‘మీర్జాపూర్‌’ను భ్రష్టుపట్టిస్తున్నారు: ఎంపీ

ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్‌ రెండో సీజన్‌ గత శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ వెబ్‌సిరీస్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న అసలైన మీర్జాపూర్‌ నియోజకవర్గానికి ఎంపీ అయిన అనుప్రియ పాటిల్‌ అభ్యంతరం

Published : 26 Oct 2020 00:38 IST

వెబ్‌సిరీస్‌పై మీర్జాపూర్‌ ఎంపీ అనుప్రియ పాటిల్‌ ఆగ్రహం


(ఫొటో: అమెజాన్‌ ప్రైమ్‌ ఫేస్‌బుక్‌)

లఖ్‌నవూ: ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్‌ రెండో సీజన్‌ గత శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ వెబ్‌సిరీస్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న అసలైన మీర్జాపూర్‌ నియోజకవర్గానికి ఎంపీ అయిన అనుప్రియ పాటిల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీర్జాపూర్‌ను ఈ వెబ్‌సీరిస్‌లో హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతంగా చిత్రీకరించి.. మీర్జాపూర్‌ నగర పేరును భ్రష్టుపట్టిస్తున్నారని మండి పడ్డారు. వెబ్‌సిరీస్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు.

మీర్జాపూర్‌ నగరం రౌడీలు, రాజకీయాలతో హింసాత్మక ప్రాంతంగా మారిపోయినట్లుగా ఈ వెబ్‌సిరీస్‌లో చిత్రీకరించారు. తొలి సీజన్‌ భారీ హిట్‌ కొట్టడంతో రెండో సీజన్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో హింసాత్మక సన్నివేశాలు మరింత తీవ్రంగా ఉండటంతో మీర్జాపూర్‌ ఎంపీ, అప్నాదళ్‌ నేత అనుప్రియ పాటిల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్‌ చేశారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో మీర్జాపూర్‌ అభివృద్ధి చెందింది. సామరస్యతకు కేంద్రబిందువుగా మారింది. కానీ, ఈ వెబ్‌సిరీస్‌లో మీర్జాపూర్‌ నగరాన్ని హింసాత్మక ఘటనలకు నెలవుగా చూపించారు. ఈ నగరానికి అపకీర్తి తెస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ వల్ల జాతి విభేదాలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి’’అని అన్నారు. మరో ట్వీట్‌లో మీర్జాపూర్‌ ఎంపీగా ఈ వెబ్‌సిరీస్‌పై విచారణ జరపాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని