Kashmir: ఆహ్వానం పలుకుతోంది ‘అందాల కశ్మీరం’

ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూకశ్మీర్‌.. సినిమా షూటింగ్‌ల అడ్డాగా మారేందుకు తహతహలాడుతోంది! పర్యాటక రంగానికి మేలు కలగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో సినీ పరిశ్రమకు ఆహ్వానం పలుకుతోంది.

Updated : 07 Dec 2022 10:48 IST

సినిమా నిర్మాణాలకు తలుపులు బార్లా
దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే అనుమతులు

ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూకశ్మీర్‌.. సినిమా షూటింగ్‌ల అడ్డాగా మారేందుకు తహతహలాడుతోంది! పర్యాటక రంగానికి మేలు కలగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో సినీ పరిశ్రమకు ఆహ్వానం పలుకుతోంది. స్పష్టమైన సినిమా విధానం ద్వారా.. వివిధ రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఐరోపా దేశాల తరహా వాతావరణం, లొకేషన్లు స్థానికంగా అందుబాటులో ఉండటంతో.. అతితక్కువ ఖర్చుతో చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేయొచ్చని సూచిస్తోంది.

శాంతిభద్రతలు మెరుగవడంతో..

భారతీయ సినిమా షూటింగ్‌లకు జమ్మూకశ్మీర్‌ 1970, 80ల్లో అనువైన గమ్యస్థానంగా ఉండేది. తర్వాత భద్రతాపరమైన కారణాలరీత్యా నిర్మాతలు కశ్మీర్‌కు దూరమవుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు చాలా మెరుగుపడ్డాయి. దీంతో జమ్మూకశ్మీర్‌ చిత్ర నిర్మాణరంగానికి తలుపులు బార్లా తెరుస్తోంది. స్థానికంగా అధిక సంఖ్యలో ఉన్న వారసత్వ ప్రాధాన్య స్థలాలు, దట్టమైన అడవులు, జలపాతాలు, నిపుణులైన మానవ వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తోంది.

ఏక గవాక్ష వ్యవస్థ

జమ్మూకశ్మీర్‌లో షూటింగ్‌ అనుమతుల కోసం ఏక గవాక్ష వ్యవస్థను రూపొందించారు. ఆన్‌లైన్‌ వేదికగా దరఖాస్తు చేసుకుంటే.. అనుమతుల జారీ ప్రక్రియ గరిష్ఠంగా నెలరోజుల్లో పూర్తవుతుంది. షూటింగ్‌లు పూర్తయ్యేదాకా స్థానిక అధికార యంత్రాంగమే చిత్రబృందాలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.

రాయితీలు.. ప్రోత్సాహకాలు..

స్థానికంగా చిత్ర నిర్మాణానికి భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తారు. మొత్తం సినిమా షూటింగ్‌ దినాల్లో జమ్మూకశ్మీర్‌లో చిత్రీకరణ జరిగిన రోజుల శాతం ఎంత ఉందన్నదానిపై అవి ఆధారపడి ఉంటాయి. జమ్మూకశ్మీర్‌ అందాలను బాగా చూపించి, పర్యాటక రంగ ప్రోత్సాహకానికి సహకరించే సినిమాలకు రూ.50 లక్షల అదనపు సబ్సిడీ ఇస్తారు. జమ్మూకశ్మీర్‌ ఆధారంగా కథ, స్క్రిప్ట్‌ రాసుకొని.. ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా సినిమా తీసేవారికి రూ.5 కోట్లుకానీ, నిర్మాణ వ్యయంలో 50%కానీ(ఏది తక్కువైతే అది) ప్రోత్సాహకంగా అందిస్తారు. టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, ఓటీటీ షూటింగ్‌లకూ రకరకాల రాయితీలను అందుబాటులో ఉంచారు. చిన్నారులు, మహిళల ఇతివృత్తాలతో తీసే సినిమాలకు 25% అదనపు సబ్సిడీ అందిస్తారు. జమ్మూకశ్మీర్‌ పారిశ్రామిక విధానం-2021 ప్రకారం పన్ను రాయితీలూ కల్పిస్తారు.


మాది ఉత్తమ సినిమా విధానం

విదేశాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో చిత్రీకరణ ఖర్చు చాలా తక్కువ. దేశంలోకెల్లా ఉత్తమ సినిమా విధానాన్ని మేం రూపొందించాం. నైపుణ్యాలు, రాయితీలు, మౌలిక వసతులు, అనుమతులే మా విధానానికి మూలస్తంభాలు. స్టూడియోలు, శిక్షణా సంస్థల ఏర్పాటుకూ అనువైన వాతావరణం కల్పిస్తున్నాం. దీనివల్ల ఇక్కడ సినిమా షూటింగ్‌లు త్వరలోనే రెట్టింపవుతాయని ఆశిస్తున్నాం. 

అరుణ్‌కుమార్‌ మెహతా, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  


చల్లా విజయభాస్కర్‌ (కశ్మీర్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి)

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని