Naveen Chandra: బాక్సర్‌ కావాలనే కల నెరవేరింది

‘‘ఒక మంచి కథలో ముఖ్యమైన పాత్రలు  చేయడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. కథని ముందుకు తీసుకెళ్లే అలాంటి పాత్రని ‘గని’తో మరోసారి చేయడం నటుడిగా ఎంతో తృప్తినిచ్చింద’’న్నారు నవీన్‌చంద్ర. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘గని’లో నవీన్‌ చంద్ర

Updated : 31 Mar 2022 14:10 IST

‘‘ఒక మంచి కథలో ముఖ్యమైన పాత్రలు  చేయడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. కథని ముందుకు తీసుకెళ్లే అలాంటి పాత్రని ‘గని’తో మరోసారి చేయడం నటుడిగా ఎంతో తృప్తినిచ్చింద’’న్నారు నవీన్‌చంద్ర. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘గని’లో నవీన్‌ చంద్ర ఓ కీలక పాత్రని పోషించారు. కిరణ్‌ కొర్రపాటి  దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నటుడు నవీన్‌చంద్ర   బుధవారం  హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘చిన్నప్పట్నుంచి బాక్సర్‌ కావాలని ఉండేది. దానికి కారణం మా మేనమామ శివరాజ్‌. ఆయన జాతీయ స్థాయి బాక్సర్‌. ఆయన్ని చూసి స్ఫూర్తి పొందేవాణ్ని. బాక్సర్‌ కావాలనే ఆ కోరిక ఈ సినిమాతో తీరడంతో కల నిజమైన భావన కలిగింది. నటులకి ఇలాంటి ఓ వరం ఉంటుంది. ఇందులో ఆది అనే బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌ని ఢీ కొట్టే పాత్రలో కనిపిస్తా. ఈ సినిమాకి ముందే ‘సార్పట్ట’లో   బాక్సర్‌గా నటించే అవకాశం వచ్చింది. అప్పట్లో వేరే సినిమాల వల్ల అది చేయడం కుదరలేదు. బాధపడ్డా. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇందులో నటించే అవకాశం వచ్చింది’’.

‘‘కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా రోజులపాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ బృందంలోని ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేశారు. బాక్సింగ్‌ డ్రామా కథ కాబట్టి ముఖ్యంగా నటులు 2, 3 ఏళ్లు ఫిట్‌గా ఉండాల్సి వచ్చింది. ఆ విషయంలో ట్రైనర్స్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. రష్యా నుంచి వచ్చిన ట్రైనర్లు, జాతీయ బాక్సర్లు నాకూ, వరుణ్‌కి శిక్షణ ఇచ్చారు. నటించేటప్పుడు ఎక్కడ దెబ్బలు తగులుతాయో, ఎప్పుడు చిత్రీకరణ ఆగిపోతుందో అనిపించేది’’.

‘‘వరుణ్‌తేజ్‌, నేను కలిసి చేసిన తొలి చిత్రమిదే. ఆరడుగులకిపైగా కనిపించే వరుణ్‌కి నేను సరిపోతానా అనుకున్నా. సెట్లో బాక్సర్‌గా చాలా బలంగా కనిపించేవారు. ట్రైనర్లు ఇచ్చిన శిక్షణతో నాలో నమ్మకం   పెరిగింది. దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి, వరుణ్‌ నన్ను ప్రోత్సహించారు. సెట్లో బాక్సింగ్‌ రింగ్‌లోకి వెళ్లాక వరుణ్‌ మొదట నాతో చెప్పిన మా ‘బ్రదర్‌, నేను నిన్ను కొట్టను’ అని. ఆ మాటతో నాలో సగం ఒత్తిడి తగ్గిపోయింది (నవ్వుతూ). మామూలుగా అయితే బాక్సింగ్‌ క్రీడ గంట, గంటన్నరలో పూర్తవుతుంది. క్రీడాకారులు నీరసించిపోతారు. మేం ఐదు రోజులపాటు ఆ లైటింగ్‌ మధ్య చిత్రీకరణ అంటే చాలా కష్టంగా అనిపించేది. పైగా ఆ సన్నివేశాల్ని కరోనా సమయంలో, చుట్టూ 200 మంది ఉన్నప్పుడు జాగ్రత్తగా  తెరకెక్కించారు’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని