బెంగళూరులో డ్రగ్స్‌ కలకలానికి అదే మూలం

అటు సినీ.. ఇటు రాజకీయ.. మరోవైపు నేరసామ్రాజ్య ప్రముఖుల పాత్ర కలగలిపిన ‘డ్రగ్స్‌ కేసు’ తీవ్ర కలకలం రేపుతోంది. దొరికితే దొంగలు.. లేకుంటే దొరలు చందంగా ప్రస్తుతం...

Updated : 15 Sep 2020 08:35 IST

సంజనాకు మూడు రోజుల కస్టడీ

నేరాల అడ్డాగా మారిన కొలంబో క్యాసినో కేంద్రాలు

అటు సినీ.. ఇటు రాజకీయ.. మరోవైపు నేరసామ్రాజ్య ప్రముఖుల పాత్ర కలగలిపిన ‘డ్రగ్స్‌ కేసు’ తీవ్ర కలకలం రేపుతోంది. దొరికితే దొంగలు.. లేకుంటే దొరలు చందంగా ప్రస్తుతం ఈ కేసులో కర్ణాటక పోలీసులు ఇద్దరు నటీమణులను కటకటాలవెనక్కి చేర్చాక మిగిలిన వారిలో గుబులు మొదలైంది. వారితో అనుబంధంగా ఉంటున్న రాజకీయ నాయకుల్లోనూ ఉలికిపాటే. ఈ మొత్తం వ్యవహారం పొరుగు దేశంలోని కొలంబో నగర క్యాసినోల చుట్టూ తిరగడం పతాకస్థాయి అంశం!

బెంగళూరు (మల్లేశ్వరం) : మాదక ద్రవ్యాల కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదికి 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ విధించారు. ఆపై పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. సోమవారం న్యాయస్థానం ముందు రాగిణి ద్వివేదిని హాజరుపరిచిన పోలీసులు ‘విచారణకు ఏమాత్రం సహకరించటం లేదు’ అంటూ న్యాయమూర్తికి విన్నవించారు. డిజిటల్‌ సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన రాగిణి ద్వివేది నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం సేకరించటం కష్టంగా మారిందని వివరించారు. ఆమెతో పాటు మరో ఐదుగురిని న్యాయ నిర్బంధాన్ని విధిస్తూ కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో అదుపులో ఉన్న మరోనటి సంజనాకు ఈనెల 16 వరకు పోలీస్‌ కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. సంజనా కూడా విచారణకు సహకరించటం లేదని పోలీసులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమెను మహిళా సాంత్వన కేంద్రానికి తరలించారు. బెయిల్‌ కోసం రాగిణి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

వినోదాలు.. వికృతాలు..

కొలంబో క్యాసినోలు కేవలం వినోదానికే కాదు అక్రమ నగదు బదిలీ, మాదక ద్రవ్యాల సరఫరాలకు అడ్డాగా మారినట్లు కర్ణాటక ఇంటెలిజెన్స్‌ విభాగం గుర్తించింది. ఈ విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా రాజకీయ, చలన చిత్ర, వ్యాపారవేత్తల పాత్రపైనా నిఘా పెంచినట్లు హోం మంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. 2012లోనే కొలంబోలో కర్ణాటక వ్యక్తులు క్యాసినోలు ప్రారంభించినట్లు గుర్తించగా ఏటా భారత్‌ నుంచి ప్రముఖ తారలతో అక్కడ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని హోం మంత్రి తెలిపారు. ఈ సందర్భంగానే మాదక ద్రవ్యాల వ్యాపారం యథేచ్చగా కొనసాగుతోంది. ఈ వ్యాపారాలు దేశంలోని ప్రముఖ వ్యక్తుల అండదండలతో కొనసాగుతున్నాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎన్‌సీబీ ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ క్యాసినోల నిర్వహణల్లో భాగంగానే కర్ణాటక నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల నుంచి అక్రమ నగదు బదిలీ జరుగుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించటంతో ఈడీ, ఐటీ విభాగాలు రంగ ప్రవేశం చేశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్యాసినోలకు సినీ తారలను ఆహ్వానించే వీరేన్‌ ఖన్నా ఇంటిలో పది దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు గుర్తించటంతో ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ (అక్రమ నగదు బదిలీ చట్టం)కు పదునుపెట్టారు. ఈ కేసులో ఇంతియాజ్‌ కాత్రి, కార్తీక్‌ రాజ్‌ల అరెస్ట్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ సన్నిహితుడిగా చెబుతున్న షేక్‌ ఫాజిల్‌ పాత్రపై ఆరా మొదలవటంతో రాజకీయ నేతల్లో గుబులు మొదలైంది.

ముంబయితో ముడి..

శ్రీలంకకు చేరవేసే మాదక ద్రవ్యాలకు దక్షిణ భారత రాష్ట్రాలే ప్రధాన వనరులుగా మారాయని ఐఎస్‌డీ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు, గోవా, కర్ణాటక నుంచి శ్రీలంకకు మాదక ద్రవ్యాల సరఫరా గత పదేళ్లుగా పెరిగిందని ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. 2000 వరకు ఆంధ్ర, కర్ణాటకల్లో పండించే గంజాయిని పంపుతుండగా నేడు ఆధునిక రూపాల్లో మాదక ద్రవ్యాల వ్యాపారం మొదలైంది. ఇండోనేషియా, మలేషియా, నైజీరియా, సెనెగల్‌ల నుంచి బెంగళూరు, అక్కడ నుంచి ముంబయి మీదుగా శ్రీలంకకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వివిధ పోలీసు విభాగాల విచారణల్లో తేలింది. ఈ కేసులో చలనచిత్ర ప్రముఖులది కేవలం అతిథి పాత్రలేనని, పూర్తి స్థాయి పాత్రలు రాజకీయ, వ్యాపార వేత్తలవని ఐఎస్‌డీ, రాష్ట్ర గూఢాచారి వ్యవస్థల నివేదికల ద్వారా వెల్లడైంది.

కారాగారానికి రాగిణి ద్వివేది

కర్ణాటక డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతూ శ్రీలంకకు చేరుకుంది. శ్రీలంక వాణిజ్య రాజధాని కొలంబోలో నిర్వహిస్తున్న క్యాసినోల్లో బెంగళూరు బడా వ్యాపారవేత్తల పెట్టుబడులు భారీగానే ఉన్నాయని ఇంటర్నల్‌ సెక్యూరిటీ డివిజన్‌(ఐఎస్‌డీ) కర్ణాటక హోం శాఖకు నివేదిక అందించింది. వీటిల్లో ఓ క్యాసినోకు నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న రాహుల్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఈ క్యాసినోలకు రాజకీయవేత్తల సహకారం ఉన్నట్లు కూడా గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు.

భధ్రత మధ్య బెంగళూరు కేజీ జనరల్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్షకు హాజరవుతున్న

నటీమణులు రాగిణి, సంజనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని