Naga Shaurya: లైట్‌బాయ్‌గా పని చేయడానికైనా సిద్ధమే!

కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న యువ కథానాయకుల్లో ఒకరు నాగశౌర్య. ఆయన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా... కథల్లో మాత్రం వైవిధ్యం కనిపిస్తుంటుంది.

Updated : 06 Jul 2023 14:04 IST

కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న యువ కథానాయకుల్లో ఒకరు నాగశౌర్య (Naga Shaurya). ఆయన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా... కథల్లో మాత్రం వైవిధ్యం కనిపిస్తుంటుంది. క్రమం తప్పకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన ఇటీవల ‘రంగబలి’ (Rangabali) చిత్రం చేశారు. పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహించగా... ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగశౌర్య బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘రంగబలి’ ఎలా ఉంటుంది?

మన ఊరునీ... మన మూలాల్ని గుర్తు చేసే చిత్రమిది. వాణిజ్యాంశాలతో కూడిన పక్కా మాస్‌ కథ ఇది. ఈ సినిమా చూశాక రంగబలి’ అనే పేరు వెనక కథేమిటనేది అర్థమవుతుంది. అంతే తప్ప ఈ కథకీ, వేరే ఎవరి జీవితానికీ సంబంధం లేదు.

ఈ సినిమాపై చాలా నమ్మకంగా మాట్లాడుతున్నారు. దాని వెనక కారణం?  

మంచి జరుగుతున్నప్పుడు రోజు మొదలవడంతోనే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ నాకు అలాగే ఉంది.ఈ సినిమా చూసుకున్నాక నాలో ప్రత్యేకమైన సంతృప్తి కలిగింది. ఆ ఆనందమే నేను నమ్మకంగా మాట్లాడేలా చేసింది.

ఇదివరకు ముందే సినిమా చూసుకునేవారు కాదా?

చాలా సినిమాలకి విడుదల ముందు వరకూ హడావుడి ఉంటుంది. సీజీ పనులు పూర్తి అవ్వవు, సంగీతం కాలేదంటారు, ఎడిటింగ్‌ చేయాల్సింది ఇంకా ఉంది అంటుంటారు. ఇందులో ఎవ్వరిది తప్పు అని చెప్పలేం. వేల మంది కలిసి చేసే పని ఇది. కొన్నిసార్లు రాజీపడక తప్పదు. అదృష్టవశాత్తూ ఈ సినిమాకి ఆ హడావుడి లేదు. కావల్సిన సమయం దొరికింది. అందుకే ముందే చూసుకుని ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇలా కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదంతే.

కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో ముందుంటారు. కథల ఎంపిక విషయంలో ఈమధ్య మీలో వచ్చిన మార్పులేమైనా ఉన్నాయా?

18 మంది కొత్త దర్శకులతో చేశా. కొన్ని విజయాలొచ్చాయి, కొన్నిసార్లు పరాజయాలు ఎదురయ్యాయి. విజయాలు వచ్చినప్పుడు నా నిర్ణయం సరైనదని కాదు, పరాజయం ఎదురైనప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదనీ కాదు. పరిశ్రమలో సమయం కీలకం. మనదైన టైమ్‌ వచ్చేంతవరకు మన ఉనికి ఉందా లేదా అనేది కీలకం. అందుకే ఏదేమైనా సరే, పరిశ్రమలోనే ఉంటానని చెబుతుంటా. ఇది తప్ప నాకు మరొకటి తెలియదు. ఆఖరికి లైట్‌ బాయ్‌గా పనిచేయడానికైనా సిద్ధమే.

‘‘ఈ రంగంలోకి వచ్చిందే ప్రేక్షకుల్ని మెప్పించడానికి. పరిశ్రమలో ఇప్పుడున్న పోటీ మామూలుగా లేదు. అద్భుతంగా నటిస్తున్నారు, డ్యాన్సులు, ఫైట్లు చేస్తున్నారు. సిక్స్‌ప్యాక్‌లు చేస్తున్నారు. మన దక్షిణాదిలో తెలుగు పరిశ్రమ అన్నిటికంటే ముందు ఉంటుంది. అంత పోటీ ఉన్నప్పుడు నేను కూడా అత్యుత్తమంగా పనితీరుని ప్రదర్శించాల్సిందే కదా. అలా కాకుండా డైలాగ్స్‌ చెప్పేసి వెళ్లిపోతాం, విజయం మన ఇంటికి రావాలంటే కుదరదు. సెట్లో గాయాలవుతుంటాయి, అనారోగ్యానికి గురవుతుంటాం. అదంతా వృత్తిలో భాగంగానే. ‘రంగబలి’ సమయంలోనూ సెట్లో అనారోగ్యానికి గురయ్యా. ఆ తర్వాత కోలుకున్నా. ఒక నటుడు ఇది మాత్రమే చేయగలడని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు ఏదైనా చేయగలరు? అవకాశం రావాలంతే. నా విషయంలోనూ ‘శౌర్యకి ఇది సెట్‌ అవుతుంది, ఇదే చేస్తే బాగుంటుంది’ అనే మాటలు వినేవాణ్ని. అలాంటి హద్దులేమీ లేకుండా ప్రయాణం చేయడం అలవాటు చేసుకున్నా’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని