నాపై ఉన్న అభిప్రాయం ఆ షోతో మారిపోయింది

‘బిగ్‌బాస్‌’ వల్ల తనకి అంతా మంచే జరిగిందని నటుడు నవదీప్‌ అన్నారు. దాదాపు 17 సంవత్సరాల క్రితం ‘జై’తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం కథానాయకుడిగానే కాకుండా సహాయనటుడిగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు...

Published : 10 Mar 2021 09:59 IST

నవదీప్‌

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌’ వల్ల తనకి అంతా మంచే జరిగిందని నటుడు నవదీప్‌ అన్నారు. దాదాపు 17 సంవత్సరాల క్రితం ‘జై’తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం సహాయనటుడిగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌, మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించారు. ‘మహాశివరాత్రి’ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో నవదీప్‌ తాజాగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు.

‘‘చిన్నప్పటి నుంచి మెగాస్టార్‌ చిరంజీవి అంటే నాకెంతో ఇష్టం. ఎన్‌సీసీలో మా అమ్మకి చిరంజీవి గారు సినీయర్‌. అందులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిరుతో మ అమ్మ ఓ ఫొటో దిగింది. నాకు ఊహ తెలిసే సమయానికే ఇండస్ట్రీలో ఆయన పెద్ద హీరో అయ్యారు. చిరుతో దిగిన ఫొటోని అమ్మ చాలాసార్లు నాకు చూపించింది. అలా, ఆయనంటే చిన్నప్పటి నుంచే తెలియని అభిమానం ఏర్పడింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బన్నీ-శిరీష్‌తో పరిచయం ఏర్పడింది. మేము ముగ్గురం ఎక్కువ పార్టీలు చేసుకునేవాళ్లం. కొన్నాళ్లకు రానా పరిచయం.. చరణ్‌తో కూడా స్నేహం పెరిగింది. అలా మేమందరం ఫ్రెండ్లీగా ఉంటాం. దాంతో నన్ను మెగా కాంపౌండ్‌కు సంబంధించిన హీరో అంటుంటారు’’

‘‘నేను చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే మొదట్లో వార్తల్లో నిలిచాను. కొంతకాలమయ్యే సరికి నేను చేసినా, చేయకపోయినా సరే నా గురించి రూమర్స్‌ క్రియేట్‌ చేయడం ప్రారంభించారు. నా చుట్టూ ఉన్నవాళ్లకు నేనేంటో తెలుసు కాబట్టి మిగిలిన వాళ్లు ఏమనుకుంటే నాకెందుకు అనుకునేవాడిని. దానివల్ల ప్రేక్షకుల్లో నాపై ఓ చెడు అభిప్రాయం వచ్చేసింది. అలాంటి సమయంలో రియాల్టీ షోలో ఆఫర్‌ వచ్చింది. అక్కడికి వెళితే.. నేనేంటో అందరికీ తెలుస్తుందనుకున్నాను. వచ్చాను. అందరికీ నాపై ఉన్న అభిప్రాయం ఆ షోతో మారిపోయింది. ఇప్పుడు అందరూ నన్ను మంచిగానే చూస్తున్నారు’’ అని నవదీప్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని