సవాళ్లతో నాయికా సవారీ

‘‘ప్రేక్షకులను మెప్పించేందుకు.. వాళ్లు తమపై పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టుకునేందుకు ఎలాంటి సవాళ్లు స్వీకరించడానికైనా సిద్ధమే’’ అంటుంటారు మన వెండితెర తారలు.

Updated : 12 Feb 2024 07:04 IST

‘‘ప్రేక్షకులను మెప్పించేందుకు.. వాళ్లు తమపై పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టుకునేందుకు ఎలాంటి సవాళ్లు స్వీకరించడానికైనా సిద్ధమే’’ అంటుంటారు మన వెండితెర తారలు. ఇందుకు కథానాయికలు మినహాయింపు కాదు. ఈ విషయంలో ముఖ్యంగా ఈతరం అందాల భామలు ఓ అడుగు ముందే ఉంటున్నారు. వాళ్లు సినీప్రియుల్ని అలరించేందుకు సవాల్‌ నిండిన పాత్రలతో సవారీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకోసం కొత్త విద్యలు నేర్చుకుంటూ.. తెర వెనుక అలుపెరగని రీతిలో శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఇలా తమ సినిమాల కోసం ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్న నాయికలు తెలుగులో పలువురు ఉన్నారు. మరి వాళ్లెవరు? ఆ చిత్ర విశేషాలేంటి?


‘స్వయంభూ’ కోసం సంయుక్త సాహసం..

న జీవితమంతా సాహసాల మయమే అంటోంది నటి సంయుక్తా మేనన్‌. ‘భీమ్లా నాయక్‌’ చిత్రంతో తొలి అడుగులోనే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ మలయాళ సోయగం.. ‘బింబిసార’, ‘సార్‌’, ‘విరూపాక్ష’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు చూపించింది. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘స్వయంభూ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంయుక్త యాక్షన్‌ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనుంది. అందుకే దీంట్లోని యుద్ధ నేపథ్య సన్నివేశాల కోసం ఆమె కూడా ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా స్వయంగా వెల్లడించింది. ‘‘ఈ ఏడాది కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితమంటే ఏమిటో తెలుసుకుంటున్నా. సౌకర్యంగా ఒకచోట ఉండిపోవడాన్ని నేను ఇష్టపడను. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటా. ప్రస్తుతం నా కొత్త సినిమా ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నా. ఇది నాకొక కొత్త మానసిక అనుభూతిని అందిస్తోంది’’ అంటూ ఆమె గుర్రంపై స్వారీ చేస్తున్న ఫొటోల్ని పంచుకుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే హీరో నిఖిల్‌ కూడా పలు యుద్ధ విద్యలతో పాటు గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. దీంట్లో ఆయన ఓ యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.


హైబ్రిడ్‌ పిల్ల... ఉత్తరాంధ్ర యాస

‘‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల’’ అంటూ ‘ఫిదా’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే తెలంగాణ యాసలో అదరగొట్టి అందరి మదిని దోచుకుంది సాయిపల్లవి. ఇప్పుడామె తొలిసారి ఉత్తరాంధ్ర యాసలో సంభాషణలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె నాగచైతన్యతో కలిసి ‘తండేల్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. పాకిస్థాన్‌ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ మత్స్యకారుడి జీవిత కథతో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో రాజు అనే పాత్రలో చైతూ కనిపించనుండగా.. అతని ప్రేయసిగా బుజ్జి తల్లి అనే పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. దీని కోసమే ఆమె ఉత్తరాంధ్ర యాసలో సంభాషణలు చెప్పేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని సెట్లోకి అడుగు పెట్టింది. మరి ఆ యాసలో తను పలికే సంభాషణలు ఎలా ఉండనున్నాయో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.


కృతి బెల్లీ డ్యాన్స్‌

‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరపై ఎగసిపడిన కొత్త అందాల కెరటం కృతి శెట్టి. ఏడాదిన్నర క్రితం వరకు తెలుగు నాట జోరు చూపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తోంది. అయితే ఇప్పుడామె ఓ చిత్రం కోసం బెల్లీ డ్యాన్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. విజయ్‌ సినిమాలోని ‘‘అరబిక్‌ కుతు’’ పాటకు బెల్లీ డ్యాన్స్‌ చేసి తన ప్రతిభను అందరికీ పరిచయం చేసింది కృతి. ఆమె ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో ‘వా వాతియారే’, ‘లవ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌’, ‘జీనీ’ చిత్రాల్లో నటిస్తోంది. మరి వీటిలో ఏ సినిమాలో తన బెల్లీ డ్యాన్స్‌తో కనువిందు చేయనుందో తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని