jagadeka veeruni katha: ఎన్టీఆర్‌ ఎంపిక చేసిన ట్యూన్‌!

అఖండ విజయాలు సాధించిన విజయా వారి చిత్రాల్లో ‘జగదేకవీరుని కథ’ అందరికీ గుర్తుండిపోతుంది.

Published : 30 Oct 2023 09:42 IST

అఖండ విజయాలు సాధించిన విజయా వారి చిత్రాల్లో ‘జగదేకవీరుని కథ’ అందరికీ గుర్తుండిపోతుంది. ఎన్టీఆర్‌కి రాకుమారుడిగా మరింత గ్లామర్‌ను పెంచిన చిత్రం. పింగళి సంభాషణలు, పాటలు ఈ చిత్రంలో కొత్త పుంతలు తొక్కాయి.  ‘జలకాలాటలలో..’, ‘ఓ చెలీ ఓహో సఖీ..’, ‘వరించి వచ్చిన మానవ వీరుడు..’,  ‘అయినదేమో అయినదీ..’, ‘శివ శంకరీ..’, లాంటి పాటలు ఇందులోనివే! మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్‌కి పాడిన ఘంటసాల ఇందులో రేలంగికి కూడా ‘ఆశ.. ఏకాశ..’ అనే పాట పాడటం! వీటన్నిటితో పాటు కరుణరస ప్రధానమైన మరోపాట కూడా ఇందులో ఉంది. అదే ‘రారా కనరారా.. కరుణ మాలినారా.. ప్రియతమలారా..!’.

దివి నుంచి దిగి  వచ్చిన దేవకన్యలు తనను ప్రేమలో ముంచెత్తి, తమకు వీలు చిక్కగానే విడిచి వెళ్లిపోతున్న ఘట్టంలో వారిని ఉద్దేశిస్తూ, గుండెలు కరిగేలా హీరో పాడే పాట ఇది. పింగళి అద్భుతంగా ఈ పాటను రాశారు. దీనికి సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అనేక రాగాల్లో రకరకాలుగా ట్యూన్లు కట్టారు. వాటిని విన్న నిర్మాత, దర్శకులకు అన్ని ట్యూన్లూ నచ్చాయి. ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేక, చివరకు హీరో ఎన్టీఆర్‌ని పిలిచి ‘‘వీటిలో మీకు ఏ ట్యూన్‌ నచ్చిందో చెప్పండి’’ అని అడిగారట. వాటిని శ్రద్ధగా విన్న ఎన్టీఆర్‌, ‘భాగేశ్వరి’ రాగంలో చేసిన ట్యూన్‌ని ఎంపిక చేశారట! సన్నివేశంలోనే ఫీల్‌ని చక్కగా ఎలివేట్‌ చేసిన ఆ ట్యూన్‌ ఎంతగానో హిట్‌ అయింది. తెర వెనుక ఘంటసాల గళం- తెర మీద ఎన్టీఆర్‌ నటన ఆ పాటను అమోఘంగా పండించాయి. ఆ సన్నివేశాన్ని చూస్తూ ప్రేక్షకులు  కరిగిపోయారు... కంట తడిపెట్టారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని