ఆ షూటింగ్‌కు వెళ్తే బౌన్సర్లు నెట్టేశారు!

ఈ అబ్బాయి క్లాస్‌గా కనిపించే మాస్‌ గురూ.. తన సిక్స్‌ ప్యాక్‌తో అమ్మాయిలకు పిచ్చెక్కించే హాట్‌ గురూ..! ఈ అమ్మాయేమో

Updated : 27 Dec 2022 17:17 IST

ఈ అబ్బాయి క్లాస్‌గా కనిపించే మాస్‌ గురూ.. తన సిక్స్‌ ప్యాక్‌తో అమ్మాయిలకు పిచ్చెక్కించే హాట్‌ గురూ..! ఆ అమ్మాయేమో క్యూట్‌గా కనిపించే హాటీ.. సొట్టబుగ్గల డింపుల్‌ బ్యూటీ..! సిల్వర్‌ స్క్రీన్‌పైన సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న లావణ్య త్రిపాఠి, కార్తికేయ ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి తన అనుభవాలను పంచుకున్నారు.

బస్తీ బాలరాజ్‌ కదా..! జనరల్‌గా ఎవరైనా చనిపోతే ఇంటికెళ్లి సంతాపం తెలుపుతారు. నువ్వేంటి ప్రేమను తెలియజేస్తావట!

కార్తికేయ: అవును. ఉద్యోగం చేసేవాడు ఆఫీస్‌లో అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. బడికి పోయేవాడు బడిలో పిల్లని ఇష్టపడతాడు. మరి చావుకి పోయేవాడు చావు దగ్గరే కదా పిల్లని చూస్తాడు. బస్తీ బాలరాజు శవాల బండి డ్రైవరు. ఒక చావుకి వెళ్లినప్పుడు శవం పక్కన ఏడుస్తూ కూర్చున్న అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు.

అమ్మాయి బాధల్లో ఉంటే.. వెళ్లి ప్రేమను తెలియజేయడం ఏంటి?

కార్తికేయ: ఆ అమ్మాయి ఏడిస్తే చాలా బాగుంది. (మధ్యలో లావణ్య అందుకుని) అందుకే కదా ఆ అమ్మాయిని ప్రేమించాడు.

లాక్‌డౌన్‌లో జీవితం ఎలా గడిచింది?

లావణ్య: నా నార్మల్‌ లైఫ్‌ కూడా లాక్‌డౌన్‌లానే ఉంటుంది. నాకు వంట చేయడం ఇష్టం. ఎప్పటిలానే లాక్‌డౌన్‌ గడిచిపోయింది. పెద్దగా తేడా కనిపించలేదు.

సినిమా టైటిల్‌ చావుకబురు చల్లగా అని చెప్పినప్పుడు దాని మీనింగ్‌ ఏంటని అడిగారా?

లావణ్య: నాకు తెలుగు అర్థమవుతుంది. ‘చావుకబురు చల్లగా’ ఎందుకుంటుంది అనిపించింది. చాలా కొత్తగా ఉంది కదా అనుకున్నా.

హీరోగా మీకు ఇది ఎన్నో సినిమా? ఈ సినిమా చేసేటప్పుడు మీకేమనిపించింది.

కార్తికేయ: ఆరోది. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నింటిలోనూ ఈ పాత్ర చాలా భిన్నమైంది. మిగిలిన సినిమాల్లో నా పాత్ర అగ్రెసివ్‌గా ఉంటుంది. కానీ, ఇందులో కామెడీ చేస్తూ, ఈజీ బాడీ లాంగ్వేజ్‌తో ఉంటుంది. బాలరాజు పాత్ర రవితేజ గారి ‘ఇడియట్‌’లోని పాత్రలా ఉంటుంది.

గీతా ఆర్ట్స్‌లాంటి పెద్ద బ్యానర్‌లో నటించడం ఎలా అనిపిస్తోంది.

కార్తికేయ: గీతా ఆర్ట్స్‌వాళ్ల దగ్గర నుంచి ఫోన్‌ రాగానే చాలా గర్వంగా ఫీలయ్యా. అలాంటి పెద్ద బ్యానర్‌లో సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం. అరవింద్‌ గారిని కలవడం. ఆయన చేతులమీదుగా చెక్‌ తీసుకోవడం. అదొక లైఫ్‌టైమ్‌ మెమొరీ.

ఆమని గారితో కలిసి నటించారు కదా! ఎలా ఫీలవుతున్నారు!

కార్తికేయ: నా చిన్నప్పటి నుంచి ఆమని గారిని సినిమాల్లో చూస్తున్నా. కలిసి నటించడం అదొక గొప్ప అనుభూతి. ఆమె అప్పట్లో అద్భుతమైన పాత్రలు చేశారు.

చదువుకునే రోజుల్లో లావణ్య సినిమాను థియేటర్‌లో చూశావట.

కార్తికేయ: అవును. అప్పటికి నేనింకా ఇండస్ట్రీకి రాలేదు. ‘అందాల రాక్షసి’ రిలీజైనప్పుడు నేను బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. హీరోయిన్‌ చాలా బాగుంది అనుకున్నా. కానీ, తనతో కలిసి సినిమాలో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు.

ఈ సినిమాకు లావణ్యను హీరోయిన్‌గా పెట్టమని మీరే రికమెండ్‌ చేశారట?

కార్తికేయ: మొదటిలో తనని తీసుకుంటారని అనుకున్నారు. కానీ, క్లారిటీ లేదు. తనైతే ఆ పాత్రకు సరిపోతుందని సలహా ఇచ్చా. అంతే!

కార్తికేయతో కలిసి నటించడం ఎలా అనిపించింది.

లావణ్య: తనతో కలిసి పనిచేయడం చాలా మంచి ఫీలింగ్‌. కార్తికేయ హార్డ్‌ వర్క్‌ చేసే అబ్బాయి. చాలా బాగా నటిస్తాడు. అంతే బాగా డ్యాన్స్‌ కూడా చేయగలడు.

నీకు ఇది ఎన్నో సినిమా?ఇండస్ట్రీలో జర్నీ ఎలా ఉంది?

లావణ్య: ఇప్పటి వరకూ తమిళ్‌, తెలుగు భాషల్లో 18 సినిమాల్లో నటించా. డిఫరెంట్‌ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేశా. వాటన్నింటి కంటే ఈ సినిమాలోని పాత్ర చాలా భిన్నమైంది. ఈ పాత్ర నాకు సంతృప్తిని ఇచ్చింది.

గీతా ఆర్ట్స్‌లో తప్ప మరే సినిమాలోనూ నటించను అని ఏమైనా కాంట్రాక్ట్‌ సైన్‌ చేశారా?

లావణ్య: అలాంటిదేమీ లేదు. ‘భలే భలే మగాడివోయ్‌’.. ‘శ్రీరస్తు శుభమస్తు’.. ఇప్పుడు ఇది. ‘గీతా గోవిందం’లో కూడా నేనే చేయాల్సింది. కానీ కుదరలేదు. ఈ సినిమాలో నటించడం నాకు చాలా గర్వంగా ఉంది.

ఒకే సంవత్సరంలో నాలుగు సినిమాలు చేశారు కదా!

కార్తికేయ: అవును. 2019లో హిప్పీ, గుణ 369, గ్యాంగ్‌లీడర్‌, 90ఎంఎల్‌. ఆ తర్వాత ‘చావుకబురు చల్లగా’ మొదలు పెట్టాం. కానీ, లాక్‌డౌన్‌ వల్ల పనులు ఆగిపోయాయి. పోయిన ఏడాది జులై, ఆగస్టులో రావాల్సింది, ఇప్పుడు వచ్చింది.

హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు, ‘గ్యాంగ్‌లీడర్‌’లో విలన్‌గా చేయడం ఎలా ఉపయోగపడింది?

కార్తికేయ: 2019లో విడుదలైన సినిమాలన్నింటిలోకల్లా ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాయే నాకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. విదేశాలకు ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుపడుతున్నారు. కెరీర్‌ మొదటిలో కాబట్టి నన్ను నేను నిరూపించుకోవటానికి అలాంటి పాత్రలు చేస్తున్నా.

ప్రస్తుతం విలన్‌గా ఏదైనా సినిమా చేస్తున్నారా?

కార్తికేయ: అవును. తమిళ్‌లో అజిత్‌ గారి సినిమాలో విలన్‌గా చేసే అవకాశం వచ్చింది.

మీ సొంతూరు ఏది? అమ్మానాన్న ఏం చేస్తుంటారు.

కార్తికేయ: మా నాన్నది నల్గొండ జిల్లా మర్రిగూడెం గ్రామం. అమ్మ రంగారెడ్డి జిల్లా. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌ వనస్థలిపురంలో. నాకు వైజాగ్‌ ఫ్రెండ్స్‌ ఉండటం వల్ల ఆ యాస బాగా మాట్లాడగలను. అమ్మానాన్న నాగార్జున గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ పేరుతో స్కూల్స్‌ నడిపిస్తున్నారు.

‘ఆర్‌ఎక్స్‌ 100’లో అవకాశం ఎలా వచ్చింది?

కార్తికేయ: ఆ సినిమాకి ముందు ఒక చిన్న సినిమా చేస్తున్నా. దానికి ఫ్లై కెమెరా ఆపరేటర్‌గా పనిచేసే రమేష్‌కి ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ తెలుసు. అప్పటికే హీరోగా కొంతమందిని సంప్రదించారు. కుదరకపోవడంతో కొత్తవాళ్లతో చేద్దామని అనుకున్నారట అజయ్‌. ఎవరన్నా కొత్త హీరోని చూడమంటే రమేష్‌ నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆడిషన్‌ చేశారు. నేను బాగా చేయడంతో నన్ను హీరోగా తీసుకున్నారు.

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాకి ఒక్కడివే వెళ్లావా? ఫ్యామిలీతో వెళ్లావా?

కార్తికేయ: ఆ సినిమాలో రొమాంటిక్‌ సీన్లు ఉన్నాయని అమ్మకి చెప్పలేదు. ఆ టైంలో లక్కీగా ఆవిడ ఇండియాలో లేరు. సినిమా విడుదలయ్యాక అమ్మ షాకయ్యారు. నాన్నతో కలిసి సినిమా చూశా. ఫస్ట్‌హాఫ్‌ చూడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. సినిమా మొత్తం చూశాకా చాలా ఎమోషనల్‌ అయిపోయారు. నన్ను పట్టుకుని ఏడ్చేశారు.

పెళ్లెప్పుడు మరి?

కార్తికేయ: ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా చూశాక నాకు పిల్లనివ్వడానికి ఆలోచిస్తున్నారు. అందుకే ఇంకొన్ని సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటా. (నవ్వులు)

ప్రస్తుతం ఏయే భాషల్లో సినిమాలు చేస్తున్నారు?

లావణ్య: తెలుగు, తమిళ్‌. తమిళ్‌లోని ‘నాను రౌడీదాన్‌’ సినిమా అవకాశం ముందుకు నాకే వచ్చింది. కానీ, కొన్ని కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా నయనతార గారు చేశారు. నేను విన్న వాటిల్లో ఆ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది.

గ్లామరస్‌గా ఉండే మీరు ఈ సినిమాలో విడో పాత్ర చేయటానికి గల కారణం.

లావణ్య: కథ నాకెంతగానో నచ్చింది. ఇప్పటి వరకూ నేను ఇలాంటి పాత్ర చేయలేదు. అందుకే వెంటనే ఒప్పేసుకున్నా.

‘చావుకబురు చల్లగా’ సినిమా చూసి అల్లు అరవింద్‌ ఎలా రియాక్ట్‌ అయ్యారు?

కార్తికేయ: ఫోన్‌ చేసి నన్ను చాలా మెచ్చుకున్నారు. బాగా చేస్తావనుకున్నా కానీ, ఇంత బాగా చేస్తావని అనుకోలేదన్నారు. క్లైమాక్స్‌ 20 నిమిషాల సినిమా అరగంటలో షూట్‌ చేసేశాం. దానికి ఆయనెంతో ఆశ్చర్యపోయారు. తన తర్వాత సినిమాలో కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా ఆ సినిమా గురించి ఎలాంటి వివరాలు తెలియదు. ఈ విషయంలో సుకుమార్‌గారి సలహాలు కూడా ఉండొచ్చు. యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఓ కొత్త బ్యానర్‌లో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా ఒక సినిమా చేస్తున్నా.

తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోతో.. ఏ దర్శకుడితో సినిమా చేయాలనుంది.

లావణ్య: ఇప్పటికే చాలా మంది హీరోలతో కలిసి నటించా. ప్రత్యేకంగా ఎవ్వరితోనూ నటించాలని లేదు. హీరో ఎవరైనా సరే కథ నచ్చితే నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. కొరటాల శివగారు, రాజమౌళి గారు, సుకుమార్‌ గారి సినిమాలో నటించాలనుంది. 

లావణ్య గ్లామర్‌ డాల్‌? లేదా ఫెర్పార్మరా?ది బెస్ట్‌ అనిపించిన సినిమా!

లావణ్య: ఫెర్పార్మర్‌. ఏ సినిమా అలా అనిపించలేదు కానీ.. అందాల రాక్షసి, చావుకబురు చల్లగా సినిమాల్లో పాత్రలు బాగా గుర్తుండిపోయేవి.

నాగార్జునతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

లావణ్య: ఆయన చాలా ప్రొఫెషనల్‌. చాలా మంచి మనిషి. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో ఆయనతో కలిసి నటించి చాలా ఎంజాయ్‌ చేశా.

‘అందాల రాక్షసి’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది.

లావణ్య: నేను ఆ టైంలో ముంబైలో ఉన్నా. అప్పటికే నేను చాలా యాడ్స్‌లో నటించా. బోర్‌ కొట్టి యాడ్స్‌ చేయడం మానేసి కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా. అప్పుడు హైదరాబాద్‌ నుంచి ఒక మేనేజర్‌ వచ్చి మేకప్‌ లేకుండా స్టూడియోకి రమ్మన్నారు. మేకప్‌ లేకుండానే ఫొటోషూట్‌ చేశారు. నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే డైరెక్టర్‌ వీడియో తీశారు. అది బాగా రావడంతో వెంటనే నన్నే హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు.

ఫాదర్‌ లాయర్‌. మదర్‌ టీచర్‌. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన లావణ్య ఇండస్ట్రీకి ఎలా వచ్చింది.

లావణ్య: మా కుటుంబంలో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అలాగే అందరికీ కళల్లో ప్రవేశం ఉంది. వాళ్ల ప్రోత్సాహం వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను.

నువ్వు బాగా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా!

కార్తికేయ: గుణ 369 సినిమా. అందులోని పాత్ర నా హార్ట్‌కి బాగా దగ్గర అయ్యింది.

గుణ 369 సినిమా చూసి అల్లు అరవింద్‌ అవకాశం ఇచ్చారట. అదెంతవరకు నిజం.

కార్తికేయ: గుణ 369 ట్రైలర్‌ లాంచ్‌కి అరవింద్‌ గారు వచ్చారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో చేసే అవకాశం ఇవ్వండని సరదాగా అడిగాను. ఆయన వెంటనే వెల్‌కం టు గీతా ఆర్ట్స్‌ అని స్టేజ్‌పై అనేశారు. ఆ తర్వాత ఆయన దగ్గరనుంచి ఫోన్‌ వచ్చింది.

రియల్‌ లైఫ్‌లో ఎవరికైనా లవ్‌ ప్రపోజ్‌ చేశావా?

కార్తికేయ: కాలేజ్‌ డేస్‌లో చేశాను. సినిమాల్లోకి రాక ముందే అవన్నీ క్లోజ్‌ అయిపోయాయి.

అర్జున్‌ సురవరం కథ విన్న వెంటనే ఓకే చేయలేదు. ఎందుకని?

లావణ్య: కొంచెం టైం తీసుకున్నా. హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యం లేకపోవడంతో ఆలోచించా. కానీ, తర్వాత కథలో కొన్ని మార్పులు చేశారు. అప్పుడు ఒప్పుకున్నా.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?

లావణ్య: తమిళ సినిమా ఒకటి చేస్తున్నా. అలాగే తమిళ మ్యూజిక్‌ వీడియోలో నటిస్తున్నా. తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి క్రైం థ్రిల్లర్‌. రెండోది ఇంకా తెలియాల్సి ఉంది.

సినిమాలు హిట్‌, ఫ్లాప్‌ అవ్వడం ఎలా తీసుకుంటున్నావ్‌. ఫలితం ఎలా ఉన్నా ఒకేలా ఉండేంత మెచ్యూరిటీ వచ్చిందా?

కార్తికేయ: వచ్చిందనే చెప్పాలి. హిట్‌ అయితే బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. ఫ్లాప్‌ అయితే తర్వాత మరో సినిమా ఎలాగూ చేయాలి కదా! ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఫలితం ఎలా ఉన్నా ఒకేలా ఉండాలని. ఏదేమైనా నటిస్తూనే ఉండాలి. 

రెమ్యునరేషన్‌ తీసుకోకుండా యాడ్స్‌ చేశారట

లావణ్య: చేశాను. నా మనసుకు నచ్చితే రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించను. సినిమాలన్నా అంతే. కథ నచ్చితే డబ్బులు గురించి పెద్దగా పట్టించుకోను.

కార్తికేయ మీద మీ అభిప్రాయం!

లావణ్య: మంచి సహనటుడు. సెన్సాఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువ. చుట్టూ ఎవరున్నా వ్యంగ్యంగా మాట్లాడతాడు.

ఒక సినిమా షూటింగ్‌ సెట్‌లోకి వెళ్తే బౌన్సర్లు బయటకి లాగేశారు కదా. ఏంటా సంగతి.

కార్తికేయ: అప్పటికి నేను హీరో అవ్వలేదు. ఒక సారి పూరి జగన్నాథ్‌ గారిని కలిశాను. తర్వాత ఆఫీసుకు వచ్చి కలవమన్నారు. ఒకరోజు ఆయన ఆఫీసుకు వెళ్లా. సెక్యూరిటీ గార్డు నన్ను లోపలికి వెళ్లనివ్వలేదు. అక్కడి నుంచి జ్యోతిలక్ష్మి సినిమా షూటింగ్‌ జరుగుతుంటే పూరి గారిని కలవడానికి వెళ్లా. ఆయన నన్ను గుర్తుపట్టలేదు. ఆయన వెనుకే వెళ్తుంటే బౌన్సర్లు నన్ను పక్కకు నెట్టేశారు. బయట నిలుచుని ఉన్నా. ఆ తర్వాత లోపలికి రమ్మని కబురు పెట్టారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నా ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నారు. ఏదైనా అవకాశం ఉంటే చెబుతా అన్నారు. అదీ జరిగింది.

తరచుగా ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటారట.

కార్తికేయ:  చదువుకునే రోజుల్లో అలా జరుగుతుండేది. అందుకే ఫ్రెండ్స్‌ ఎవరూ నాకు ఏమీ ఇచ్చేవారు కాదు. ఒక సారి ట్రైన్‌లో ల్యాప్‌టాప్‌ మర్చిపోయి దిగేశా. ఇంకోసారి ఫోన్‌ ఎక్కడో వదిలేశా. ఇంటి నుంచి బయటకి వచ్చేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోతుంటా. అది మార్చుకుందామనుకున్నా. కానీ ఇప్పుడు ఆ పనులన్నీ అసిస్టెంట్లు చూసుకుంటున్నారు.

లావణ్య దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు.

కార్తికేయ: లుక్‌లో ఎలాంటి కేర్‌ తీసుకోవాలి అన్న విషయం నేర్చుకున్నా.

ఈ సందర్భంగా ఎవరికి థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నారు.

కార్తికేయ: ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌కి. ఆ సినిమా వల్లే నాకు మంచి పేరు వచ్చింది.

లావణ్య: నా ఫస్ట్‌ మూవీ అందాల రాక్షసి మూవీ డైరెక్టర్‌ హను రాఘవపూడి, గీతా ఆర్ట్స్‌ వాళ్లకి థ్యాంక్స్‌ చెబుతా.

- శ్రీ స్వామి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు