సంక్షిప్త వార్తలు(4)

‘ది నైట్‌ మేనేజర్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించాడు ఆదిత్యరాయ్‌ కపూర్‌. థ్రిల్‌, డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన మరో థ్రిల్లర్‌ చిత్రం ‘గుమ్రా’లో కనిపించనున్నాడు.

Published : 24 Mar 2023 00:58 IST

ఒక హత్య... ఒకేలా ఉండే ఇద్దరు అనుమానితులు

‘ది నైట్‌ మేనేజర్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించాడు ఆదిత్యరాయ్‌ కపూర్‌. థ్రిల్‌, డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన మరో థ్రిల్లర్‌ చిత్రం ‘గుమ్రా’లో కనిపించనున్నాడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని వర్ధన్‌ కేత్కర్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో పోలీసు అధికారిగా నటిస్తోంది మృణాల్‌. సస్పెన్స్‌లతో కూడిన ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక యువకుడి హత్య కేసులో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు గుర్తిస్తారు. కానీ ఆ ఇద్దరూ ఒకే రకమైన పోలికలతో ఉండటంతో హంతకుణ్ని కనిపెట్టడం సవాల్‌గా మారుతుంది. మరి చివరికి ఎలా ఆ కనిపెట్టారో అనేది ఆసక్తికరం. ఈ సినిమాతో తొలిసారి ఆదిత్యరాయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూషణ్‌ కుమార్‌, మురాద్‌ ఖేతాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ చిత్రం ‘థడం’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.


‘పరారీ’ ఏమో!

యోగేశ్వర్‌, అతిధి జంటగా సాయి శివాజీ తెరకెక్కించిన చిత్రం ‘పరారీ’. జి.వి.వి.గిరి నిర్మాత. సుమన్‌, మకరంద్‌ దేశముఖ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ‘‘ఏమో ఏమో’’ గీతాన్ని నటి విజయశాంతి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మహిత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. ఈ ‘ఏమో ఏమో’ పాటను సాయి చరణ్‌, సురభి శ్రావణి చక్కగా ఆలపించారు’’ అన్నారు. ‘‘విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. విజయశాంతి మా పాటను విడుదల చేసి.. నా డ్యాన్స్‌ను మెచ్చుకోవడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు హీరో యోగేశ్వర్‌.


కృష్ణగాడంటే ఒక రేంజ్‌

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రాజేష్‌ దొండపాటి తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కె శ్రీలత సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు శ్రీవాస్‌ విడుదల చేశారు. ‘‘కొత్తదనం నిండిన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌.. ఇలా అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: సాబు వర్గీస్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.కె.రఫి.


కశ్మీర్‌ ప్రయాణం ముగిసింది

విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లియో’. ‘మాస్టర్‌’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రియా ఆనంద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొన్నాళ్లుగా కశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుదీర్ఘ షెడ్యూల్‌ తాజాగా పూర్తయినట్లు సమాచారం. త్వరలో చెన్నైలో మరో కొత్త షెడ్యూల్‌ మొదలు కానున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌, సంజయ్‌ దత్‌లతో పాటు మిగిలిన ముఖ్య తారాగణం పాల్గొననుంది. ఈ షెడ్యూల్‌ దాదాపు 15రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత క్లైమాక్స్‌ చిత్రీకరణ కోసం చిత్ర బృందం హైదరాబాద్‌కు రానుంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని