Updated : 10 Feb 2022 15:26 IST

Tollywood: ఏపీ సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సినిమా టికెట్ల ధరల అంశంపై సీఎంకు వారు వివరించనున్నారు. జీవో నం 35లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు, సినిమా టికెట్‌ ధరలపెంపు, ఏసీ, నాన్ ఏసీ థియేటర్లలో కనీస, గరిష్ఠ టికెట్ ధరల పెంపు, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో ఆహారపదార్థాల ధరలపై వీరంతా సీఎంతో చర్చించనున్నారు. థియేటర్ల వర్గీకరణ, ధరల పెంపుపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో దానిపైనా చర్చించే వీలుంది. రోవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం.. పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమైన తరుణంలో ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది. ఈ సమావేశంతో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఒకే విమానంలోనే అందరూ.. 

సీఎంతో భేటీకి ఎవరెవరు వస్తున్నారో తనకు తెలియదని.. తనకు మాత్రం ఆహ్వానం అందిందని చిరంజీవి తొలుత మీడియాతో చెప్పినప్పటికీ అందరూ ఒకే విమానంలో ప్రయాణించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. మహేశ్‌బాబుకు చిరంజీవి పుష్పగుచ్ఛం అందజేస్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. ఈరోజు మహేశ్‌-నమ్రత వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని