Kajal: అవును.. నేనూ పోస్ట్ పార్టమ్‌ డిప్రెషన్‌ ఎదుర్కొన్నా: కాజల్‌

చాలా రోజుల తర్వాత తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు నటి కాజల్‌ (Kajal). ‘ఇండియన్‌ 2’ (Indian 2) సెట్‌లో ఉన్న ఆమె.. పర్సనల్‌ లైఫ్‌, కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.

Updated : 01 Jul 2023 10:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పెళ్లి, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి కాజల్‌ అగర్వాల్‌ (Kajal). ప్రస్తుతం ‘ఇండియన్‌-2’ (Indian 2), ‘సత్యభామ’ (Satyabhama) ప్రాజెక్టుల్లో నటిస్తోన్న ఆమె తాజాగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఇన్‌స్టా వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. అంతేకాకుండా, పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అందరు మహిళల మాదిరిగానే తానూ ఆ దశను ఎదుర్కొన్నానని చెప్పారు.

మీ అబ్బాయి నీల్‌ ఎలా ఉన్నాడు? మీరు వర్క్‌లో బిజీగా ఉన్నప్పుడు అతడిని ఎవరు చూసుకుంటారు?

కాజల్‌: నీల్‌ బాగున్నాడు. వర్క్‌ వల్ల ఇంటికి దూరంగా ఉన్నప్పుడు నా కుటుంబమే అతడిని సంరక్షిస్తుంది.

‘ఇండియన్‌-2’ గురించి ఏమైనా చెప్పగలరు?

కాజల్‌: నేను ప్రస్తుతం ఆ సినిమా లొకేషన్‌లోనే ఉన్నా. టీమ్‌, సినిమా, నా రోల్‌ విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నా. మీ అందరికీ మా చిత్రాన్ని చూపించేందుకు టీమ్‌ మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్నాం.

‘లస్ట్‌స్టోరీస్‌ 2’ చూశారా..?

కాజల్‌: నిన్న రాత్రే ఆ సిరీస్‌ చూశా. తమన్నా నటన అద్భుతంగా ఉంది. ఆమె నన్నెంతో భయపెట్టేసింది.

అభిమానులందరితో ఎందుకని చాట్‌ చేయరు?

కాజల్‌: ప్రస్తుతం నేను అదేగా చేస్తుంది. వర్క్‌ లైఫ్‌, పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం ఎంతో కష్టం. కొన్ని సమయాల్లో కుటుంబసభ్యులు, స్నేహితులతో మాట్లాడటానికి కూడా సమయం ఉండదు. తరచూ మీతో మాట్లాడకపోయినా నేను మిమ్మల్ని ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటాను. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి.

మీకు నచ్చిన తెలుగు సినిమా ఏమిటి?

కాజల్‌: పెద్ద లిస్ట్‌ ఉంది. ఒక్కటి చెప్పడం కష్టం.

‘సత్యభామ’ థీమ్‌ ఏమిటి?

కాజల్‌: నేను చేస్తోన్న మరో కొత్త ప్రాజెక్ట్‌ ‘సత్యభామ’. ఆ కథ నాకెంతో నచ్చింది. ఇదొక పోలీస్‌ డ్రామా.

మీ సినీ కెరీర్‌లో బాగా ఎంజాయ్‌ చేసి నటించిన రోల్‌ ఏమిటి?

కాజల్‌: ప్రతి రోల్‌ నాకు ఒక మధురానుభూతిని అందించింది. నందిని (డార్లింగ్‌), ప్రియ (మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌), మిత్రవింద (మగధీర), అలాగే ఇప్పుడు సత్యభామ. ఇలా ఎన్నో పాత్రలను నేను ఎంజాయ్‌ చేస్తూ వర్క్‌ చేశా.

వర్క్‌ పరంగా మీలో స్ఫూర్తి నింపే విషయం ఏమిటి?

కాజల్‌: కొత్త సవాళ్లు, అనుభూతులు, పాఠాలు.. ఎదుగుదల.

ఒక నటిగా నెగెటివిటీని ఎలా ఎదుర్కొంటున్నారు?

కాజల్‌: పాజిటివిటీపై ఫోకస్‌ చేయడం, ధ్యానం, ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండటం.. అలాగే ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటాన్ని కొంతమంది గురువులు నేర్పించారు. ప్రాక్టీస్‌తో అది సాధ్యమైంది.

ఒక నటిగా మీరు దేనికి ఎక్కువగా భయపడతారు?

కాజల్‌: అద్భుతమైన ప్రశ్న. ఒక పాత్రకు సరైన న్యాయం చేయలేకపోయినప్పుడు అభిమానులే కాకుండా నేనూ ఎంతో బాధపడతా. పోషించే ప్రతి పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారా? లేదా? అని భయపడుతుంటా.

అల్లు అర్జున్‌ గురించి ఏమైనా చెప్పగలరు?

కాజల్‌: నాకు తెలిసిన మంచి వ్యక్తుల్లో అల్లు అర్జున్‌ కూడా ఒకరు. ఆయన ఎనర్జీని నేనెంతో ఇష్టపడుతుంటా.

మీరు కూడా పోస్ట్‌ పార్టమ్‌ (ప్రసవానంతరం) డిప్రెషన్‌ను ఎదుర్కొన్నారా?

కాజల్‌: ఎస్‌. ప్రసవానంతర డిప్రెషన్‌ను నేనూ ఎదుర్కొన్నా. అది సర్వసాధారణం. మహిళలు ఎవరైనా పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌తో ఇబ్బందిపడుతుంటే కుటుంబం వారికి అండగా నిలవాలి. అలాగే, మహిళలు సైతం పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ట్రైనర్‌ ఆధ్వర్యంలో వర్కౌట్లు చేయడం.. ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపటం.. ఇలా చిన్న చిన్న పనులతో ఆ దశను దాటొచ్చు. నన్నెంతగానో అర్థం చేసుకునే కుటుంబసభ్యులు ఉండటం వల్ల ఆ దశ నుంచి వెంటనే బయటకు రాగలిగాను. పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ అప్పుడు నా భర్త గౌతమ్‌ క్లిష్టమైన సమయం చూశారు.

తమన్నా, రకుల్‌, సమంతతో మీ స్నేహం ఎలా ఉంటుంది..?

కాజల్‌: వీళ్లంటే నాకెంతో ఇష్టం. స్వయంకృషితో తమ కెరీర్‌ నిర్మించుకున్నారు. నిబద్ధత, ధైర్యవంతులు. మా మధ్య ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. వాళ్లతో సరదాగా సమయాన్ని గడపడానికి నేను ఇష్టపడుతుంటా.

ప్రెగ్నెన్సీ మీ శరీరాకృతి, లుక్స్‌పై ఎలాంటి ప్రభావం చూపించింది? సవాలుగా మారింది?

కాజల్‌: జీవితం అందమైన క్షణాలను అందిస్తుంటుంది. ప్రతి క్షణాన్ని మనం బెస్ట్‌గా మార్చుకోవాలి. బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక వరం. అందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నా. బిడ్డ పుట్టిన రెండు నెలల్లోనే వర్క్‌ లైఫ్‌లో బిజీగా కావడం కూడా ఒక వరమే.

నన్ను పెళ్లి చేసుకుంటారా?

కాజల్‌: సారీ. రెండున్నరేళ్ల క్రితమే ఆ అవకాశం మరొకరిని వరించింది.

మరికొన్ని విశేషాలు..!

ఇష్టమైన ఫుడ్‌: వెజ్‌ బిర్యానీ, దోశె

ఇష్టమైన ప్రాంతం: లండన్‌ 

కలర్‌: వైట్‌

నీల్‌, ఇషాన్‌ (నిషా అగర్వాల్‌ తనయుడు): ఆపిల్స్‌ ఆఫ్‌ మై ఐస్‌

నిషా అగర్వాల్‌: నా సోల్‌

ఒత్తిడిని జయించడానికి ఏం చేస్తారు: పిల్లలతో ఆడుతుంటా

ఇష్టమైన షో: Schitt's Creek (నెట్‌ఫ్లిక్స్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని