Sravana Bhargavi: వివాదానికి ముగింపు పలికిన శ్రావణ భార్గవి

శ్రావణ భార్గవి (Sravana bhargavi).. గాయనిగా అందరికీ సుపరిచితురాలైన ఆమె ఇటీవల సోషల్‌మీడియాలో కాస్త గట్టిగానే వైరల్‌ అయ్యారు.

Published : 24 Jul 2022 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రావణ భార్గవి (Sravana bhargavi).. గాయనిగా అందరికీ సుపరిచితురాలైన ఆమె ఇటీవల సోషల్‌మీడియాలో కాస్త గట్టిగానే వైరల్‌ అయ్యారు. దైవగీతాన్ని  శ్రావణ భార్గవి తన అందాన్ని వర్ణించేలా రూపొందించిన వీడియోకు జోడించడం వివాదాస్పదమైంది. ఒక వర్గం ఆమెను తీవ్రంగా, విమర్శించగా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా వాటన్నింటికీ శ్రావణ భార్గవి ముగింపు పలికారు. ఆమె రూపొందించిన వీడియో బ్యాగ్రౌండ్‌లో వినిపించే కీర్తనను తొలగించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘‘నా యూట్యూబ్‌ ఛానల్‌ అభిమానులకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని, మనశ్శాంతిని తీసుకొస్తుంది. నేనెప్పుడూ తెలిసి తెలిసి వివాదాలను కొని తెచ్చుకోను. నా సామాజిక మాధ్యమాల వేదికగా నెగెటివిటీని అస్సలు ప్రోత్సహించను. నేను అదే పంథాను అనుసరిస్తా. అన్నమాచార్య గారి మీద ఉన్న అపార గౌరవం, ఆరాధనతో ఇటీవల విడుదల చేసిన వీడియోలోని ఆడియోను తొలగిస్తున్నా. ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ వీడియో చేయడం వెనుక ఎన్నో గంటల సమయం, శ్రమ ఉన్నాయి. అదొక అందమైన కళాఖండమని నేను నమ్ముతున్నా. ఆ వీడియో మరొక ఆడియోతో నా ఛానల్‌లో కొనసాగుతుంది. చివరిగా.. ఎప్పుడైతే మీరు చూసే తీరు మారుతుందో అప్పుడే మార్పును కూడా చూడగలరు. దృష్టికోణం ప్రతి విషయంలోనూ ఉంది’’ అని (Sravana bhargavi) పేర్కొన్నారు.

ఈ నెల 16న శ్రావణ భార్గవి ఆ వీడియోను పోస్ట్‌ చేయగా, క్షణాల్లో వైరల్‌ అయింది. అంతే స్థాయిలో వివాదాస్పదమైంది. ఇప్పటివరకూ ఆ వీడియోకు రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఆ వీడియోను తొలగించాలని, అన్నమయ్య వారసులుతో పాటు, అన్నమాచార్య ట్రస్ట్‌ సిబ్బంది కూడా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శ్రావణ భార్గవి (Sravana bhargavi) తో మాట్లాడారు. ‘అందులో అశ్లీలం ఏముంది చెప్పండి. మీకు దృష్టి లోపం ఉంటే ఏమీ చేయలేను. మీరు భక్తితో సరిగ్గా చూస్తే అమ్మవారే కనిపిస్తారు. మీ చూపులో లోపం ఉంది. అది చూసుకోండి. నిండుగా దుప్పటి కప్పుకున్న అమ్మాయి కూడా మన చూపు సరిగా లేకపోతే అశ్లీలంగా కనిపిస్తుంది’ అంటూ శ్రావణ భార్గవి విమర్శకులకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. అంతేకాదు, ఆ వీడియోలో తప్పుగా ఏమీ చూపించ లేదని, తనకున్న సంగీత జ్ఞానంతో భక్తిశ్రద్ధలతో పాడానని అన్నారు. తన ఛానల్‌లో వీడియో తొలగించటం కుదరదని తెగేసి చెప్పారు. అయితే, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ విపరీతంగా పెరిగిపోవడంతో తన అభిమానులు సైతం ఇబ్బంది పడుతుండటంతో చివరకు శ్రావణ భార్గవి ఆ వీడియోకు సంబంధించిన ఆడియోను మాత్రం తొలగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని