‘రజాకార్‌’లో వాస్తవ చరిత్రను చూపించారు

‘‘రజాకార్‌’ చిత్రాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. సినిమాని సినిమాగానే చూడాలి. ఇది ఏ పార్టీకి మేలు చేసేలా ఉండదు. దీంట్లో వాస్తవంగా జరిగిన చరిత్రను చూపించారు’’ అన్నారు భాజపా నేత డీకే అరుణ.

Published : 11 Oct 2023 02:24 IST

‘‘రజాకార్‌’ చిత్రాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. సినిమాని సినిమాగానే చూడాలి. ఇది ఏ పార్టీకి మేలు చేసేలా ఉండదు. దీంట్లో వాస్తవంగా జరిగిన చరిత్రను చూపించారు’’ అన్నారు భాజపా నేత డీకే అరుణ. ఆమె హైదరాబాద్‌లో మంగళవారం ‘రజాకార్‌’ చిత్ర ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన బహుభాషా చిత్రమిది. యాటా సత్యనారాయణ తెరకెక్కించారు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌ పాండే కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘‘భారతి భారతి ఉయ్యాలో’’ అనే గీతాన్ని డీకే అరుణ విడుదల చేశారు. రజాకార్ల ఆగడాలను ఎండగడుతూ సాగే ఈ పాటను అనసూయపై చిత్రీకరించారు. ఈ గీతానికి భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా.. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. మోహన భోగరాజు, భీమ్స్‌, స్ఫూర్తి జితేందర్‌ సంయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ‘‘ఈతరానికి రజాకార్ల గురించి అంతగా తెలియదు. అలాగే తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న స్వాతంత్య్రం వచ్చిందని చాలా కొద్ది మందికే తెలుసు. ఆరోజును ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకున్నా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని అధికారికంగా జరపలేదు. ఇదెంతో దురదృష్టకరం. చరిత్రను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా చేయడం ఓ సాహసం. తెలంగాణ ప్రజలు రజాకార్ల వల్ల ఎన్ని కష్టాలు పడ్డారో ఈ చిత్రంతో దేశానికి చూపించనున్నారు’’ అన్నారు. ‘‘బతుకమ్మ పాటల్లో తెలంగాణ చరిత్ర, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలు, భూస్వాముల దోపిడీ వంటివన్నీ వింటూ పెరిగాను. ఈ బతుకమ్మ పాటల్లో ఆనందం ఉంది. బాధ ఉంది. ఈ పాటను.. ఆటను ఈ చిత్రంతో తెరపై చూపించే అవకాశం దొరికినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. రజాకార్‌ అంటే ఓ అరాచకుడని మనం చదువుకున్నాం.. విన్నాం. అలాంటి అరాచకుల చరిత్రను తెరపై చూపించే అవకాశమిచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు’’ అన్నారు దర్శకుడు సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి, పూజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని