ANR: అక్కినేని ధరించిన ఆ కళ్లజోడు.. అయిదు వేలకు పైగా అమ్మకాలు..

పౌరాణిక చిత్రం ద్వారా కథానాయకుడైన ఏయన్నార్‌ తొలిరోజుల్లో జానపద హీరోగా జనానికి చేరువయ్యారు. ఆ దశలో సాంఘిక చిత్రాలకు సరిపోడన్న ముద్ర కూడా ఆయన మీద పడింది.

Published : 14 Nov 2023 14:29 IST

పౌరాణిక చిత్రం ద్వారా కథానాయకుడైన ఏయన్నార్‌ తొలిరోజుల్లో జానపద హీరోగా జనానికి చేరువయ్యారు. ఆ దశలో సాంఘిక చిత్రాలకు సరిపోడన్న ముద్ర కూడా ఆయన మీద పడింది. అలాంటి రోజుల్లో ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో ‘సంసారం’ (1950)లో ‘వేణు’ పాత్రలో నటించే అవకాశం తొలిసారిగా వచ్చింది. జానపదాల నటుడికి ప్యాంటూ, షర్టూ పాత్రేమిటి? అని అప్పటి పరిశ్రమ వింతగా చెప్పుకొందట. దాన్ని సవాలుగా తీసుకున్న అక్కినేని ఆ వేషం కోసం పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నారట. ‘సంసారం’ సినిమా ప్రథమార్ధంలో అమాయక పల్లెటూరి కుర్రాడిగా, మొరటుగా ఉండే ‘వేణు’ పాత్ర పట్నానికి చేరిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. వేష, భాషలు, కవళికలు విభిన్నంగా కనిపిస్తాయి.

తన పాత్ర మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాగేశ్వరరావు ‘సంసారం’లోని ‘‘కల నిజమాయేగా కోరిక తీరేగా..’’ పాటలో గ్లామరస్‌గా కనిపించడం కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచించారట. మద్రాసు మౌంట్‌ రోడ్డులోని ‘మయో ఆప్టికల్స్‌’ దుకాణానికి వెళ్లి, అప్పటి గుండ్రని అద్దాలకు భిన్నంగా తన ముఖానికి చక్కగా అమరే నలుచదరం కళ్లద్దాల్ని ఎంపిక చేసుకుని పాటలో ధరించారట. ‘సంసారం’ విజయం సాధించింది. మద్రాసు పరిసరాల్లోని పల్లవరంలో చాలా రోజులు ఆడటంతో పాటు ‘కల నిజమాయేగా కళ్లజోడు’ ట్రెండ్‌ సృష్టించింది. ఆ ఊపులో మద్రాసు ‘మయో ఆప్టికల్స్‌’ దుకాణంలో అప్పట్లోనే అయిదు వేల పైచిలుకు కళ్లద్దాలు అమ్ముడుపోయాయట. దుకాణం యజమానులు అక్కినేనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, అప్పటి నుంచి చాలాకాలం పాటు ఆయనకు కావలసిన కళ్లద్దాలు అక్కడి నుంచే రావడం దీనికి ముక్తాయింపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని