Tollywood drug case: రేపు ఈడీ ఎదుట విచారణకు పూరి జగన్నాథ్‌

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు విచారణను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు ముమ్మరం చేశారు

Updated : 30 Aug 2021 17:42 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు విచారణను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సిట్‌ అధికారి శ్రీనివాస్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను మంగళవారం ప్రశ్నించనుంది. ఈ మేరకు పూరి జగన్నాథ్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 31న ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసాగనుంది. సినీ రంగానికి చెందిన 12మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన అబ్కారీ శాఖ సిట్ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈడీ అధికారులు మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది.

డ్రగ్స్ కేసులో అబ్కారీ శాఖ సిట్ అధికారులు మొత్తం 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో 12మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు... మరో 50మందిని విచారించారు. ఇప్పటి వరకూ 11 నేరాభియోగపత్రాలు దాఖలు చేశారు. అభియోగపత్రాల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన మత్తు మందు సరఫరాదారులతో పాటు... స్థానికంగా డ్రగ్స్ విక్రయించే వ్యక్తులున్నారు. 12మంది సినీతారల గోళ్లు, తల వెంట్రుకల నమూనాలు సైతం సేకరించిన అబ్కారీ అధికారులు.. ఎక్కడ కూడా వాళ్ల ప్రస్తావన తేలేదు. ప్రస్తుతం మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి 12మంది సినీరంగానికి చెందిన వాళ్లను సాక్ష్యాలుగానే ప్రశ్నించే అవకాశం ఉంది. మనీలాండరింగ్ జరిగినట్లు తేలితే సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని