Love Today: అలా పుట్టిందే ‘లవ్‌ టుడే’

‘‘నేను చూసిన కథతోనే ‘లవ్‌ టుడే’ తెరకెక్కించా. ఇది అందరి కథ. అందుకే అటు తమిళంలోనే కాకుండా... ఇటు తెలుగులోనూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది’’ అన్నారు ప్రదీప్‌ రంగనాథన్‌.

Updated : 27 Nov 2022 06:54 IST

‘‘నేను చూసిన కథతోనే ‘లవ్‌ టుడే’ (Love Today) తెరకెక్కించా. ఇది అందరి కథ. అందుకే అటు తమిళంలోనే కాకుండా... ఇటు తెలుగులోనూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది’’ అన్నారు ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan). ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ టుడే’. తెలుగులో దిల్‌రాజు (DilRaju) అనువదించి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక ఇవానాతో (Ivana) కలిసి ప్రదీప్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. మన ఫోన్‌ని వేరొకరికి ఇవ్వాలన్నప్పుడు చాలా ఆలోచిస్తాం. అలాంటిది పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ అబ్బాయి, అమ్మాయి ఫోన్లు మార్చుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. తమిళంలో ఘన విజయం సాధించింది.   మాతృకలోని మేజిక్‌ పునరావృతం చేయడం కష్టం. అందుకే ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయడం కంటే, అనువాదం చేసి విడుదల చేయడం మేలనుకున్నాం. కథ బాగుంటే...  తెలుగు ప్రేక్షకులు ఏ భాష నుంచి వచ్చిన సినిమానైనా ఆదరిస్తారు. మా సినిమాతో మరోసారి ఆ విషయం రుజువైంది. 2017లో నేను ‘అప్పలాక్‌’ పేరుతో ఓ లఘు చిత్రం చేశా. అది బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ కథని విస్తృతం చేసి ‘లవ్‌ టుడే’ స్క్రిప్ట్‌ తయారు చేశా.  నేను ఎవరి దగ్గరా పనిచేయలేదు. సినీ నిర్మాణం గురించి ఆన్‌లైన్‌లో నేర్చుకుని పరిశ్రమలోకి వచ్చా. ఏ కథ రాసినా అది అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉండాలన్నదే నా లక్ష్యం. అవకాశం వస్తే తదుపరి తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేస్తా’’ అన్నారు. కథానాయిక ఇవానా మాట్లాడుతూ ‘‘చదువుకుంటూనే నటిస్తున్నా. తమిళంలో ఇదివరకు సినిమాలు చేశాను కానీ, నా కెరీర్‌కి మలుపునిచ్చిన చిత్రమిది’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని