అసలు... ఓ అరుదైన కథ

ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథతో సినిమాలు తీసే దర్శకుడు రవిబాబు. ‘అల్లరి’ మొదలుకొని... ‘ఆవిరి’ వరకు అ అక్షరంతో మొదలయ్యే పేర్లతో సినిమాలు చేశారు.  

Published : 13 Apr 2023 02:32 IST

ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథతో సినిమాలు తీసే దర్శకుడు రవిబాబు. ‘అల్లరి’ మొదలుకొని... ‘ఆవిరి’ వరకు అ అక్షరంతో మొదలయ్యే పేర్లతో సినిమాలు చేశారు.  ఇప్పుడు ‘అసలు’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రవిబాబు కథతో.. ఆయన శిష్యులు ఉదయ్‌, సురేష్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది.  ఈటీవీ విన్‌ సమర్పణలో ఏ ఫ్లైయింగ్‌ఫ్రాగ్స్‌ పతాకంపై రవిబాబు నిర్మించారు. పూర్ణ, సూర్యకుమార్‌, సత్యకృష్ణన్‌  తదితరులు కీలకపాత్రలలో నటించారు.  ఈ చిత్రం గురువారం నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీ యాప్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా రవిబాబుతో ‘ఈనాడు సినిమా’ ముచ్చటించింది.

మళ్లీ అ అక్షరంతోనే మీ సినిమా. ‘అసలు’ ప్రయాణం ఎలా మొదలైంది?

సినిమాల్లో అఆలు నేర్చుకోవాలని వచ్చా. ఎక్కడో ‘అ’తోనే ఆగిపోయానేమో (నవ్వుతూ). అయినా ఇలా ‘అ’ అక్షరంతో  మొదలయ్యే సినిమాలు చాలామందే తీసినట్టున్నారు కదా. ఇక ‘అసలు’ ప్రయాణం అంటారా? ఈటీవీ విన్‌ యాప్‌ కోసమే చేసిన సినిమా ఇది.

‘అసలు’ కథేమిటి?  దీని ప్రత్యేకత ఏమిటి?

ప్రొఫెసర్‌ చక్రవర్తి హత్య నేపథ్యంలోనే ఈ  కథంతా జరుగుతుంది. ఇదివరకు థ్రిల్లర్‌, హారర్‌, ప్రేమకథలు... ఇలా రకరకాల చిత్రాలు చేశా.  ఇది వాటికి భిన్నమైన సినిమా.  గాఢతతో సాగే ఓ మిస్టరీ కథ. ఒక సినిమా చేశాక, మరొక కొత్త రకమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి. ఈ మాధ్యమం ప్రత్యేకత అదే కదా. తీసిందే తీస్తామంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. స్వతహాగా నాకు ఒక సారి చేసింది మళ్లీ చేయడం  ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలు చేస్తూనే.. ‘అల్లరి’ నుంచి ‘అసలు’ దాకా వచ్చా.

ఈ సినిమాలో మీరు నటించారు, నిర్మాణం చేశారు. దర్శకత్వానికి మాత్రం దూరంగా ఉన్నారు. కారణమేమిటి?

దర్శకత్వ పర్యవేక్షణ చేశా. నా దగ్గర సహాయ దర్శకులుగా ఎప్పట్నుంచో పనిచేస్తున్నారు ఉదయ, సురేష్‌. ఈ సినిమాతో వాళ్లని దర్శకులుగా పరిచయం చేయాలనుకున్నా.

మీ సినిమాలు చూసి మీరెప్పుడైనా భయపడ్డారా?

తీసేటప్పుడు ప్రతిదీ తెలుస్తుంది కదా, దాంతో నా సినిమాలు నన్నెప్పుడు భయపెట్టలేదు. వేరే సినిమాలు చూసి భయపడతాను. అవును, అనసూయ తీసేముందు ప్రపంచంలో అత్యుత్తమమైన హారర్‌ సినిమాలు వంద ఎంచుకుని చూశా. ఆ సినిమాలు  ఒకొక్కటిగా చూస్తూ వణికిపోయేవాణ్ని. వాటికంటే ఉత్తమం కాకపోయినా, వాటిలాగా గాఢంగా, భయపెట్టేలా ఉండాలనే సినిమాలు చేస్తుంటా. ‘అసలు’ సినిమాతో భయపడరు కానీ, ఆ కథకి అతుక్కుపోయి అందులో లీనమవుతారు.

మీ సినిమాలతో భయపెడుతుంటారు,  మీ జీవితంలో భయంకరమైన సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా?

ఒక్కటే జరిగింది. ఎందుకు జరిగిందో చెప్పినప్పుడు ఓ పెద్దాయన తిట్టాడు. స్వతహాగా నేను చాలా భయస్తుడిని. ఇంట్లో ఒక్కడినే ఉండలేను. హారర్‌ సినిమాలు తీసేవాడిని నాకే భయం అంటే నమ్మరేమో కానీ... ఇంట్లో ఎవ్వరూ లేకపోతే లైట్స్‌ అన్నీ ఆన్‌ చేసుకుని సోఫాలో పడుకుంటా. బెడ్‌ రూమ్‌కి కూడా వెళ్లను (నవ్వుతూ). ఓసారి ఓ సినిమా షూటింగ్‌ చేసి హోటల్‌కి వెళుతున్నప్పుడు... ఆ హోటల్‌ మేనేజర్‌ వచ్చి కంగ్రాట్స్‌ సర్‌ అని చెప్పాడు. ఎందుకని అడిగితే.. ఈ రోజు హోటల్‌లో బస చేస్తున్నది మీరొక్కరే అన్నాడు. 150 గదులున్న ఓ హోటల్‌లో నేనొక్కడినేనా అని భయమేసింది. రూమ్‌కి వెళ్లి టీవీ ఆన్‌ చేస్తే ‘పారానార్మల్‌ యాక్టివిటీ’ సినిమా వస్తోంది. సినిమా పూర్తయ్యాక నిద్ర రావడం లేదు. వెంటనే దుస్తులు సర్దేసుకుని హోటల్‌ నుంచి బయటికొచ్చా. అలాగే  ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ హీరోయిన్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇల్లు ఖాళీ చేస్తున్నాననీ, వంట గదిలోకి వెళితే వెనకాల ఎవరో ఉన్నట్టు... సోఫాలో కూర్చుంటే పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తోందని చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు, నాకు హోటల్‌లో ఎదురైన అనుభవాల నుంచే ‘అవును’ కథ పుట్టింది.

మీ సినిమాల్లో కీలక పాత్ర కోసం తరచూ పూర్ణని ఎంచుకుంటుంటారు. కారణమేమిటి?

ఆమెతో నాకు లవ్‌ ఎఫైర్‌ ఉంది. ఇలా అన్నానని మీరు ఇంకేదో అనుకునేరు. ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది. నటులు ఎప్పుడైనా దర్శకుడు చెప్పిన దానికంటే పది, ఇరవై శాతం అదనంగా జోడించి నటిస్తుంటారు. కానీ పూర్ణ 200 శాతం జోడిస్తుంది. అంత మంచి నటి ఆమె. అందుకే నా సినిమాల్లో కథానాయికలు చేసే ఏ వేషమైనా సరే పూర్ణ గుర్తొస్తుంది. అయితే ఆమె కొన్ని చేస్తుంది, చేయదు. మొన్న ‘వాషింగ్‌ మెషిన్‌’ సినిమాకోసం అడిగా. నేను చేయను సర్‌ అని చెప్పింది. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. ఆమె పాత్రకి నేను కరెక్ట్‌ అనుకుంటేనే వంద శాతం నటిస్తుంది.  అలా కాకుండా నాకోసం ఒప్పుకోకూడదు కదా. యామీ గౌతమ్‌, భూమికలాంటి కథానాయికలూ నా సినిమాల్లో చేశారు. కానీ పూర్ణ నేను చేసిన ఐదు సినిమాల్లో నటించింది.


ఓటీటీ వేదికలు చాలా ఉన్నాయి. ఈటీవీ విన్‌ కోసమే ఈ సినిమా ఎందుకు చేశారు?

అందుకు కారణం... రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు. ఆయన ఈ వయసులో తెలుగువాళ్లకి ఓ యాప్‌ ఉండాలని ఈటీవీ విన్‌ తీసుకొచ్చారు. అందులో తొలి చిత్రాల్లో నాదొకటి ఉండాలనుకున్నా. మిగతా యాప్స్‌ అన్నీ ఖరీదుగా ఉన్నాయని  భావిస్తున్న సమయంలో రోజుకి  ఒక రూపాయి ధరతో ఈటీవీ విన్‌ యాప్‌ తీసుకొచ్చారు రామోజీరావు. ఇది మామూలు యాప్‌ కూడా కాదు. సినిమాలు, టెలివిజన్‌ షోలు, న్యూస్‌... ఇలా అన్నీ ఉంటాయి. ఇలాంటి యాప్‌ ఎక్కడా లేదు. ఈ ఆలోచన నాకు చాలా నచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు కలిసినప్పుడు ఇందులో నా సినిమా ఎందుకు ఉండకూడదని చేసిన సినిమానే ఇది. తెలుగువాళ్లకి ఎన్టీఆర్‌ ఎంత గొప్ప వ్యక్తో, అందుకు సమానమైన వ్యక్తి రామోజీరావు. గొప్ప దార్శనికుడు. ఆయన సంస్థలో రెండు సినిమాలు చేసే అదృష్టం నాకు దక్కింది. ఆ క్రమంలో ఆయన్ని కలిసి మాట్లాడటం, ఆయన జీవితం గురించి తెలుసుకోవడం, ఆయన ఫిలాసఫీని అర్థం చేసుకోవడం గొప్పగా అనిపించింది. ఈ వయసులోనూ పద్దెనిమిది గంటలు పనిచేస్తారు? విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే... మనం వెళ్లిపోయాక రెస్ట్‌ మాత్రమే తీసుకుంటాం కదా అంటారు. అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లే అనుకున్నవి సాధిస్తారు.


హత్య నేపథ్యంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్తగా ఏం చూపించారు?

అరుదైన హత్య నేపథ్యంతో కూడిన కథ ఇది. హత్య చేసిన హంతకుడు ఎదురుగానే కనిపిస్తున్నాడు. కానీ నిరూపించడం సాధ్యం కాదు. ఆ హత్య అంత తెలివిగా చేశాడన్నమాట. హత్యకి గురైన వ్యక్తికీ, హంతుకుడికీ చాలా దగ్గరి  సంబంధం ఉంటుంది. ఈ హత్య ఎవరు చేశారో నిరూపించడానికి ఓ  తెలివైన పోలీస్‌ అధికారి  రంగంలోకి దిగుతాడు. హంతకుడు ఆధారాలతో దొరికాడా లేదా అన్నది అసలు కథ. చాలా గాఢమైన కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని