Pakka Commercial: నవ్వించే ‘పక్కా కమర్షియల్‌’

గోపీచంద్‌, రాశి ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. జీఏ2 పిక్చర్స్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించాయి. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

Updated : 07 Dec 2022 21:00 IST

గోపీచంద్‌, రాశి ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. జీఏ2 పిక్చర్స్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించాయి. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ..   ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత నేను చేసిన అంత ఫన్‌ ఉన్న కథ ఇదే. సెట్లో ప్రతి సీన్‌ ఎంజాయ్‌ చేస్తూ చేశాం. మారుతి ఏదైతే కథ రాసుకున్నాడో.. దానికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నా. టైటిల్‌కు తగ్గట్లుగానే పక్కా కమర్షియల్‌ చిత్రమిది.’’ అన్నారు. చిత్ర సమర్పకులు అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘గోపీచంద్‌ తండ్రి టి.కృష్ణ ఎంత గొప్ప దర్శకుడో చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆయన్ని మా బ్యానర్‌లో ఓ సినిమా చెయ్యమని అడిగా. తర్వాత అనుకోకుండా ఆయన క్యాన్సర్‌తో పరమపదించారు. ఆ తర్వాత వాళ్ల అబ్బాయి గోపీచంద్‌తో సినిమా తీస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజున అది సాధ్యమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలు మేళవించి తీసిన పక్కా కమర్షియల్‌ చిత్రమిది. నా నుంచి ఆశించే కామెడీతో పాటు గోపీచంద్‌ నుంచి ఆశించే యాక్షన్‌.. ఈ చిత్రంలో ఉన్నాయి. వందశాతం ప్రేక్షకులకు వినోదం పంచుతుంది’’ అన్నారు దర్శకుడు మారుతి. నిర్మాత బన్నీ వాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక కమర్షియల్‌ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ సరిగ్గా కుదిరితే అది కచ్చితంగా మంచి చిత్రమవుతుంది. ఈ సినిమాలో అవన్నీ సరిగ్గా కుదిరాయి. ఈ చిత్ర టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఫిక్స్‌ చేశాం’’ అన్నారు. ‘‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ‘ప్రతిరోజూ పండగే’లో నేను చేసిన ఏంజెల్‌ ఆర్నా పాత్రకు రెండు రెట్లు వినోదాలు పంచే పాత్ర ఈ సినిమాలో పోషించా. నాకింత మంచి పాత్ర రాసినందుకు దర్శకుడు మారుతికి థ్యాంక్స్‌’’ అంది నాయిక రాశి ఖన్నా. ఈ కార్యక్రమంలో అజయ్‌ ఘోష్‌, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని