బాలుని స్టూడియోలోకి రానీయలేదు!

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం అస్తమించారు. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని అలరించిన శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మరణం యావత్‌ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని సంఘటనలను...

Updated : 25 Sep 2020 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం అస్తమించారు. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని అలరించి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మరణం యావత్‌ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుందామా?

స్టూడియోలోకి రానీయలేదు!

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తొలిపాట పాడింది ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ’ (1966)లో. సంగీత దర్శకుడు కోదండపాణి పాట రిహార్సల్సు చేయించి, ఫలానారోజు ఉదయం ‘‘విజయగార్డెన్స్‌లో రికార్డింగు’’ అని రమ్మన్నారట.. మురళి అనే స్నేహితుడు సైకిలు తొక్కుతుండగా.. వెనకాల కూర్చుని, బాలు విజయగార్డెన్స్‌కి వెళ్తే సెక్యూరిటీ వాళ్లు లోపలికి పంపలేదట. ‘‘రికార్డింగు వుంది. నేనే పాడాలి’’ అని ఎస్పీబీ చెప్తే..పీలగావున్న కుర్రాడు పాడటమేంటని ద్వారపాలకుడు ‘నో’ అన్నాడట. అప్పుడు మురళి..‘‘పెద్ద వాళ్లని పిలుచుకొని వస్తాను’’ అని లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత రికార్డింగ్‌ సహాయకుడు, సంగీత సహాయకుడూ బయటికి వచ్చి బాలుని లోపలికి తీసుకెళ్లారట.

ఘంటసాల ప్రోత్సాహం

ప్రఖ్యాత నటీనటులు నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన ‘ఇద్దరు అమ్మాయిలు’ చిత్రంలో ఒక యుగళ గీతం ఉంది. నాగేశ్వరరావుకి ఘంటసాల పాడాలి. కానీ పాట రికార్డింగ్‌కు వెళ్లే ముందు ట్రాక్‌ విన్నారు. ఆ ట్రాక్‌ను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేత పాడించారు. దానిని విన్న తరువాత ఘంటసాల, ‘‘చిరంజీవి బాలసుబ్రహ్మణ్యం బాగా పాడాడు బాబూ. చాలా చక్కగా ఉంది. ఎందుకు మార్చేయడం, అతని కంఠమే ఉండనీయండి’’ అన్నారు. అయితే ‘‘బాగా పాడాడు నిజమే. కానీ, హీరోకి మీ కంఠమే అలవాటు. ప్రేక్షకులూ అలవాటు పడ్డారు. అక్కినేని వారు అంగీకరించరు’’ అన్నారు అక్కడి పెద్దలు. ‘‘నాగేశ్వరరావుతో నేను వెళ్లి చెబుతాను. ఆయనకి అన్ని విధాల సరిపోయేలా, చాలా భావయుక్తంగా పాడాడని, అదే ఉంచాలని కోరతాను’’ అన్నారు ఘంటసాల మాస్టారు. మొత్తానికి ఆ పాట మాస్టారు పాడలేదు. బాలు గాత్రంతోనే వచ్చింది. ఆ పాట! ‘‘నా హృదయపు కోవెలలో...’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని