అడవిలో వ్యర్థాలు ఎందుకుండవో తెలుసా.?

మన దగ్గర కఠినమైన నిబంధనలు లేనందునే చెత్త ఉత్పత్తి ఎక్కువగా ఉందని పూరి జగన్నాథ్‌ అభిప్రాయపడ్డారు. తన పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఈసారి ఆయన వేస్ట్‌ రీసైక్లింగ్‌(చెత్త పునర్వినియోగం)పై ఆయన మాట్లాడారు. పునర్వినియోగానికి అనుకూలమైన వ్యర్థాలను..

Published : 20 Nov 2020 01:42 IST

రీసైక్లింగ్‌పై ‘పూరీ మ్యూజింగ్స్‌’ విశ్లేషణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: కఠినమైన నిబంధనలు లేకపోతే చెత్త ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని పూరి జగన్నాథ్‌ అభిప్రాయపడ్డారు. తన ‘పూరీ మ్యూజింగ్స్‌’లో భాగంగా ఈసారి ఆయన వేస్ట్‌ రీసైక్లింగ్‌(చెత్త పునర్వినియోగం)పై మాట్లాడారు. పునర్వినియోగానికి అనుకూలమైన వ్యర్థాలను రీసైకిల్‌ చేయాలని ఆయన కోరారు. ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘రీసైక్లింగ్‌ అంటే వేస్ట్‌ మెటీరియల్స్‌ను మళ్లీ కొత్తగా మార్చడం. ప్లాస్టిక్‌ ప్రొడక్ట్స్‌లాంటివి. రీసైకిల్‌ చేయలేనివి కూడా కొన్ని ఉన్నాయి. పాడైపోయిన ఆహారం, చిరిగిపోయిన బట్టలు, పగిలిపోయిన గ్లాస్‌ ముక్కలు ఇలాంటివన్నమాట. అయితే.. రీసైకిల్‌ చేయదగ్గవాటిని కచ్చితంగా రీసైకిల్‌ చేయండి. దానివల్ల మైనింగ్‌, క్వారింగ్‌ తగ్గుతుంది. మనకు పూర్వం నుంచే రీసైక్లింగ్‌ అలవాటు ఉంది. పల్లెటూళ్లలో ఆహార వ్యర్థాలు, పేడ, చెత్త ఇలాంటివన్నీ పెంటగా పోసి అది కుళ్లిపోగానే పొలంలో వేస్తారు. అయితే.. ప్లాస్టిక్‌, గ్లాస్ బాటిళ్లు వచ్చినప్పటి నుంచి చెత్త మొత్తం కలిసి రీసైకిల్‌ చేయలేకపోతున్నాం. రీసైకిల్‌ చేయాలంటే వాటన్నింటినీ విడదీయాలి. జపాన్‌లో కమికట్సు అనే గ్రామం ఉంది. అక్కడ వ్యర్థం అనే మాటే ఉండదు. ప్రపంచానికి ఆ గ్రామం ఒక మంచి ఉదాహరణ. అక్కడ చెత్త పడేయడానికి ప్రత్యేకంగా ఒక ప్రాంతం కేటాయించారు. అక్కడ వేర్వేరుగా చెత్తను వేసేందుకు 45 రకాల బుట్టలు పెట్టారు. ఇలా చేయడం వల్ల రీసైక్లింగ్‌ సులభమవుతుంది. అలాగే స్విట్జర్లాండ్‌లో చెత్తను బట్టి బిల్లు కట్టాల్సి ఉంది. చెత్త ఎక్కువ ఉత్పత్తి చేసిన ఇంటి నుంచి ఎక్కువ బిల్లు వసూలు చేస్తారు. అందుకే అక్కడ అందరూ ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉంటారు’ అని పూరి పేర్కొన్నారు.

‘ఒక టన్ను చెత్తను రీసైక్లింగ్‌ చేస్తే 20 చెట్లు కాపాడినట్లు. 7000 గ్యాలన్ల నీళ్లు, 4వేల కిలోవాట్ల విద్యుత్తు ఆదా చేసినట్లు. మన దగ్గర సగటున ఒక కుటుంబ అవసరాలకు సంవత్సారానికి 6 పెద్ద చెట్లు నరుకుతున్నారు.  మొక్కలు ఎలాగూ పెంచడం లేదు కనీసం రీసైక్లింగ్‌ అయినా చేద్దాం.. అలా చేయాలంటే వేర్వేరుగా చెత్తను ఉంచండి. అప్పుడే అవి రీసైక్లింగ్‌కు ఉపయోగపడతాయి. అన్నీ కుప్పగా పోస్తే కుదరదు. మీ ఇంటిముందు ప్లాస్టిక్‌ బాటిల్‌ వేస్తే తరాలు మారినా అది మాత్రం కరగదు. అడవిలో చెత్త ఉండదు. ఏ జంతువూ చెత్తను ఉత్పత్తి చేయదు. చెత్తను తయారు చేసే ఒకేఒక జీవి మనిషి. చెత్త నా పులులు.. చెత్త నా ఏనుగులు అని ఎవర్నీ తిట్టం కదా.. కానీ.. చెత్త నా కొడుకులు అంటాం.. అది మీరే..!’’ అని పూరి ‘చెత్త పునర్వినయోగం’పై తన విశ్లేషణ ముగించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని