Round Up 2022: సక్సెస్‌ సొగసులెన్ని?

చిత్రసీమలో విజయాలున్న కథానాయికలకి తిరుగే ఉండదు. ఇక స్టార్‌ హోదా కూడా దక్కించుకున్నారంటే అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కడతాయి.

Updated : 29 Dec 2022 07:24 IST

2022లో అలరించిన అగ్ర కథానాయికలు

చిత్రసీమలో విజయాలున్న కథానాయికలకి తిరుగే ఉండదు. ఇక స్టార్‌ హోదా కూడా దక్కించుకున్నారంటే అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కడతాయి. వాళ్ల కోసం దర్శకనిర్మాతలు చిత్రీకరణలు కూడా వాయిదా వేసుకుంటారు. మార్కెట్‌పై అంతగా ప్రభావం చూపిస్తుంటారు. ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నా... పోటీ పెరిగినా... కొద్దిమంది కథానాయికలు మాత్రం ఇప్పటికీ జోరు చూపిస్తున్నారు. 2022లో వాళ్ల ప్రభావం ఎలా సాగిందో తెలుసుకుందాం...

తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికలు కొద్దిమందే కనిపించేవాళ్లు. ఇప్పుడు వాళ్ల సంఖ్య ఎక్కువే. ఎప్పట్నుంచో కొనసాగుతున్న సీనియర్‌ భామలు పట్టు వదలకుండా  ఫామ్‌ని కొనసాగిస్తుండడం.... వాళ్లకి దీటుగా యువ భామలూ సత్తా చాటుతుండడం... పోటీగా కొత్త కథానాయికలూ దూసుకొచ్చి అదిరిపోయే విజయాలు సొంతం చేసుకొంటుండడమే అందుకు కారణాలు. అనుష్కశెట్టి మొదలుకొని... కొత్త భామలు కీర్తిశెట్టి, శ్రీలీల వరకూ ఇప్పుడు స్టార్‌ భామలే. అయితే ఈసారి సీనియర్ల కంటే యువతరమే ఎక్కువగా ప్రభావం చూపించింది. అనుష్కశెట్టి, కాజల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించనేలేదు. అనుష్క కొన్నాళ్లపాటు విరామం తీసుకోవడడం, ఆ తర్వాత తగిన కథల కోసం అన్వేషణ కొనసాగించే క్రమంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. ప్రస్తుతం  నవీన్‌ పొలిశెట్టితో కలిసి  యు.వి.క్రియేషన్స్‌ సంస్థలో ఓ చిత్రం చేస్తున్నారు. మహేష్‌ దర్శకుడు. మరో కథానాయిక కాజల్‌ ‘ఆచార్య’తో సందడి చేస్తుందనుకున్నా, కథ నుంచి ఆమె నటించిన  సన్నివేశాల్ని తొలగించడంతో సాధ్యం కాలేదు. పెళ్లయ్యాక కూడా ఆ సినిమా కోసం ఆమె సెట్‌కి వచ్చింది. ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఆమె సినిమాలు ఒప్పుకోలేదు. గతేడాదైనా ‘కొండపొలం’తో సందడి చేసిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ ఏడాది పూర్తిగా హిందీకే పరిమితమైంది..


జోరు కొనసాగుతోంది

పూజాహెగ్డే, రష్మిక, కీర్తిసురేష్‌, సాయిపల్లవి... రెండు మూడేళ్లుగా పెద్ద సినిమాల్ని, కాంబినేషన్లని ప్రభావితం చేస్తున్న కథానాయికలు వీళ్లు. పూజాహెగ్డే ఈసారి అనువాద చిత్రం ‘బీస్ట్‌’ మొదలుకొని మొత్తం నాలుగు సినిమాలతో సందడి చేసింది. ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’లో ఆమె కథానాయికగా నటించింది. ‘ఎఫ్‌3’లో ప్రత్యేకగీతంతో సందడి చేసింది. విజయాలు దక్కలేదు కానీ, పూజా జోరు మాత్రం కొనసాగుతోంది. కమర్షియల్‌ కథానాయిక అనిపించుకున్న ఆమె ఇప్పటికే మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తోంది. మరికొన్ని కీలకమైన ప్రాజెక్టుల విషయంలో ఆమె పేరు వినిపిస్తోంది. మరోభామ రష్మిక ఈ ఏడాది ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’, ‘సీతారామం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘సీతారామం’ ఘన విజయాన్ని సాధించగా,  ‘ఆడవాళ్లు... ’ పర్వాలేదనిపించింది. ఈ ఏడాది హిందీ కెరీర్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. ఆమె నటించిన హిందీ చిత్రం ‘మిషన్‌ మజ్ను’తోపాటు, ‘వారసుడు’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం ‘పుష్ప2’తోపాటు, రణ్‌బీర్‌ కపూర్‌ చిత్రం ‘యానిమల్‌’ చిత్రాలపై దృష్టి పెట్టింది రష్మిక. ‘సర్కారు వారి పాట’ సినిమాతో ఈ ఏడాది కీర్తిసురేష్‌ పేరు మార్మోగిపోయింది. కానీ ఆ చిత్రం ఫర్వాలేదనిపించింది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’ కూడా ఫలితాన్నివ్వలేదు. దాంతో ఆమెకి ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. కొత్త అవకాశాల పరంగా మాత్రం ఆమె దూకుడు కొనసాగింది. నానితో కలిసి ‘దసరా’, చిరంజీవికి చెల్లెలిగా ‘భోళాశంకర్‌’ చిత్రాల్లో నటిస్తోంది. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి ఈసారి ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల ముందుకొచ్చారు. రానాతో కలిసి నటించిన ‘విరాటపర్వం’ ఆమెకి మరోసారి మంచి పేరు తీసుకొచ్చింది. ‘గార్గి’ అనువాదంగా తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ కొనసాగుతుండడంతో కథానాయికలు ఇదివరకటిలా ఒకే సినిమాకి పరిమితం కావడం లేదు. ఏ భాషలో నటించినా అవి అన్ని భాషల్లోనూ విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో, మంచి కథ ఎక్కడి నుంచి వస్తే అక్కడ నటించేందుకు సై అంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ... ఇలా అన్ని భాషల్లోనూ మన కథానాయికలు రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి కథానాయికలు కూడా తెలుగులో అవకాశాల్ని అందుకొంటున్నారు.


అవకాశాలతో హవా

సీనియర్లలో శ్రుతిహాసన్‌, సమంత, తమన్నాలు మాత్రం ఈ ఏడాది కూడా వరుస అవకాశాలతో హవాని కొనసాగించారు. శ్రుతిహాసన్‌ ఈ ఏడాదిలో తెరపై కనిపించలేదన్న మాటే కానీ, ఆమె సినిమాలతో బిజీ బిజీగా గడిపారు. సంక్రాంతికి ఆమె నటించిన ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈసారి సంక్రాంతి సందడంతా ఆమెదే. మరోవైపు ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’లో నటిస్తోంది. సమంత, తమన్నాలు మాత్రం తెరపై సందడి చేశారు. సమంత ‘యశోద’గా వచ్చి, విజయాన్ని అందుకుంది. ‘శాకుంతలం’, ‘ఖుషి’ సినిమాల చిత్రీకరణలో కూడా పాల్గొన్నారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా విరామం తీసుకుంటున్నారు. తమన్నాకి ఘన విజయాలు దక్కలేదేమో కానీ... ‘ఎఫ్‌3’తో కొన్ని వినోదాలు పంచింది. ఆమె నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలైంది. మరోవైపు హిందీలో ‘బబ్లీ బౌన్సర్‌’, ‘ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి’ చిత్రాలు చేసింది. అవి ఓటీటీలోనే విడుదలయ్యాయి. కొత్త అవకాశాల విషయానికొస్తే ఆమె చేతిలో ‘భోళా శంకర్‌’ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని