Anil Sunkara: నిర్మాణ వ్యయం తగ్గించడం అంత తేలికేం కాదు!

‘‘కథానాయకుడు చిరంజీవి అనుభవం మా అందరికీ కలిసొచ్చింది. ఆయనతో కలిసి సెట్‌లో గడిపిన ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నా.

Updated : 10 Aug 2023 13:58 IST

‘‘కథానాయకుడు చిరంజీవి అనుభవం మా అందరికీ కలిసొచ్చింది. ఆయనతో కలిసి సెట్‌లో గడిపిన ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నా. ఓ నిర్మాతగా ఈ సినిమా ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదించా. ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రయాణం ఇది’’ అన్నారు ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర. పలువురు అగ్ర కథానాయకులతో సినిమాలు నిర్మించి విజయాల్ని అందుకున్న నిర్మాత ఆయన. ఇటీవల చిరంజీవి కథానాయకుడిగా... రామబ్రహ్మం సుంకరతో కలిసి ‘భోళాశంకర్‌’ నిర్మించారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకలు ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనిల్‌ సుంకర బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘నేను సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టేటప్పటికే చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఆయనతో సినిమా చేయాలనే ఆలోచనే రాలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ వేడుకకి చిరంజీవిని ఆహ్వానించడానికని తొలిసారి ఆయన దగ్గరికి వెళ్లా. సరదాగా మాట్లాడుతూ... ‘మిమ్మల్ని ఎప్పట్నుంచో కలవాలనుకున్నా సర్‌’ అన్నా. ‘కలవడం ఏంటండీ? సినిమా చేస్తున్నాం’ అన్నారు. ఆయన అన్న ఆ మాట అలా నా మనసులో ఉండిపోయింది. అప్పటికి నా దగ్గర ‘వేదాలం’ కన్నడ హక్కులు ఉన్నాయి. అక్కడ ఓ స్టార్‌ హీరోతో సినిమా చేయాలనుకున్నా. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని మెహర్‌ రమేశ్‌ గుంటూరు జిల్లాలో పంపిణీ చేశారు. ఆ సందర్భంగా మేం కలుసుకున్నప్పుడు తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా ‘వేదాలం’ చేస్తే ఎలా ఉంటుందని మాట్లాడుకునేవాళ్లం. మెహర్‌ రమేశ్‌ అంతకుముందే ఆ సినిమా గురించి చిరంజీవి సర్‌తో చర్చించారట. ఆయనకీ బాగా నచ్చిన కథ అది. అలా ఆ కథ వల్లే మాకు చిరంజీవి డేట్స్‌ ఇచ్చారు. అలా మొదలైంది తెలుగులో ‘భోళాశంకర్‌’ ప్రయాణం’’.

  • ‘‘అన్నా చెల్లెళ్ల బంధం నేపథ్యం అనేది అందరి హృదయాల్నీ స్పృశించే అంశం. మంచి కుటుంబ వినోదం ఉన్న కథ. కచ్చితంగా ప్రేక్షకులకు చేరువవుతుందని నమ్మాం. ఇప్పటికే మంచి ఫలితం అందుకున్న అనుభూతి కలుగుతోంది. చిరంజీవి - కీర్తి సురేష్‌ అన్నా చెల్లెలుగా ఒదిగిపోయారు. ఎప్పటికీ మరిచిపోలేని స్థాయిలో ఆ బంధాన్ని, పాత్రల్ని పండించిన అనుభూతి కలిగింది సినిమా చూశాక.  నేను, మెహర్‌ రమేశ్‌ కలిసి కీర్తి ఇంటికి వెళ్లి  ఆ పాత్ర గురించి చెప్పి ఒప్పించాం. కీర్తిని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం. తమన్నా, సుశాంత్‌ ఇలా అందరి పాత్రలూ బాగుంటాయి. మహతి స్వరసాగర్‌ మంచి పాటలు ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా  ఉంది. తమన్‌ ‘దూకుడు’ సినిమాతో మరోస్థాయికి వెళ్లారు. అలా మహతిని కూడా మరో స్థాయికి తీసుకెళుతుందీ చిత్రం’’.
  • ‘‘మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నప్పుడు నేను ఆయనతోపాటే సెట్‌లో ఉంటాను. నాకు మహేశ్‌కీ మధ్య బంధం అలాంటిది. మిగతా సినిమాల చిత్రీకరణలకి నేను వెళ్లను. కానీ ‘భోళాశంకర్‌’ చేస్తున్నప్పుడు మహేశ్‌ ఓ మాట చెప్పారు. ‘ఓ హీరోగా చెబుతున్నా. ప్రతి రోజూ మీరు సెట్‌లో ఉండాలి. నిర్మాత సెట్లో ఉంటే చిరంజీవి గారు చాలా ఆనందపడతారు’ అన్నారు. ఆ మాట తర్వాత నేను రోజూ సెట్‌కి వెళ్లేవాణ్ని. నిజంగా ఇదొక మరపురాని ప్రయాణం అయ్యింది. ఒక్క రోజూ కూడా వృథా కాలేదనే అభిప్రాయం కలిగింది. చిరంజీవి సినిమాలో లీనమయ్యే విధానం కూడా గొప్పగా ఉంటుంది. నిర్మాణ వ్యయాన్ని నియంత్రించడంలో ఆయనకున్న స్పష్టత ఎవ్వరికీ ఉండదేమో’’.
  • ‘‘జయాపజయాలు ప్రతి ఒక్కరికీ సహజం. కానీ ఏ సినిమాకి ఆ సినిమాతో కొత్త ప్రయాణం మొదలవుతూ ఉంటుంది. గత సినిమాల కంటే ప్రస్తుతం తీస్తున్న సినిమా ఎలా వచ్చిందనేదే ముఖ్యం. నిర్మాణ వ్యయం పెరగడం అంటే నా ఒక్కడికే జరగడం లేదు. అన్ని సినిమాల వ్యయాలు పెరుగుతున్నాయి. నాకు సినిమాపై పూర్తి అవగాహన ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. తగ్గించాలనే ప్రయత్నిస్తాం, కానీ అంత తేలిక కాదు. ‘ఏజెంట్‌’ అనుభవంతో పక్కాగా స్క్రిప్ట్‌ సిద్ధమయ్యాకే సెట్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా సంస్థలో వివిధ దశల్లో పది సినిమాలు ఉన్నాయి. కానీ ఏదీ మొదలు పెట్టలేదు. అంతా పక్కా అనుకున్నాకే వెళతాం’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని