HanuMan: ఆ విషయంలో నా కంటే తేజ సజ్జ సీనియర్‌: రానా దగ్గుబాటి

‘హనుమాన్‌’ చిత్రబృందం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించింది. రానా దగ్గుబాటి అతిథిగా హాజరయ్యారు.

Published : 09 Jan 2024 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యువ నటుడు తేజ సజ్జ (Teja Sajja) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్‌’ (HanuMan). ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సూపర్‌ హీరో టూర్‌’ పేరుతో చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. ఇందులో భాగంగా ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుబాటి (Rana) అతిథిగా హాజరయ్యారు.

‘‘ఇంద్ర’ సినిమాలో బాలనటుడిగా కనిపించిన తేజ అంటే టాలీవుడ్‌లో అందరికీ ఇష్టమే. నేనూ ఆ సినిమా సమయంలో అతడికి అభిమానినయ్యాను. రెండున్నరేళ్ల వయసు నుంచే నటించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో నాకంటే తేజ సీనియర్‌. ‘హనుమాన్‌’ సినిమా విడుదల కోసం అందరిలాగే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీని షూటింగ్‌ మొదలైనప్పటి నుంచే టీమ్ సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇది చాలా సంతోషకరమైన విషయం’ అంటూ తేజ సజ్జను రానా బాలీవుడ్‌ మీడియాకు పరిచయం చేశాడు.

హైదరాబాద్‌లో ఈ సినిమా పెయిడ్‌ ప్రీమియర్స్‌ తాజాగా ఓపెన్‌ చేయగా వాటి టికెట్లు క్షణాల్లో అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. మొత్తం 11 భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అంజనాద్రి అనే కల్పిత ప్రదేశం నేపథ్యంలో సాగే చిత్రమిది. కథానాయకుడు హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందింది. ‘జాంబీరెడ్డి’ తర్వాత తేజ సజ్జ, ప్రశాంత్‌ వర్మల (Prasanth varma) కాంబోలో తెరకెక్కనున్న చిత్రం కావడం, ట్రైలర్‌లో గ్రాఫిక్స్ ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని