వెంకటేశ్‌ను మార్చేసిన ‘ప్రేమించుకుందాం రా!’

విక్టరీ’ని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్‌. తెలుగు చిత్ర సీమకు నాలుగు మూలస్తంభాలుగా అభివర్ణించే అగ్ర నటుల్లో ఒకరైనా

Updated : 13 Dec 2020 12:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం: ‘విక్టరీ’ని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్‌. తెలుగు చిత్ర సీమకు నాలుగు మూలస్తంభాలుగా అభివర్ణించే అగ్ర నటుల్లో ఒకరైనా ఆ అహమే ఉండదు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ తనయుడైనా ఆ అతిశయమన్నదే కనిపించదు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా ముఖంలో చిరునవ్వు చెరగదు. అవార్డులెన్ని అందుకున్నా అణకువ మారదు. అందుకే ఆయన సమ్‌థింగ్‌ స్పెషల్‌. నటనలోనే కాదు. నిజ జీవితంలోనూ అంతే. ఆదివారం వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వివిధ సందర్భాల్లో తన కెరీర్‌ గురించి వెంకీ పంచుకున్న ముచ్చట్లు...

స్కూల్‌ డేస్‌లో అలా..!

‘‘ఏదో ఒకటి చేసి అందరి గుర్తింపు పొందాలి అన్నది నాకు చిన్నప్పటి నుంచే ఉన్నట్లుంది. స్కూల్లో నా క్లాస్‌మేట్స్‌ అని మాత్రమే కాకుండా సీనియర్లు, జూనియర్లు అందరికీ నేను తెలుసు. ఐస్‌క్రీమ్‌ అబ్బాయి దగ్గర్నుంచీ అందరూ క్లోజే. ప్రతీ ఏడాది క్లాస్‌ లీడర్‌నీ నేనే. మొత్తం మ్మీద స్కూల్లో నేను చాలా యాక్టివ్‌ అండ్‌ రెబల్‌ కిడ్‌ చదువులో మాత్రం యావరేజ్‌. టీచర్లు అనవసరంగా ఎవరినైనా కొట్టినా తిట్టినా నేను స్టూడెంట్స్‌ తరఫున వకాల్తా తీసుకోవడం, ఎదురు తిరగడం చేసేవాడిని. బైకుల టైర్లు పంక్చర్లు చేయడం వంటి అల్లరి పనులూ చేసేవాళ్లం. అందరూ క్లాస్‌లో ఉంటే నేను క్లాస్‌ బయటే ఉండేవాణ్ణి. అల్లరి చేస్తే బయటకు పంపించరా మరి.. అయితేనేం.. ఆ సమయాన్ని కూడా వృథా చేసేవాడినికాను. స్కూల్‌ మొత్తం తిరిగి అందరినీ గమనించేవాడిని. చిన్నతనమంతా మద్రాసులోనే గడిచింది. అక్కడి డాన్‌ బాస్కో స్కూల్లో చదవివాను. ప్లస్‌ టూ వరకు అక్కడే. స్కూల్‌ డేస్‌లో ప్రతీ విహారయత్రకూ వెళ్లేవాడిని. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం దాదాపు తిరిగా. నిజానికి అవి కేవలం వినోద విజ్ఞాన యాత్రలు మాత్రమే కాదు. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జీవితపాఠాలు. సర్దుకుపోవడం, అందరితో కలిసుండటం అన్నీ నేర్చుకోవాల్సిందే. అమ్మానాన్నా మా పట్ల చాలా శ్రద్ధ తీసుకునే వారు. ముఖ్యంగా అమ్మ రాజేశ్వరి.. చాలా జాగ్రత్త తీసుకునేవారు. నాన్న సినిమాల్లో బిజీగా ఉన్నా మా గురించి అన్నీ తనే చూసుకునేది. రాత్రికి అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఆ సమయంలోనే నాన్నగారు తాను తీయబోయే సినిమాల కథలు చెప్పేవారు. బహశా అప్పటి నుంచే నాకు స్క్రిప్ట్‌లు వినడం, అదీ ఓపిగ్గా వినడం అలవాటైనట్లుంది.’’ అంటూ తన చిన్న నాటి రోజులను గుర్తు చేసుకుంటారు వెంకటేష్‌.

కాలేజీ డేస్‌ ఇలా..

‘‘డిగ్రీ చెన్నై లయోలా కాలేజీలో చదివా. అందమైన క్యాంపస్‌. నేనెప్పుడూ హాస్టల్‌లో లేను గానీ మా స్నేహితులు ఉండటంతో తరచూ వెళ్లే వాడిని. ఆ వాతావరణం బాగా నచ్చేది. ఇంటర్‌ కాలేజ్‌ వేడుకలకు వెళ్లడం. క్రికెట్‌ ఆడటం. రోజులు సరదాగా గడిచిపోయాయి. మోటార్‌బైక్‌ రేసులు పెట్టుకుని బెంగళూరు, పుదుచ్చేరి వెళ్లేవాళ్లం. నాకు చిన్నప్పటి నుంచి ఏదో అయిపోవాలని లక్ష్యం ఉండేది కాదు. జీవించడమే తెలుసు. కాలేజీకొచ్చిన తర్వాత స్నేహితులను చూశాక నేనూ స్టేట్స్‌లో చదవాలి అనుకుని చదివానంతే. జీవితం గురించి కాస్త విభిన్నంగా ఆలోచించడం కూడా అక్కడే నేర్చుకున్నా. కామర్స్‌ డిగ్రీ అయ్యాక అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘మాంటరీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌’లో ఎంబీఏ చేశా.’’

నటుడిని అవుతానని అనుకోలేదు!

‘‘మొదటి నుంచి మాది చాలా సింపుల్‌ లైఫ్‌. నాన్నగారితో కలిసి ఎప్పుడన్నా స్టోరీ డిస్కషన్స్‌కి వెళ్లేవాళ్లం. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌కి కూడా అప్పుడప్పుడూ వెళ్లేవాణ్ణి. స్కూల్‌లో చదివేటప్పుడు ఏదో సరదాగా రమ్మంటే ‘ప్రేమనగర్‌’లో చేశానే తప్ప ఎప్పుడూ హీరోని కావాలని సినిమాల్లోకి రాలేదు. అమెరికా వెళ్లే ముందు నన్ను కొందరు సినిమాల్లో చేస్తావా? అని అడిగారు. అప్పటికి ఆసక్తి లేదు. కానీ ఇండియా తిరిగొచ్చాక వ్యాపారం చేద్దామని అనుకున్నా. కానీ నాన్నగారు రాఘవేంద్రరావుగారిని పిలిపించి ‘మా వాణ్ణి పరిచయం చేద్దాం’ అని చెప్పారు అలా సినిమాల్లోకి అడుగుపెట్టా.

అద్దమే క్లాస్‌రూమ్‌

‘‘అవును అద్దమే నా ఫిల్మ్‌ స్కూల్‌. ప్రత్యేకంగా ఏ ఇనిస్టిట్యూట్‌లోనూ చేరలేదు. నేర్చుకోలేదు. అద్దం ముందే ఎక్కువ సేపు గడిపేవాడిని. నా భావాలన్నీ మార్చి మార్చి చూసుకునేవాణ్ణి. 1986 నా మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’ హిట్టయింది. ఆ తర్వాత ‘బ్రహ్మరుద్రులు’, ‘అజేయుడు’, ‘భారతంలో అర్జునుడు’ సినిమాలు ఫ్లాప్‌. అది కూడా నాకు వరమే. కాస్త విరామం.. ఆ తర్వాత మళ్లీ ‘శ్రీనివాస కల్యాణం’, ‘స్వర్ణకమలం’, ‘ప్రేమ’, ‘శత్రువు’ అన్నీ హిట్లే. నంది అవార్డులూ వచ్చాయి. తమిళంలో వేర్వేరు ఇమేజ్‌లు ఉన్న హీరోల సినిమాలను తెలుగు రీమేక్‌ చేయడం అవన్నీ హిట్టవడం, ఏ హీరో క్యారెక్టర్‌లో అయినా నేను చక్కగా ఇమిడిపోగలగడంతో ప్రేక్షకులు నన్ను రిసీవ్‌ చేసుకుంటారన్న నమ్మకం కలిగింది.ముఖ్యంగా ‘చంటి’. తమిళంలో ‘చినతంబి’ ఓ అమాయకుడి రోల్‌. ఛాలెంజింగ్‌ పాత్ర. అదే నాకు పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. బాక్సాఫీస్‌ వద్ద హిట్‌. నా ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ‘బొబ్బిలిరాజా’ వంటి పెద్ద హిట్‌ తర్వాత ‘సుందరకాండ’, ‘పవిత్రబంధం’ వంటి సినిమాల్లో సాఫ్ట్‌రోల్స్‌ చేయడంతో ఏ పాత్ర అయినా చేయగలను అన్న నమ్మకం కలిగింది. ‘ధర్మచక్రం’, ‘గణేష్‌’ వంటి సినిమాలు చేశాను. నేను ఎంచుకున్న ప్రతీ వైవిధ్యమైన పాత్రలను ప్రేక్షకులు స్వీకరించడం నా అదృష్టం. వైవాహిక బంధాలకు సంబంధించిన కథలో మోతాదు మించకుండా నేను నటించడం బహుశా ఇవన్నీ నన్ను కుటుంబ కథానాయకుడిగా ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు దగ్గర చేశాయని చెప్పవచ్చు.’’

ఆధ్యాత్మిక మార్గం వైపు!

‘‘నేను వేదాంతిని కాను. సినిమా హిట్టయినా.. ఫ్లాప్‌ అయినా పొంగిపోను. కుంగిపోను. నా పని నేను చేశాను. చేసేటప్పుడు ఆనందంగా ఉన్నాను కదా అనుకుంటాను. కొన్ని పాఠాలు నేర్చుకుంటాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ‘ప్రేమించుకుందాం రా..!’ శతదినోత్సవాలు జరుపుకొంటున్న రోజుల్లో అన్నీ వరుస విజయాలే కానీ, అవేవీ నాకు పెద్దగా ఆనందాన్ని ఇవ్వలేదు. రాష్ట్రమంతా విజయయాత్ర. ఆ టూర్‌ చివర్లో ఏ ఊరో సరిగా గుర్తులేదు కానీ సడెన్‌గా నాలో ఏదో స్తబ్ధత, నిశ్చలత అదేమిటో తెలియదు. నాలో ఏ స్పందనా లేదు. నాలోని నేను చూసుకున్నాను. ఆ స్తబ్ధత ఎందుకన్నది సరిగ్గా తెలియలేదు. చిన్నప్పటి నుంచీ నేను భక్తుణ్ణే. పూజలూ చేసేవాణ్ణి. కానీ ఏదో అసంతృప్తి. ఏదీ నన్ను ఆకర్షించటం లేదు. ఆనందాన్ని ఇవ్వటం లేదు. దేని కోసమో అన్వేషణ. జీసెస్‌, రమణమహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస.. అందరి పుస్తకాలు చదివాను. చివరకు నా అన్వేషణ ఫలించింది. నా జీవితం మారిపోయింది. ఏదీ శాశ్వతం కాదు. ఎదుగుదల బాహ్యంగానే కాదు అంతర్ముఖంగానూ ఉండాలి అని తెలుసుకున్నా. కాస్త సమయం కూడా వృథా చేయడం లేదు. అలౌకిక ఆనందానికి నేను ఎంచుకున్న సాధనమార్గం ధ్యానం. ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేను. లేకపోతే జీవితానికి అర్థం లేదనిపిస్తోంది.’’

నాన్న నుంచి నేర్చుకున్నా

‘‘బహుశా కర్మతత్వం నా జీన్స్‌లోనే ఉందేమో. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడైనా మా ఆఫీసులో కూర్చుంటే ‘ఆ సినిమా పోయిందండీ. ఈ సినిమా యావరేజ్‌ అండీ’ అంటూ నాన్నగారికి ఫోన్‌చేసేవారు. హిట్‌కీ, ఫ్లాప్‌కీ నాన్నగారు ఒకేలా స్పందించేవారు. నాకూ అలానే అలవాటైంది. మన పనిని నిజాయతీగా చేయడం వరకే. ఫలితం ఏదైనా బాధపడకూడదు. ఈ ప్రపంచమనే నాటకరంగంలో మనమంతా పాత్రధారులం. మన పాత్రను చేయగలిగినంత బాగా చేయాలి. పూర్తికాగానే వెళ్లిపోవాలి. ఇది అర్థం చేసుకుంటే అంతా ఆనందంమే’’

ప్రొడ్యూసర్‌ కుమారుడి ఇమేజ్‌ను పక్కన పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంత చేసుకున్న వెంకటేష్‌ ప్రేక్షకులను మెప్పించే మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని