Kichcha Sudeep: దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నా.. 28 ఏళ్ల కెరీర్‌పై సుదీప్‌ పోస్ట్‌

28 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నటుడు కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) కృతజ్ఞతలు తెలిపారు.

Published : 31 Jan 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన 28 ఏళ్ల కెరీర్‌ను ఉద్దేశిస్తూ నటుడు కిచ్చా సుదీప్‌ నోట్‌ రాశారు. తాను ఈ స్థాయికి రావడానికి సహకరించిన అందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. ‘మొదటిసారి స్టూడియోలో అడుగుపెట్టిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి. అప్పుడే 28 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. ఇన్నేళ్ల నా కెరీర్‌ దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నా. ఎంతోమంది సహకారం వల్లే ఈ ప్రయాణం కొనసాగుతోంది. వాళ్లందరికీ రుణపడి ఉంటాను. ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ప్రతి చిన్న అంశాన్ని ఎంజాయ్‌ చేస్తాను. నేను ఉత్తమ నటుడినని చెప్పను. కానీ, నాకిచ్చిన ప్రతి పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సీరియల్‌ నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన సుదీప్‌ ‘తాయవ్వ’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన సహాయనటుడిగా పనిచేశారు. ‘స్పర్శ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడతో పాటు తెలుగు, హిందీలోనూ నటిస్తూ అలరిస్తున్నారు. ‘ఈగ’తో తెలుగువారికీ సుపరిచితులయ్యారు. ఇటీవల ‘విక్రాంత్‌ రోణ’తో పలకరించిన ఆయన ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని