IFFI: ‘ఇఫీ’ ప్రపంచ వేదికవ్వాలి

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) కంటెంట్‌ క్రియేషన్‌, చిత్ర నిర్మాణం, షూటింగ్‌లకు శాశ్వత వేదికగా మారాలంటున్నారు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.

Updated : 21 Nov 2022 06:52 IST

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) (IFFI) కంటెంట్‌ క్రియేషన్‌, చిత్ర నిర్మాణం, షూటింగ్‌లకు శాశ్వత వేదికగా మారాలంటున్నారు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur). నవంబరు 28 వరకు తొమ్మిది రోజులపాటు జరిగే 53వ ఇఫీ చిత్రోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ ఉత్సవంలో అజయ్‌ దేవ్‌గణ్‌, కార్తీక్‌ ఆర్యన్‌, పంకజ్‌ త్రిపాఠి, మనోజ్‌ బాజ్‌పేయి, సునీల్‌ శెట్టి, వరుణ్‌ ధావన్‌, సారా అలీఖాన్‌ లాంటి సినీప్రముఖులు పాల్గొంటున్నారు. ‘ఇఫీ ఆసియాలోనే అతిపెద్ద చిత్రోత్సవం. నిర్మాతలు, దర్శకులు, కళాకారులు తమ ప్రతిభ నిరూపించుకునేందుకు ఇదొక గొప్ప వేదిక. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారత్‌ని సినిమాలకు ఒక ప్రపంచ వేదికగా మలచుకోవాలి’ అని ఠాకూర్‌ అన్నారు. ‘చిత్రోత్సవం ఉద్దేశం సంబరాలు జరుపుకోవడమే కాదు.. సినిమా విపణి ద్వారా మన భారతీయత, సంస్కృతిని ఇతరులకు తెలియచెప్పాలి. విదేశీ భాగస్వామ్యంతో వేడుక స్థాయిని పెంచాలి’ అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో 79 దేశాలకు చెందిన 280 చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈసారి ప్రదర్శనకు ఎంపికైన సినిమాల్లో నలభై శాతం మహిళా దర్శకులు రూపొందించినే కావడం విశేషం. నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఎన్‌ఎఫ్‌డీసీ), ఎంటర్‌టైన్‌మెంట్‌ సొసైటీ ఆఫ్‌ గోవా (ఈఎస్‌జీ) వేడుకల్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొదటి రోజున సీనియర్‌ నటి ఆశా పరేఖ్‌కి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం, స్పానిష్‌ ఫిల్మ్‌మేకర్‌ కార్లోస్‌ సౌరాకి సత్యజిత్‌ రే జీవితకాల సాఫల్య అవార్డు అందించనున్నారు. ‘ఇండియన్‌ క్లాసిక్‌’ విభాగంలో సీనియర్‌ దర్శకులు కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన శంకరాభరణం ప్రదర్శించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు