Lata Mangeshkar: పాటల్లో కోకిలమ్మ.. పాఠాల్లో భారతరత్నమ్మ

ఈసారి వసంతంలో లేత చిగురులు తినవేమో కోకిలలు లత పుడమిని విడిచి వెళ్లిపోయారని దీక్ష... ప్రకృతి పరవశించేలా గొంతెత్తి పాడవేమో అవి... గానకోకిల గాత్రంలో ఇక తాముండమని నిరసన.. స్వరాలన్నీ అలిగి సంగీత వాయిద్యాలపై పలుకవేమో

Updated : 08 Feb 2022 11:03 IST

ఈసారి వసంతంలో లేత చిగురులు తినవేమో కోకిలలు

లత పుడమిని విడిచి వెళ్లిపోయారని దీక్ష...

ప్రకృతి పరవశించేలా గొంతెత్తి పాడవేమో అవి...

గానకోకిల గాత్రంలో ఇక తాముండమని నిరసన..

స్వరాలన్నీ అలిగి సంగీత వాయిద్యాలపై పలుకవేమో

అతిక్లిష్టమైన మూడో స్వరం అసంతృప్త గళం...

సరిగమలు కన్నీళ్లలో తడిసి ఏ గాత్రంలోనూ ఇమడవేమో

అమ్మ కావాలని ఏడ్చే చిన్నపిల్లల్లా సహాయ నిరాకరణ...

ఇవన్నీ చూస్తూ లతమ్మ ఎలా ఉండగలరు? ఉండలేరు. మళ్లీ వస్తారు. ముప్పైవేల పాటలై పల్లవిస్తారు. కోకిలలను బుజ్జగిస్తారు. స్వరాలను లాలిస్తారు. సరిగమలను ఒడిలోకి తీసుకొని ఓదార్చుతారు. ఎందుకంటే ఆమె అమృతగానాల అమ్మ. అంతేకాదు తన జీవితం ద్వారా మనకెన్నో బోధిస్తారు. ఓర్పుతో గెలవలేనిది ఏదీ లేదని వివరిస్తారు. క్రమశిక్షణ, నిజాయతీ ఉంటే తలవంచని శిఖరం ఉండదని చెబుతారు. పదమూడేళ్ల వయస్సులోనే కుటుంబ పోషణకు నడుంబిగించిన తన పోరాట పటిమను చూపుతారు. అవకాశం లేదు పొమ్మన్న వారిని ప్రతిభతో ఆకాశమంత ఎదిగి తన ఇంటి ముందుకు ఎలా తెచ్చుకోవాలో నేర్పుతారు. 70ఏళ్లు భారతీయ సినీ పరిశ్రమలో అలుపెరగక పాడి.. 92ఏళ్ల వయస్సులో ఆమె శాశ్వత విశ్రాంతి తీసుకున్నా... మనల్ని మాత్రం మేలుకొల్పుతూనే ఉంటారు. అందుకే పాటల్లో ఆమె గానకోకిలమ్మ... జీవిత పాఠాల్లో భారతరత్నమ్మ.

లత అంటే... ఇప్పుడు మనందరికీ తెలిసిన గాయని. అయిదేళ్ల వయసులో వాళ్ల నాన్నకే తెలిసిన గాయని. ఆ వయసులోనే లతా రాగాలను ఒంటబట్టించుకున్నారు. ఒక రోజు తండ్రి దీనానాథ్‌ శిష్యులకు పూరియా ధనశ్రీ రాగం నేర్పి అభ్యాసం చేయమని పనిమీద బయటకు వెళ్లారు. అందులో ఒకరు తప్పుగా ఆ రాగాన్ని పాడటం గమనించిన లతా అతణ్ని సవరించారు. ఆమెలోని ప్రతిభను గుర్తించి తండ్రి ప్రోత్సహించారు. అభ్యసన సామర్థ్యం పిల్లల్లో ఎలా ఉండాలో ఆమె బాల్యం మనకు నేర్పుతుంది. పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ మరాఠీ రంగస్థల నటుడు, మంచి గాయకుడు. తను ప్రదర్శనలు ఇచ్చే ‘భవబంధన్‌’ నాటికలోని నాయిక పేరు ‘లత’ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే హేమ పేరును ‘లత’గా మార్చి పిలుచుకోసాగారు. ఇంట్లో పెద్ద కుమార్తెగా చెల్లెళ్లను కంటికి రెప్పలా కాచుకునేవారామె. తనతో చెల్లెలు ఆశాను బడికి తీసుకువెళ్లారు. ఆశాకు పాఠశాలకు వెళ్లే వయసు లేదని ఉపాధ్యాయులు ఆమెను లోనికి రానివ్వలేదు. పైగా అక్కడున్న పిల్లలకు లత సంగీత పాఠాలు చెబుతుండడంతో మందలించారు. దీంతో లతాజీ  పాఠశాల చదువు మానేసి ఆ చదువు సంధ్యలన్నీ ఇంటిలోనే కొనసాగించారు. లతాజీకి తండ్రి తొలుత పెట్టిన ‘హేమ’ పేరులాగే ఆమె మనసు బంగారమని ఆ వయసులోనే తెలిసిపోయింది.


కష్టాల కడలిని ఈది...

పుణెలోని ‘సాసూన్‌’ ఆసుపత్రిలో దీనానాథ్‌ మరణించారు. అన్నీ లత, ఆమె తల్లి సుధామతి దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. ఇల్లు గడవడం కష్టంగా మారింది. చెల్లెళ్లు, తమ్ముడు, తను, తల్లి.. ఇంతమందికి ఎలా గడవాలి? దానికి తోడు తమ్ముడు హృదయ్‌నాథ్‌కి బోన్‌   టి.బి. వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం తప్ప మరోమార్గం లేకపోయింది. మాస్టర్‌ వినాయక్‌ ‘ప్రపుల్లా ఫిల్మ్‌ కంపెనీ’లో నెలకు ఎనభై రూపాయల జీతానికి చేరారు లత! తండ్రి మరణానంతరం కుటుంబ బాధ్యతలను నెత్తికి ఎత్తుకున్నారు. పదమూడేళ్ల వయసులోనే ఎంత కష్టం వచ్చినా తట్టుకోగల స్థైర్యం ఆమె సొంతం.


ఆకలి మండుతున్నా..

చిన్నప్పుడు జరిగిన పోటీల్లో తనకు బహుమతినిచ్చిన గులామ్‌ హైదర్‌ ఓరోజు కనిపించారామెకు. శశిధర్‌ ముఖర్జీ తీస్తున్న ‘షహీద్‌’ చిత్రంలో పాడిస్తానని మర్నాడు లతను రమ్మన్నారు. లత వచ్చి కూర్చొని ఉంటే మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్న గులామ్‌హైదర్‌ ఆ సంగతే మర్చిపోయారు. ఆకలవుతున్నా, ఎండ మాడుస్తున్నా అలాగే కూర్చున్నారు లత. కదిల్తే ఛాన్సు ఎక్కడ పోతుందో అని లేవలేదామె. మధ్యాహ్నం గదిలోంచి గులామ్‌ హైదర్‌ బయటికి వచ్చి లతను చూసి ద్రవించిపోయారు. వెంటనే తీసుకువెళ్లి నిర్మాత శశిధర్‌కు పరిచయం చేశారు. వాయిస్‌ టెస్ట్‌ చేయించి గొంతు పీలగా ఉందని శశిధర్‌ తిరస్కరించారు. ఖిన్నుడైన గులాం హైదర్‌ ‘నిర్మాతలంతా లత  వద్ద చేరి పాటలు పాడమని బతిమాలే రోజు త్వరలోనే వస్తుంది’ అని హెచ్చరించారు. ‘మజబూర్‌’ (1948) చిత్రంలో ‘దిల్‌ మేరీ తోడా, ముఝే కహీ కా నా చోరా’ అనే పాట పాడించి లతాజీకి బ్రేక్‌ ఇచ్చారు. అందుకే గులాం హైదర్‌ తన గాడ్‌ ఫాదర్‌ అని లతాజీ చెబుతూనే ఉండేవారు. తనని తను మలుచుకుంటూ గానకోకిలగా ఎదిగిన ఆమె.. ఎప్పుడూ వినయ విధేయతలతోనే ఉండేవారు.


* నూర్జహాన్‌, సురయ్యా ఇద్దరూ గాయనీమణులుగా వెలుగొందుతున్న రోజులవి. సినిమాలలోకి వచ్చిన కొత్తలో నూర్జహాన్‌ పాటలు పాడే విధానాన్ని లతా అనుకరించే వారు. అయితే త్వరలోనే తనదైన శైలిలో పాడటం అభ్యాసం చేశారు. ఆ రోజుల్లో హిందీ పాటల్లో ఎక్కువ ఉర్దూ సాహిత్యం దొర్లేది. అందుకోసం లత ఉర్దూ భాషను షఫీ అనే మున్షీ వద్ద సంపూర్ణంగా నేర్చుకున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిత్య విద్యార్థిలా ఉండాలని చాటారు.


లతాజీ ఆయేగా

‘ఆయేగా...ఆయేగా...ఆయేగా ఆనేవాలా ఆయేగా’ అనే పాటను మధుబాల కోసం లతాజీ ఆలపిస్తే అది దేశాన్ని ఊపేసింది. భారతీయ గాన ప్రపంచంలోకి ‘లతాజీ వచ్చేసింది తప్పుకోండి’ అంటూ బాటలు పరిచింది. యాభయ్యవ దశకం తొలిరోజుల్లో లతాజీ ప్రముఖ సంగీత దర్శకులందరి వద్దా పాటలు పాడటం ప్రారంభించారు. అనిల్‌ బిస్వాస్‌, రామచంద్ర చితాల్కర్‌, హేమంతకుమార్‌, సలీల్‌ చౌధరి, దత్తా నాయక్‌, నౌషాద్‌, ఖయ్యాం, రోషన్‌ లాల్‌, కల్యాణ్‌జీ ఆనంద్‌జీ, వసంత దేశాయ్‌, మదన్‌ మోహన్‌ వంటి నిష్ణాతులైన సంగీత దర్శకుల చిత్రాల్లో లతా గళం వినిపించారు. నౌషాద్‌ సంగీత దర్శకత్వంలో అందమైన  క్లాసికల్‌, సెమి-క్లాసికల్‌ పాటలు ఆలపించారు.


‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’

‘మొఘల్‌-ఎ-ఆజం’ సినిమాలో నౌషాద్‌ స్వరపరచిన ‘ప్యార్‌ కియా తో డర్నా క్యా’ అని ఆమె గళం సవరించుకుంటే యావద్దేశంలోని యువత ఆమె అభిమానులైపోయారు.

* మదన్‌ మోహన్‌ ‘అపరాధ్‌’ చిత్రంలో స్వరపరచిన ‘ఆప్‌ కి నజరోం మే సమఝా’ పాటను అమృత గుళికగా సంగీతప్రియులు ఆదరించారు. అప్పుడే అడుగిడిన లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ 700కు పైగా పాటలు పాడించారు. యువ సంగీత దర్శకులు ఆనంద్‌ మిలింద్‌, నదీమ్‌ శ్రావణ్‌, జతిన్‌ లలిత్‌, ఉత్తమ సింగ్‌, అను మాలిక్‌, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి వారి సారథ్యంలో కొత్త తరం గాయకులతో గళం పంచుకున్నారు. యశ్‌ చోప్రా నిర్మించిన అన్ని సినిమాలలో ఆమె పాటలు పాడి రికార్డు సృష్టించారు. గాయకులకు కష్టసాధ్యమైన మూడో స్వరంలో ఆమె సునాయాసంగా పాడేవారు. 1948-87 మధ్యకాలంలో 36 భాషల్లో దాదాపు ముప్పైవేల పాటలు పాడారు. ప్రపంచంలోనే అత్యధిక గీతాలు ఆలపించిన గాయనిగా గిన్నిస్‌ రికార్డు ఘనత సాధించారు.  అకుంఠిత దీక్ష... అలుపెరుగని సాధన ఎవరినైనా విజయ తీరాలకు చేర్చుతాయని చెప్పకనే చెప్పారు.


పులకించిన పురస్కారాలు

రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ ‘పరిచయ్‌’ సినిమా కోసం స్వరపరచిన ‘బీతీ న బితా ఏ రెహనా’ పాట ఆలపించిన లతాజీకి జాతీయ పురస్కారం లభించింది. ‘కోరా కాగజ్‌’ చిత్రంలో కల్యాణ్‌జీ - ఆనంద్‌జీ స్వరపరచిన ‘రూటే రూటే పియా’ పాటకూ మరో జాతీయ అవార్డు అందుకున్నారు. 1974లో ప్రఖ్యాత లండన్‌ ఆల్బర్ట్‌ హాలులో సంగీత విభావరి నిర్వహించి మన్ననలందుకున్నారు. 1985లో గ్రేటర్‌ టొరంటోలోని మ్యాపుల్‌ లీఫ్‌ గార్డన్‌లో సంగీత కచేరీ నిర్వహించారు.

* భారత ప్రభుత్వం లతాజీని పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, భారతరత్న, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలు ప్రదానం చేసి గౌరవించింది. వీటితోపాటు మహారాష్ట్ర   భూషణ్‌, ఎన్‌.టి.ఆర్‌, ఏఎన్‌ఆర్‌ జాతీయ పురస్కారాలు, ఫ్రెంచ్‌ ప్రభుత్వ లెజియన్‌ అవార్డు వరించాయి. 1993లో ఫిల్మ్‌ఫేర్‌ సంస్థ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు లతా మంగేష్కర్‌ పేరుతో అవార్డును నెలకొల్పాయి. డాక్టరేట్లతో పాటు.. .ఆమె గానానికి మురిసిపోయి మరెన్నో పురస్కారాలు వరించాయి. భారత సినీ సంగీత ప్రపంచానికి ఆమె ఓ వరమని వివరించాయి. ఆమె స్ఫూర్తి శిఖరమని చాటాయి.


ప్రేమ విఫలమైనా... కుంగిపోక

లతా మంగేష్కర్‌ స్నేహితుడైన మహా రాజ్‌ సింగ్‌ దుంగార్పూర్‌ను ప్రేమించారు. వారిది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. ఆ యువరాజును పెళ్లాడి ఉంటే ఆమె ఒక మహారాణి అయివుండేది. రాయల్‌ ఫ్యామిలీకి చెందిన దుంగార్పూర్‌ తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ పెళ్లి జరగలేదు. జీవితాంతం అతడు బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. లతా అలాగే ఉండిపోయారు. కుంగిపోలేదు. కుమిలిపోలేదు. పాటలు పాడారు. జీవితాన్ని గెలిచారు.


విషాన్ని జయించి...

1962లో లత పేరు ప్రఖ్యాతులు పొందడం రుచించని కొందరు ఆమె మీద విషప్రయోగం చేశారు. ఆమెకు మూడురోజులు స్పృహ లేకుంటే వైద్యులు చికిత్స చేసి యథాస్థితికి తీసుకొచ్చారు. తరువాత ఆమె మూడు నెలలు ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. చివరికి ఆమె ఇంటిలో పనిచేసే వంటవాడితో ఎవరో విషప్రయోగం చేయించారని తేలింది. మనం ఎదుగుతున్నప్పుడు పడేయాలని చూసే చేతులకు... మనం చేతలతో సాధించే విజయాలే చెంపపెట్టు అని ఆమె కోలుకున్నారు.


ఆమె ఇంటి పేరు అది కాదు

లతాజీ తండ్రి దీనానాథ్‌కు పేర్లు మార్చే అలవాటు ఉండేది. వాళ్ల ఇంటిపేరు ‘మంగేష్కర్‌’ కానేకాదు! వారి అసలు ఇంటిపేరు ‘హర్దికర్‌’. మహారాష్ట్రవారికి ఒక సంప్రదాయం ఉంది. తమ ఊరి పేరు చివరన ‘కర్‌’ అనే పదం చేర్చి దాన్నే ఇంటిపేరుగా వ్యవహరిస్తుంటారు. గవాస్కర్‌. టెండూల్కర్‌, మంగేష్కర్‌ వంటివన్నీ ఇలాంటివే! గోవాలోని తమ ఊరు ‘మంగేష్‌’ పేరు మీదుగా ‘మంగేష్కర్‌’గా మార్చేసుకున్నారు. దాంతో ఇటు లతా హర్దికర్‌ కాస్తా ‘లతా మంగేష్కర్‌’ అయిపోయారు.


నిర్మించి... నిలిచి

1990లో  లత చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పి ‘లేకిన్‌...’ అనే సినిమా నిర్మించారు. ఇందులో ‘యార్‌ సిలి సిలి’ అని ఆమె ఆలపించిన పాటకు జాతీయ బహుమతి లభించింది. ఆమె మరాఠీలో ‘వాదల్‌’, హిందీలో ‘జాంజిహార్‌’, ‘కాంచన్‌ గంగ’ సినిమాలూ నిర్మించారు. ఎనిమిది చిత్రాల్లో నటించి మెప్పించారు.

* ‘శ్రద్ధాంజలి...మై ట్రిబ్యూట్‌ టు ది ఇమ్మోర్టల్స్‌’ పేరుతో అలనాటి గాయకులు సైగల్‌, రఫీ, హేమంతకుమార్‌, ముఖేష్‌, పంకజ్‌ మల్లిక్‌, కిషోర్‌ కుమార్‌, గీతా దత్‌, జోహరాబాయ్‌, కానన్‌ దేవి ఆలపించిన పాటల్ని తన గళంలో రికార్డు చేసి ఆల్బంలుగా విడుదల చేశారు.


జీతం తీసుకోని ఎంపీ

1999లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ అయ్యాక ఒక్క రూపాయీ జీతం తీసుకోకుండా ఆదర్శంగా నిలిచారు. 1997లో ‘సారేజహాసే అచ్ఛా’ అని ఆమె పార్లమెంటులో గళం విప్పితే... మొత్తం ఎంపీలు గొంతుకలిపారు. లతా.. తండ్రి దీనానాథ్‌ పేరిట ఓ ఆసుపత్రిని కట్టించారు.


మనసులో పెట్టుకోదు

లతాజీ సంగీతం విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. ఎవరి క్రెడిట్‌ వారికి దక్కాలన్నది ఆమె సిద్ధాంతాం. ‘రామ్‌ తేరీ గంగా మైలీ’ శతదినోత్సవంలో ఆమె మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో పాటలకు సంగీతాన్ని రవీంద్రజైన్‌ సమకూర్చారని అందరూ అంటున్నారు. రవీంద్రజైన్‌ చేసింది ఏమిటో నాకయితే తెలీదు.. నాకు తెలిసినంత వరకూ ఈ ట్యూన్‌లన్నీ రాజ్‌కపూర్‌ గతంలో దాచుకుని ఇప్పుడు వాడుకున్నవే’’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు.


రాజ్‌కపూర్‌ చెప్పినా

రాజ్‌కపూర్‌ సినిమాల్లో వేషం దొరికితే చాలనుకునేవాళ్లెందరో. అలాంటిది రాజ్‌కపూర్‌ స్వయంగా వచ్చి ‘నా సినిమాలో మీరు నటించండి’ అని అని అడిగితే.. లత తిరస్కరించారు. ‘సత్యం శివం సుందరం’ చిత్ర కథనూ ఆమె జీవిత ఆధారంగానే సిద్ధం చేయించారు. అయినా ఆమె ఒప్పుకోలేదు.


ఆమె మంచి సంభాషణా చతురురాలు. మిమిక్రీ ఆర్టిస్టు కూడా! ఎవరైనా-బోరుకొట్టే అతిథి కాని, నిర్మాతగాని ఎదురయితే తను ఎలా ప్రవర్తిస్తుందో, వారు తనతో ఎలా ప్రవర్తిస్తారో వంటి అంశాన్ని తీసుకొని వారి మేనరిజమ్స్‌ పట్టుకొని పొట్ట చెక్కలయ్యేలా అనుకరించి చూపిస్తారు లత.


అమృత స్వరానికి నివాళి

తేనెలొలుకు పాటలతో దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రియుల్ని రంజింపజేసిన సంగీత రాజ్ఞి.. గాన కోకిల లతా మంగేష్కర్‌ అమృత కంఠం శాశ్వతంగా  మూగబోయింది. ఈ విషాద వార్త విని చిత్రసీమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే చిత్ర రంగానికి ఆమె చేసిన సేవలు కొనియాడుతూ.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సినీతారలు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌, కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌, మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌, ఎన్టీఆర్‌, నాయికలు కీర్తి సురేష్‌, పూజా హెగ్డే, దర్శకుడు రాజమౌళి తదితర సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ఆమెను స్మరించుకున్నారు. వీరితో పాటు అమితాబ్‌ బచ్చన్‌ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు నివాళి అర్పించారు.


జననం: 28 సెప్టెంబర్‌, 1929 (మధ్యప్రదేశ్‌...ఇండోర్‌లో)

తొలి పేరు: హేమ,

తండ్రి: దీనానాథ్‌ మంగేష్కర్‌

తల్లి: సుధామతి

చెల్లెళ్లు, తమ్ముడు:  మీనా, ఆశా, ఉషా, హృదయనాథ్‌


ఇష్టమైనవి

రచయితలు: ఖలీల్‌ జిబ్రాన్‌, చెకోవ్‌, టాల్‌స్టాయ్‌

గాయకులు: ఉస్తాద్‌ బడే గులామ్‌ అలీ ఖాన్‌, ఉస్తాద్‌ అమీర్‌ఖాన్‌

దర్శకులు: గురు దత్‌, బిమల్‌ రాయ్‌, సత్యజిత్‌రే

చిత్రాలు: పడోసన్‌, గాన్‌ విత్‌ ద విండ్‌, లైమ్‌లైట్‌, టైటానిక్‌

ఆటలు: క్రికెట్‌, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌(లార్డ్స్‌ స్టేడియంలో ఆమెకు ప్రత్యేకమైన గ్యాలరీ ఉంది).

క్రికెటర్‌: సచిన్‌

రంగు: తెలుపు(ఎక్కువగా తెల్ల చీరలే ధరించేవారు)

అవార్డులు:  3 జాతీయ ఉత్తమ గాయని, 4 ఫిల్మ్‌ఫేర్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని