
MAA Elections: ప్రలోభాలకి గురికావొద్దు
- నాగబాబు
ప్రకాశ్‌రాజ్‌ని గెలిపించేందుకు నూటికి నూరుశాతం శ్రమిస్తామని... ఆయన అధ్యక్షుడిగా ఉంటేనే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) బాగుపడుతుందన్నారు నటుడు నాగబాబు. సభ్యులు ఎలాంటి ప్రలోభాలకి గురికావొద్దని కోరారు. ఇటీవల ప్రకాశ్‌రాజ్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయనకి మద్దతుగా మాట్లాడారు నాగబాబు. ‘‘ప్రకాశ్‌రాజ్ కూరలో ఉప్పులాంటివారు. ఆయన చిన్న సినిమా వాళ్లకి, పెద్ద సినిమా వాళ్లకూ కావాలి. అసోసియేషన్ కోసం కొన్ని సినిమాలు వదులుకుంటానని ఆయన నాతో చెప్పారు. ప్రకాశ్‌రాజ్ భారతీయ నటుడు. తను అధ్యక్షుడిగా పోటీ చేస్తాడని తెలిసిన తర్వాత ఆయనకి అనుకూలంగా పని చేయమని అన్నయ్య చిరంజీవి నన్ను కోరారు. ‘మా’ ఎన్నికల్లో సభ్యులకి డబ్బు ఆశ చూపిస్తున్నారు. ఒక్కో ఓటరుకి రూ.10 వేలు ఇస్తూ, కొద్ది రోజుల తర్వాత మరికొంత ఇస్తామని చెబుతున్నారట. సభ్యుల ప్రతిష్టని దిగజార్చడానికి కొందరు కుట్ర చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ మూడుసార్లు ‘మా’కు అధ్యక్షుడిగా ఉండాల’’న్నారు నాగబాబు.