Cinema News: భావాలు కురిస్తే... మనసులు తడిస్తే...

చిటపట చినుకుల కాలమిది దేశమంతటా ముసురు పట్టుకుంది. ఎక్కడ చూసినా వానే.. వారం రోజులుగా వీధుల్ని, నగరాల్ని తడిపేస్తోంది. వాన చుట్టూ అల్లుకున్న సినిమాలు చూస్తే ఈ సమయం మరింత...

Published : 24 Jul 2021 10:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిటపట చినుకుల కాలమిది దేశమంతటా ముసురు పట్టుకుంది. ఎక్కడ చూసినా వానే.. వారం రోజులుగా వీధుల్ని, నగరాల్ని తడిపేస్తోంది. వాన చుట్టూ అల్లుకున్న సినిమాలు చూస్తే ఈ సమయం మరింత ‘వర్ష’రంజితమవుతుంది.. ఆరుబయట జోరువాన సినిమాలో వాన కలిస్తే చూసే ప్రేక్షకుడి హృదయం తడిసి ముద్దవ్వాల్సిందే. బాలీవుడ్, టాలీవుడ్‌లలో వచ్చిన వాన సినిమాల వైపు ఈ వారాంతంలో ఓ లుక్కేయండి.

ప్రేమ కోట.. రెయిన్‌ కోట్‌

అజయ్‌ దేవ్‌గణ్, ఐశ్యర్యరాయ్‌ నటించిన ఈ సినిమా వానకాలం ఆత్మను ఆవిష్కరించిందనడంలో సందేహం లేదు. ప్రముఖ ఆంగ్లరచయిత హెన్రీ రాసిన ‘ది గిఫ్ట్‌ ఆఫ్‌ మ్యాగి’ ఆధారంగా తెరకెక్కిందిది. ఓ వానకాలపు మధ్యాహ్నం వేళ తన మాజీ ప్రేయసి నీర్జాను కలుసుకుంటాడు మనోజ్‌. కొన్ని  కారణాల కారణంగా జీవితం పంచుకోలేక పోయిన ఈ ప్రేమజంట ఆ సాయంకాలం ఏం చేసిందనేది చాలా హృద్యంగా తెరకెక్కించారు. వలపు వర్షంలో ముంచేస్తూ తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేస్తుందీ సినిమా. కథనం నెమ్మదిగా సాగినా, సినిమాలోని సంభాషణాలు, ప్రేమలోని గాఢత, అజయ్, ఐష్‌ నటన కట్టిపడేస్తాయి.


చినుకుల తలంబ్రాలు

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకురాలు మీరా నాయర్‌ భారతీయుల వివాహంపై తీసిన ఫ్యామిలీ డ్రామా ‘మాన్‌సూన్‌ వెడ్డింగ్‌’. నసీరుద్దిన్‌ షా నటించిన ఈ చిత్రం చూస్తున్నంతసేపు వర్షాకాలంలో సమీప బంధువుల వివాహానికి హాజరైన అనుభూతినిస్తుంది. కథనాన్ని ఫీల్‌గుడ్‌గా  కొనసాగిస్తూనే సమాజంలో పలు సమస్యలను లేవనెత్తారామె. లింగవివక్ష, చిన్నపిల్లల ప్రవర్తన, కుటుంబంలో బయటకు కనిపించని కోణాలను చాలా సున్నితంగా చూపించారు. పనిమనిషి అలీస్, వెడ్డింగ్‌ ప్లానర్‌ అయిన దూబేల మధ్య నడిచే ప్రేమకథ మరింతగా  ఆకట్టుకుంటుంది.


భయం వరద.. తుంబడ్‌

హిందీలో 2018లో వచ్చిన పిరియాడిక్‌ హారర్‌ చిత్రం ‘తుంబడ్‌’. బ్రిటీష్‌ కాలంలో సాగే ఈ కథ బంగారు నాణేల వేట నేపథ్యంలో తెరకెక్కింది. చిత్ర కథతోపాటు, కథనం విభిన్నంగా సాగడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందీ చిత్రం. తెర చినుకుల తడితో నిండిపోతుంది. అలాంటి వాతావరణం కనిపించేందుకు నాలుగైదు సంవత్సరాల పాటు వర్షాకాలంలోనే ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం. ప్రేక్షకుడిని సరికొత్త హారర్‌ సినిమాను చూసిన అనుభూతినిస్తుందీ చిత్రం.


జీవిత ప్రవాహం

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ బసు తీసిన చిత్రం ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’. వానకాలంలో ముంబయి జీవితం ఎలా ఉంటుందనేది  అందంగా చూపించారు. మొత్తం తొమ్మిది పాత్రలుండే ఈ సినిమాలో ప్రేమకథలతో పాటు ఫ్యామిలీ డ్రామాను మేళవించి ఆకట్టుకునేలా తీశారు. కంగనా రనౌత్, శిల్పాశెట్టి, షర్మాన్‌ జోషి, ఇర్ఫాన్‌ ఖాన్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. సంగీతం, కెమెరావర్క్‌ చిరుజల్లుల్లో తడిసిన అనుభూతినిస్తాయి.


ప్రేమ ‘వర్షం’లో తడవాలంటే

తెలుగులో వచ్చిన వాన సినిమాల్లో అన్నింటికన్నా ముందు చెప్పుకోవాల్సింది ‘వర్షం’. ప్రభాస్, త్రిషల కలయికలో వచ్చిన ఈ చిత్రంలో వాన ఓ పాత్ర పోషించిందనే చెప్పుకోవచ్చు. వారిద్దరిని కలిపేది ఈ తుంటరి వర్షమే. అందుకే సినిమా మరింత రొమాంటిక్‌గా మార్చడంలో వర్షానిదే కీలక పాత్రనడంలో అతిశయోక్తి ఏమీకాదు.


విషాద వాన: కన్నడంలో బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ముంగారు మళె’ను ‘వాన’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. తెలుగులో కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయినా, మ్యూజికల్‌గా సూపర్‌ హిట్‌ అయింది. విషాద ప్రేమకథగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఇదీ వర్షం నేపథ్యంలోనే తెరకెక్కింది. చాలా సన్నివేశాల్లో చినుకుల తడి వానలో మునిగిన అనుభూతినిస్తుంది. ‘సిరిమల్లె వాన’, ‘ఆకాశ గంగ’, ‘ ఎదుట నిలిచింది చూడు’ పాటలు వినడానికే కాదు, చూడటానికి అంతే బాగుంటాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని