Adipurush: ‘ఆదిపురుష్‌’ స్పెషల్‌ ఆఫర్‌.. 3డీలో.. టికెట్‌ ఎంతంటే?

రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘ఆదిపురుష్‌’. ప్రభాస్‌, కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా టికెట్లపై నిర్మాణ సంస్థ ఆఫర్‌ ప్రకటించింది.

Published : 22 Jun 2023 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ (Adipurush) నిర్మాణ సంస్థ టి- సిరీస్‌ (T Series) సినీ ప్రియులకు స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించింది. 3డీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా టికెట్లను రూ. 150ల (*షరతులు వర్తిస్తాయి) ప్రారంభ ధరతో అందిస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ఆఫర్‌ జూన్‌ 22, 23న మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఆఫర్‌ వర్తించదని చెప్పింది. రామాయణ ఇతిహాసాన్ని 3డీలో అత్యధిక మంది చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఎడిటెడ్‌ వెర్షన్‌తో సినిమా ప్రదర్శితమవుతుందని గుర్తుచేసింది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొందరు ప్రశంసిస్తే.. మరికొందరు ఈ సినిమాలోని పాత్రల గెటప్పులు, పలు సంభాషణలపై విమర్శలు చేశారు. మిశ్రమ స్పందనతోనూ ఈ సినిమా ఇప్పటివరకు రూ.359 కోట్ల (గ్రాస్‌) వసూళ్లు సాధించింది. అభ్యంతరం వ్యక్తమైన సీన్స్‌/డైలాగ్స్‌ను చిత్ర బృందం మార్చేసింది. ఈ చిత్రంలో రాఘవుడి ప్రభాస్‌ కనిపించగా, జానకిగా కృతి సనన్‌ (kriti sanon), లంకేశ్‌ (రావణుడు)గా బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) నటించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూలేని విధంగా పలువురు ప్రముఖులు ఈ సినిమాని అత్యధిక మందికి చేరువ చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు వేల సంఖ్యలో టికెట్లు కొని, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారికి అందించారు. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, బాలీవుడ్‌ రణ్‌బీర్‌ కపూర్‌, గాయని అనన్య బిర్లా, టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, ప్రముఖ ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌ తదితరులు ఇందులో భాగమయ్యారు. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో ‘ఆదిపురుష్‌’ టీమ్‌ ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని