పంజాబీ గాయకుడి బయోపిక్‌ ‘చమ్‌కీలా’

తన పాటలతో పంజాబీ ప్రజలను ఆకట్టుకున్న సంగీతకారుడు అమర్‌ సింగ్‌ చమ్‌కీలా. ఆ రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడుపోయిన రికార్డింగ్స్‌లో అమర్‌ సింగ్‌ చేసినవే ఎక్కువ.

Updated : 31 May 2023 02:14 IST

తన పాటలతో పంజాబీ ప్రజలను ఆకట్టుకున్న సంగీతకారుడు అమర్‌ సింగ్‌ చమ్‌కీలా. ఆ రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడుపోయిన రికార్డింగ్స్‌లో అమర్‌ సింగ్‌ చేసినవే ఎక్కువ. 27 ఏళ్ల వయసులోనే  మరణించిన ఆయన జీవితం ఆధారంగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చమ్‌కీలా’. అమర్‌ సింగ్‌ పాత్రలో దిల్‌జీత్‌ దోసంజా కనిపించగా, ఆయన భార్య అమర్‌జోత్‌ కౌర్‌ పాత్రలో పరిణీతి చోప్రా నటించనుంది. మంగళవారం ఆ సినిమా టీజర్‌ను చిత్రబృందం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసింది. ఆ సినిమాలో తలపాగా లేకుండా దిల్‌జీత్‌ కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ బయోపిక్‌ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చిత్రంలోని తన పాత్ర గురించి దిల్‌జీత్‌ మాట్లాడుతూ..‘‘ అమర్‌ సింగ్‌ పాత్ర పోషించడం నా జీవితంలో సవాలుతో కూడిన అనుభవం. ఓటీటీలో మరోకొత్త తరహా కథతో మీ ముందుకు రావడం చాలా ఆసక్తిగా ఉంది. ఈ అద్భుతమైన కథ కోసం సినీబృందం, పరిణీతితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నా మీద నమ్మకంతో ఈ పాత్రకోసం దర్శకుడు నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. తప్పక అమర్‌ సింగ్‌ పాత్రకు న్యాయం చేస్తానన్న నమ్మకం నాకుంది’’ అని అన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.


ఏసుక్రీస్తుపై మరో సినిమా

ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. హాలీవుడ్‌ దిగ్గజం మార్టిన్‌ స్కార్సీస్‌ ఈ ప్రాజెక్టు చేపడతానంటూ ప్రకటించారు. నటుడు, నిర్మాత, స్క్రిప్టు రచయిత దర్శకుడు, అయిన మార్టిన్‌ పోప్‌ ఫ్రాన్సిస్‌తో వాటికన్‌సిటీలో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. ‘పోప్‌ విజ్ఞప్తి మేరకు ఒక కళాకారుడిగా నేను నాదైన శైలిలో స్పందిస్తున్నా. నా ఊహాశక్తితో జీసస్‌ క్రైస్ట్‌పై ఓ మంచి సినిమా తీసేలా స్క్రిప్టు రాయాలనుకుంటున్నా’ అన్నారు. వాటికన్‌ సిటీలో జరిగిన గ్లోబల్‌ ఈస్తటిక్స్‌ ఆఫ్‌ ది కాథలిక్‌ ఇమాజినేషన్‌ సమ్మేళనంలో ఆయన పోప్‌ను కలుసుకున్నారు. మార్టిన్‌ చివరిసారిగా ‘కిల్లర్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో హాలీవుడ్‌ స్టార్లు లియోనార్డో డికాప్రియో, రాబర్ట్‌ డి నీరో, లిల్లీ గ్లాడ్‌స్టోన్‌లు నటించారు.


తెరపైకి గోద్రా అల్లర్లు

గుజరాత్‌లోని గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం, తదనంతరం చెలరేగిన అల్లర్ల సంఘటనల ఆధారంగా ‘యాక్సిడెంట్‌ ఆర్‌ కాన్‌స్పిరసీ గోద్రా’ అనే చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ఎం.కె.శివాక్ష్ దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు. గోద్రా రైలు దహనం, ఆపై మత ఘర్షణలు చోటు చేసుకోవడం వెనక ఏవైనా కుట్ర కోణాలు ఉన్నాయా? అనే కోణంలో మా కథ సాగుతుందంటున్నాయి చిత్రవర్గాలు. ‘వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం’ అని టీజర్‌ ప్రారంభంలో కనిపిస్తోంది. గుజరాత్‌ మత ఘర్షణలపై విచారణ కోసం ఏర్పాటైన నానావతి కమిషన్‌ నివేదిక ఆధారంగానూ కథ సాగుతోందని టీజర్‌ ద్వారా తెలుస్తోంది. ‘ఐదేళ్ల సుదీర్ఘమైన పరిశోధనలో ఈ ఘటనల వెనక దాగిన ఎన్నో నివ్వెరపోయే వాస్తవాలు కనుగొన్నాం. తగినన్ని సాక్ష్యాలతో వాటిని సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాం’ అని సినీ వర్గాలు తెలిపాయి. బీజే పురోహిత్‌, రాంకుమార్‌ పాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని