిమాలు, టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లు ఏదో ఒక రూపంలో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉన్నారుగా!

నవదీప్‌: ఏ తెర అయినా చించేయాల్సిందే(నవ్వులు). ఈ విషయంలో నాగార్జునగారు నాకు స్ఫూర్తి. ఇతర హీరోల సినిమాల్లో అతిథి పాత్రలు.. టెలివిజన్‌ షోలు ఇలా ఏదైనా చేసేస్తారు. మన పద్ధతులు, అలవాట్లు బాగుంటే పాత్రలు కూడా బాగుంటాయని నాకు అనిపించింది. అందుకే ‘ఆర్య2’ చేశా. ఈటీవీలో కూడా మొదటిసారి షో చేశా. అర చేతిలో సినిమా నుంచి ఐమ్యాక్స్‌ వరకూ చాలా విభాగాలు ఉన్నాయి. చాలా మంది తమ ప్రతిభ కనబరుస్తున్నారు. నాకు అన్ని విభాగాల్లో రాణించడం బాగుంది.

మీ దృష్టిలో సినిమా, టీవీ, వెబ్‌ సిరీస్‌ ఏది ఉత్తమం?

నవదీప్‌: కచ్చితంగా సినిమానే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే వచ్చే అనుభూతి వేరు. ఎవరికైనా తెరపైన తమ నటన చూసుకుంటే ఆ మజాయే వేరు. ఇండస్ట్రీలో  చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌లకు వీరాభిమానిని. ఎంసెట్‌ ఎగ్జామ్‌ ముందు రోజు విజయవాడ నుంచి మంగళగిరి వెళ్లి మరీ సినిమా చూసిన రోజులున్నాయి. అయితే, ఇటీవల కాలంలో వెబ్‌ సిరీస్‌, టీవీలకు మంచి ఆదరణ ఉంటోంది.

ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?

నవదీప్‌: బన్ని, రానా, చరణ్‌ ముగ్గురూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. రానా, నేనూ చాలా పాజిటివ్‌గా ఉంటాం. అందరితోనూ మేమిద్దరం కలిసిపోతాం.

నవదీప్‌ అంటే పార్టీ బాయ్‌ అంటారు. ఎందుకని ఆ పేరు వచ్చింది?

నవదీప్‌: ఒకానొక సందర్భంలో విపరీతంగా పార్టీలు ఎంజాయ్‌ చేశాను. రాత్రి 8గంటలైతే క్లబ్‌కు వెళ్లిపోయి అర్ధరాత్రి వరకూ తిరిగి, ఆ తర్వాత బిర్యానీ తిని, తెల్లవారుజామున 5గంటలకు ఇంటికి చేరేవాడిని. ఈ సందర్భంగా మన మీడియా మిత్రులు నేను చేసిన కొన్ని పనులను అటు తిప్పి, ఇటు తిప్పి నన్ను బాగా ఫేమస్‌ చేశారు(వ్యంగ్యంగా). ‘బిగ్‌బాస్‌’ ముందు వరకూ నాకొక ఇమేజ్‌ ఉండేది. ఆ షో తర్వాత నా క్యారెక్టర్‌ ఏంటో ప్రేక్షకులకు తెలిసింది.

పదో తరగతి చదివేటప్పుడు ముద్దు ఎలా పెట్టాలనే దానిపై రోజంతా ట్రైనింగ్‌ తీసుకున్నావట!

నవదీప్‌: (నవ్వులు) అవును తీసుకున్నది నిజమే. ఏ విద్య అయినా ఎవరో ఒకరు నేర్పాలి కాబట్టి నేర్చుకున్నా. ఆ వయసు ప్రభావం అలాంటిది.

నవదీప్‌ గుడ్‌బాయ్‌? నాటీబాయ్‌?

నవదీప్‌: గతంతో పోలిస్తే ఇప్పుడు ఆలోచించే ధోరణి మారింది. 17ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏమీ తెలియదు. ఇటీవల లాక్‌డౌన్‌లో ఫొటో షూట్‌ చేసిన తర్వాత జ్ఞానోదయం అయింది. ఒకరోజు హార్స్‌ రైడింగ్‌కు వెళ్తే అనారోగ్య సమస్య ఏర్పడింది. బాడీలో జాయింట్‌లకు సంబంధించిన సమస్య అది. శరీరంలో పై భాగానికీ, కింది భాగానికీ అనుసంధానం తెగిపోతుంది. అయితే, ఐదారు రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని ఫిజియోథెరపిస్ట్‌ చెప్పాడు. అయితే, ఇంట్లో అటూ ఇటూ వెళ్లాలంటే కింద కూర్చొని దేకుతూ వెళ్లాలి. లాక్‌డౌన్‌లో ఒంటరిగా ఉండకుండా నా స్నేహితుడి దగ్గరకు వెళ్లాను. మొదటి రోజు ఇంట్లోనే కూర్చొని, టీవీ చూడటం, పుస్తకాలు చదవడం చేశా. రెండో రోజు ఎవరికైనా ఫోన్‌ చేద్దామా? అనిపించింది. కానీ చేయలేదు. ఒత్తిడిని జయించడానికి నా స్నేహితుడి తల్లి మెడిటేషన్‌ చేయమని చెప్పారు. అప్పుడే నాలో మార్పు మొదలైంది. మనకు లేని వాటి గురించి ఆలోచించి, ఉన్నవాటిని నిర్లక్ష్యం చేయకూడదనిపించింది.

‘జై’ హిట్టా? ఫ్లాపా?

నవదీప్‌: అంచనాలు భారీగా ఉండటం వల్ల ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే, విడుదల సమయంలో నా స్నేహితులు నాతో మాట్లాడుతూ.. ‘సినిమా విడుదలైన తర్వాత సూట్‌ కేసులు తెచ్చి ఇచ్చేస్తారు. ఏది పడితే అది తీసుకోకూడదు’ అని చెప్పారు. అయితే, ఫలితం మరోలా ఉండటంతో ఏం చేయాలి? అన్న ఆలోచన మిగిలిపోయింది. ఆ సమయంలో కేఎస్‌ రామారావుగారు మంచి సలహాలు ఇచ్చారు.

ఇప్పటివరకూ ఎన్ని సినిమాల్లో నటించారు?

నవదీప్‌: 35 సినిమాలకు పైనే నటించా. 17-24ఏళ్ల మధ్యలో చాలా సినిమాలు చేశా. కొన్నింటికి ‘వద్దు’ అని చెప్పలేక చేశా. కొన్ని తప్పులు ఏవో అనుకుని జరిగాయి. కథ చెప్పినప్పుడు ‘బాగోలేదు’ అని చెప్పేంత ధైర్యం అప్పుడు లేదు. అలా చాలా సినిమాలు చేశా.

రెండో సినిమా ఏది?

నవదీప్‌: వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో ‘మనసు మాట వినదు’. దానికి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ముందు ఆయన నాగార్జున గారితో ‘నేనున్నాను’ తీసి హిట్‌ కొట్టారు. కానీ, నా చిత్రం మెప్పించలేకపోయింది.

ఏ ఆటలు బాగా ఆడతారు?

నవదీప్‌: చిన్నప్పటి నుంచి ఆటలు బాగా ఆడేవాడిని కాదు. ఎవరైనా క్రికెట్‌ గురించి మాట్లాడితే వాళ్ల ఎదుటే నిర్మొహమాటంగా చెప్పేసేవాడిని.

మీరు చాలా ఓపెన్‌గా ఉంటారు కదా! ‘అలా ఎందుకు ఉంటావు’ అని ఎవరూ చెప్పలేదా?

నవదీప్‌: తొందరగా అందరినీ నమ్మి, వాళ్లకు అన్ని చెప్పేస్తానని నా శ్రేయోభిలాషులు అంటుంటారు. నా జీవితంలో 5-10శాతం మాత్రమే అలాంటి తప్పులు జరిగి ఉంటాయి. అలా ఓపెన్‌గా ఉండటం వల్ల 90శాతం మందితో నా రిలేషన్‌ బాగుంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే మొదట కాస్త ఇబ్బంది పడినా, తర్వాత ఆ రిలేషన్‌ బలంగా ఉంటుందని నా అభిప్రాయం.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

నవదీప్‌: కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ అనుకుంటున్న సమయంలో ఓ మంచి సినిమా చేస్తున్నా. ‘చందమామ’ రిలీజ్‌ అయినప్పుడు ఎలాగైతే పాజిటివ్‌గా ఉన్నానో ఇప్పుడే అదే ఫీలింగ్‌ ఉంది. ఆ సినిమా కోసమే గడ్డాన్ని పెంచా.

కెరీర్‌ ఆరంభంలో ఏ హీరోలతో అయితే, పోటీ పడ్డారో వారి సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తున్నప్పుడు ఏమైనా ఫీలవుతున్నారా?

నవదీప్‌: తప్పకుండా ఉంటుంది. ఒక షూట్‌లో మనం హీరో అయితే ఒకలా, హీరో కాకపోతే మరోలా తప్పకుండా ఉంటుంది. మొదట్లో ఆ భావన ఉండేది. అయితే, ఆ పాత్ర నేను బాగా చేశానని ప్రేక్షకులు మెచ్చుకోవడం, నా దర్శకులు, సహానటులు కూడా నన్ను ప్రోత్సహించడంతో అభద్రతా భావం పోయింది.

సోనాలిబింద్రేకు ఎప్పుడు గుడి కడుతున్నారు?

నవదీప్‌: ‘ఇంద్ర’, ‘మురారి’ చూసినప్పుడు ఆమెకు వీరాభిమానిని అయిపోయా. ఎంతలా అంటే శ్రీదేవిని చూసి ఆర్జీవీ ఎలా ఫీలవుతారో నేను కూడా సోనాలి బింద్రేను చూసి దేవతలా ఫీలవుతా. ఆమె యోధురాలు.

సీస్పేస్‌ ఎంత వరకూ సక్సెస్‌ అయింది?

నవదీప్‌: ఏడాదిన్నర సమయంలో 6వేలమందిని ఇంటర్వ్యూ చేశాం. ‘మా దగ్గర కథ ఉంది. మేము రచయితలం. డైరక్షన్‌ చేయాలనుకుంటున్నా’ అని ఎవరైనా అనుకుని ఇండస్ట్రీకి వస్తే, వాళ్లకు సరైన వేదిక లేదు. స్టూడియోల ముందు వెళ్లి నిలబడలేరు. ఎవరిని కలవాలో తెలియదు. అలాంటి వాళ్ల కోసం సీ స్పేస్‌. ఒకరి టాలెంట్‌ను గుర్తించి, అందుకు తగిన విధంగా వారికి గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. వారికి సాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన ఆలోచన ‘సీ స్పేస్‌’. ప్రస్తుతం 40మంది రచయితలు మా వద్ద ఉన్నారు. ఎవరికైనా ప్రాజెక్టులో రచయితల సహాయం కావాలంటే మా దగ్గర ఉన్న వాళ్లు వెళ్లి సాయం చేస్తారు.

మీ తండ్రి మిమ్మల్ని గైడ్‌ చేస్తారా?

నవదీప్‌: 17ఏళ్లుగా నాన్న వెన్నంటే ఉన్నారు కానీ, ‘ఇది మాత్రమే చేయాలి’ అని ఎప్పుడూ చెప్పలేదు. తడబడినా లేచి నిలబడి నడవగలనని వాళ్లకు తెలుసు. ఇప్పుడు పెళ్లి గురించి బాగా ఒత్తిడి చేస్తున్నారు.

చిన్నప్పుడు నాన్న జేబులో నుంచి రూ.500 కొట్టేసి అందరికీ తినుబండారాలు కొనిపెట్టేవారట

నవదీప్‌: దొంగతనాల్లో నేను పీహెచ్‌డీ చేశా. నాన్నకు తెలియకుండా చాలా డబ్బులు కొట్టేసి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చేవాడిని. పెరుగుతున్న కొద్దీ ఆ అలవాటు పోయింది.

మీరు నటించిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏది?

నవదీప్‌: ‘గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి.’, ‘చందమామ’. గౌతమ్‌ SSC చేసినప్పుడు చాలా ఉత్సకత ఉండేది. ఇప్పుడు త్వరలో చేయబోయే సినిమాకు కూడా అలాంటి ఉత్సాహం ఉంది. ‘చందమామ’ విషయంలో కృష్ణవంశీ చాలా స్వేచ్ఛనిచ్చారు. ఆయన సీన్‌ చెప్పి నటించమనేవారు. నేను రెండు, మూడు రకాలుగా చేసేవాడిని. ఆ సినిమాలో కోడి సన్నివేశం కూడా నేను ఎక్కడో చూసి ఆయన చెబితే, అదే సినిమాలో ఉంచారు.

హీరోయిన్‌ అంకితతో మీకు గొడవేంటి?

నవదీప్‌: అప్పటికి ఆ అమ్మాయి రెండు హిట్లు కొట్టిన హీరోయిన్‌. నేను ఒక ఫ్లాప్‌ సినిమా హీరో. తను డేట్లు అటు ఇటూ మార్చి ఇచ్చింది. ‘వీళ్ల కోసమే నేను డేట్లు అడ్జెస్ట్‌ చేస్తున్నా’ అనే ఫీలింగ్‌లో ఉంది. చివరి రెండు సాంగ్స్‌ సమయంలో రావాలని పిలిస్తే, ‘కుదరదు’ అని చెప్పింది.  అగ్రిమెంట్‌ చూపించి, ఇంకేవో చెప్పి ఎలాగో ఆమెను రప్పించారు. నిర్మాతతో గొడవ కావడంతో ఆ కోపాన్ని నాపైనా చూపించింది. నేను జోకులు వేస్తున్నానంటూ నాపైనే నిర్మాతకు ఫిర్యాదు చేసింది. తను ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా షూటింగ్‌ను ఆపేయాలి. ఆ తర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంతా హ్యాపీ. కొన్ని రోజులకు ఒక రిపోర్టర్‌ ఫోన్‌ చేసి, ‘మీతో గొడవ కారణంగా అంకిత నిద్ర మాత్రలు మింగిందట’ అని అడిగారు. నేను షాకయ్యా! ఆ వార్తలు విని, మా ఇంట్లో వాళ్లు కంగారు పడ్డారు. ఆ తర్వాత విలేకరుల సమావేశం పెట్టి, నిజం చెప్పాం. ఈ విషయంలో నటుడు నాగబాబుగారు కూడా నాకు సాయం చేశారు.

టీనేజ్‌లో చేయాలనుకున్న పని చేయలేకపోయింది ఏదైనా ఉందా?

నవదీప్‌: స్విమ్మింగ్‌. కుదరలేదు(నవ్వులు)

వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..

డైరెక్టర్‌ తేజ: గురు

కృష్ణవంశీ: కాన్ఫిడెన్స్‌

కాజల్‌: లవ్‌

సన్నీ లియోని: నాకు తెలిసిన అతి పెద్ద సెలబ్రిటీ

వి.ఎన్.ఆదిత్య: మోరల్‌ సపోర్ట్‌

ఫస్ట్‌ కిస్‌: ‘ఎస్‌’ అనే పేరుతో మొదలవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని