Kareena kapoor: నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!

బాలీవుడ్‌ సీనియర్‌ నాయిక కరీనాకపూర్‌  టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌కి భారత్‌ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది.

Updated : 07 May 2024 12:19 IST

బాలీవుడ్‌ సీనియర్‌ నాయిక కరీనాకపూర్‌  టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌కి భారత్‌ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన సినీ, వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకుందామె.

  • హీరో లేదా హీరోయిన్‌ ఒక్కరితోనే సినిమా ఆడదు. కథ, కథనంతోపాటు అందులోని పాత్రల నటన చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దానికి తగ్గట్టే నాకొస్తున్న ప్రతి పాత్రా ఆసక్తికరంగా ఉండేలా చూసుకుంటున్నా. దానికి కొంచెం హాస్యం అద్దేలా ప్రయత్నిస్తున్నా. ‘క్రూ’తో కథానాయికలు సైతం బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టగలరని తేలడం సంతోషంగా ఉంది.
  • సినిమా అంటేనే వినోదం. నేను, టబు, కృతి సనన్‌ నటించిన ‘క్రూ’లాంటి మంచి వినోదం ఉన్న కథ అందిస్తే చాలు ఏ చిత్రమైనా విజయం సాధిస్తుంది. ఇందులో హీరోలు లేరు. మేం ముగ్గురం కథానాయికలమే! అయినా మా చిత్రం రూ.150 కోట్లు వసూళ్లు దాటాయి. దీనర్థం సినిమాకి కథే అసలైన హీరో.
  • ప్రస్తుతం ‘సింగం అగైన్‌’ చిత్రీకరణలో ఉన్నా. ఇది నిఖార్సైన మగాళ్ల సినిమా. అందర్నీ మెప్పించే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో దీపిక, నాది కీలకమైన పాత్రలు. దీపావళికి విడుదల కానున్న ఈ చిత్రం బాలీవుడ్‌కే ఈ ఏడాది బొనాంజాలా ఉంటుంది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు.
  • యూనిసెఫ్‌ ప్రచారకర్తగా ఎంపికవడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నేను ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున సెలెబ్రిటీ అడ్వకేట్‌గా దేశమంతా తిరిగా. పిల్లల హక్కులు, విద్య ఆరోగ్యంపై పనిచేశా. ఈ క్రమంలో చాలామంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలిశా. వాళ్ల కథలు, కలలు, ఆశయాలు.. మాతో పంచుకున్నారు. యూనిసెఫ్‌ ప్రచారకర్తగా ఇప్పుడు చేయాల్సిన పనిని పదేళ్ల కిందటే చేశాను.
  • ఒక నటిగా నా గొంతు లక్షల మందిని తేలికగా చేరుతుందనే అంబాసిడర్‌గా ఎంపిక చేశారనుకుంటున్నా. ఈ పదవిని ఒక బాధ్యతగా భావిస్తా. దేశంలోని పిల్లల హక్కుల కోసం స్వరం పెంచుతా. అదే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రేమగా మెలగాలి. వాళ్ల విషయంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నా.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని