Adipurush: ‘ఆదిపురుష్‌’ వివాదం.. భారత్‌ సినిమాలపై కాఠ్‌మండూలో నిషేధం!

కాఠ్‌మండూలో ఇండియన్‌ సినిమాలను నిషేధిస్తున్నట్టు మేయర్‌ బలెన్‌ షా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఆదిపురుష్‌’ వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 19 Jun 2023 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ (Adipurush)పై నేపాల్‌లో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. సీత.. నేపాల్‌లో పుడితే, ఆ సినిమాలో భారత్‌లో పుట్టినట్టు చూపించారంటూ అక్కడి నేతలు మండిపడ్డారు. మరోవైపు, నేపాల్‌ (Nepal) రాజధాని కాఠ్‌మండూ మేయర్‌ (Kathmandu Mayor) బలెన్‌ షా (Balen Shah) సైతం దీనిపై స్పందించారు. సంబంధిత సన్నివేశాన్ని మార్చాలని, అందుకు చిత్ర బృందానికి మూడు రోజుల గడువు ఇస్తున్నామని, ఒకవేళ ఈ సీన్‌ని మార్చకపోతే కాఠ్‌మండూ మెట్రోపాలిటిన్‌ సిటీలో ఏ హిందీ సినిమా ప్రదర్శితమయ్యే అవకాశం ఉండదంటూ ట్వీట్‌ చేశారు. అదే విషయాన్ని ఉటంకిస్తూ సోషల్‌ మీడియాలో తాజాగా మరో పోస్ట్‌ పెట్టారు. ‘ఆదిపురుష్‌’తోపాటు ఇండియన్‌ సినిమాలన్నింటినీ సోమవారం నుంచి కాఠ్‌మాండూలో నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.

‘‘సీత జన్మించిన ప్రాంతానికి సంబంధించిన అభ్యంతరకర సందేశాన్ని తొలగించాలని చిత్ర బృందానికి మూడు రోజుల క్రితం విజ్ఞప్తి చేశాం. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం, ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వయేతర సంస్థలు, నేపాల్‌ పౌరుల బాధ్యత. సోమవారం నుంచి కాఠ్‌మండూ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని థియేటర్లలో ఈ సినిమాని ప్రదర్శించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. పలు అధికరణల ప్రకారం ఫెడరల్, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యతను నేపాల్ రాజ్యాంగం కేటాయించింది. ఈ చిత్రాన్ని ఎలాంటి మార్పులు లేకుండా ప్రదర్శించినట్లయితే.. నేపాల్ జాతీయ గుర్తింపు, సార్వభౌమాధికారానికి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది’’ అని మేయర్‌ తమ మాతృభాషలో పోస్ట్‌ పెట్టారు. ఈ నిషేధం కాఠ్‌మండూ ప్రాంతానికే పరిమితమవుతుందని తెలిపారు.

రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటించారు. సీతగా హీరోయిన్‌ కృతిసనన్‌ కనిపించారు. జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 240 కోట్ల వసూళ్లు చేసిందని చిత్ర బృందం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని