Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ

నవీన్‌ చంద్ర (Naveen Chandra), స్వాతి, కొత్త నటి శ్రేయ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీకాంత్‌ తెరకెక్కించిన సినిమా ‘మంత్‌ ఆఫ్‌ మధు’. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 01 Oct 2023 23:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భానుమతి రామకృష్ణ’ సినిమా విషయంలో దర్శకుడు శ్రీకాంత్‌ నాగోతికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించిందని యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) అన్నారు. ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నవీన్‌ చంద్ర (Naveen Chandra), ‘కలర్స్‌’ స్వాతి, నూతన నటి శ్రేయ ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించింది.

మరో స్టార్‌హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?

వేడుకనుద్దేశించి సిద్ధు మాట్లాడుతూ.. ‘‘శ్రీకాంత్‌ కథలన్నీ యూనివర్సల్‌గా ఉంటాయి. భవిష్యత్తును ఊహించి రాస్తుంటాడు. ఇంతకుముందు ఆయన తీసిన ‘భానుమతి రామకృష్ణ’ చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా విషయంలో ఆయనకు ప్రశంసలు దక్కాయిగానీ అతడికి రావాల్సిన గుర్తింపు రాలేదని నాకు అనిపించింది. ‘మంత్‌ ఆఫ్‌ మధు’ ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. చాలామంది అబ్బాయిల క్రష్‌ లిస్ట్‌లో స్వాతి ఉంటుంది. పన్నుమీద పన్ను ఉందని నన్ను ఆమెతో పోల్చేవారు (నవ్వుతూ). నేను, ఆమె ఫోన్‌లో అప్పుడప్పుడూ సరదాగా మాట్లాడుకుంటాం. నవీన్‌ చంద్రతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి’’ అని ఆకాంక్షించారు.

ఆ సంగతి నాకే గుర్తులేదు: స్వాతి

‘‘నేను 32 చిత్రాల్లో నటించానన్న సంగతి నాకే గుర్తులేదు. ఆ ప్రస్తావన తీసుకొచ్చి శ్రీకాంత్‌ నన్ను ర్యాగింగ్‌ చేశారు. సాధారణంగా సినిమాల విషయాల్లో కొన్ని లెక్కలుంటాయి. ‘దీని తర్వాత ఇది జరగబోతుందని.. దాని తర్వాత అది అవ్వబోతుంది’ అని ఊహించగలం. కానీ, ఈ సినిమాలో ఎలాంటి లెక్కలు ఉండవు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయేలా కాకుండా ప్రతి పాత్రా పరిపూర్ణంగా ఉంటుంది. అచ్చు రాజమణి నేపథ్య సంగీతంతో మా పాత్రలు, సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. శ్రేయ ఈ సినిమాలో సర్‌ప్రైజ్‌. సినిమా విడుదల తర్వాత మా పాత్రలు, డైలాగుల గురించి మాట్లాడుకుంటారు’’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఏం ఉందో ఇప్పుడు చెప్పినా అర్థంకాదు. విడుదలయ్యాక మీకే తెలుస్తుంది. టీమ్‌ అంతా ప్రేమతో ఈ సినిమాకి పనిచేసింది. నవీన్‌ చంద్రతో సినిమా అంటే పనిచేస్తున్న ఫీలింగ్‌ ఉండదు. సెట్స్‌లో ప్రతి రోజూ నన్ను ఏదో విధంగా సర్‌ప్రైజ్‌ చేసేవాడు. మేం ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా రూపొందించాం. మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. సిద్ధు జొన్నలగడ్డ నాకు ఎప్పటి నుంచో పరిచయం. 24 గంటలూ యంత్రంలా పనిచేస్తుంటాడు. తన చుట్టూ ఉండే వారిలో స్ఫూర్తినింపుతాడు. మమ్మల్ని ఆశీర్వదించేందుకు ఇక్కడకు వచ్చిన సిద్ధుకి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇంత మంచి సినిమాల్లో నటించే అవకాశం రావాలంటే ఏ నటుడికైనా చాలా సమయం పడుతుంది. అదృష్టవశాత్తు నాకు ఆ అవకాశం త్వరగా వచ్చింది. అందుకు శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు’’ అని నవీన్‌ చంద్ర అన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని