brahmanandam: బ్రహ్మానందాన్ని అలా ‘బాదే’శారు

చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా ప్రేక్షకుల్ని నవ్వించాలని తన కెరీర్‌లో కూడా ప్రతికూల పరిస్థితులు చాలా వచ్చాయని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చెబుతారు.

Published : 27 Oct 2023 14:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనదైన నటనతో ప్రేక్షకులను రంజింప చేసిన హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam). వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన ఆయన కామెడీ పండించడం అంత తేలికేం కాదంటారు. చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా ప్రేక్షకుల్ని నవ్వించాలని తన కెరీర్‌లో కూడా ప్రతికూల పరిస్థితులు చాలా వచ్చాయని చెబుతారు.

‘‘వివాహభోజనంబు’ సినిమా గుర్తుంది కదా? నాదీ సుత్తి వీరభద్రరావుగారిదీ ఓ సెపరేట్‌ ట్రాక్‌. మా ఇద్దరి మధ్యా విశాఖపట్నం బీచ్‌లో ఓ సన్నివేశం తీశారు. తలవరకూ నన్ను భూమిలో పాతిపెట్టి.. ‘హైదరాబాదు... ఆదిలాబాదు.. సికిందరాబాదూ..’ అంటూ మొత్తం ఇరవై ఒక్క బాదులతో సుత్తి వీరభద్రరావు నన్ను బాదేసే సన్నివేశం అది. నేనేమో ఆ గోతిలోనే ఉండి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాల్లో చిన్న చిన్న ట్రిక్కులు ప్లే చేస్తుంటారు. నిజంగా పాతిపెట్టకుండా.. ఓ చెక్కపెట్టెలో మమ్మల్ని నిలబెట్టి.. చుట్టూ మట్టి పేరుస్తారు. కానీ, ఆరోజు నన్ను నిజంగానే పాతేశారు. సరిగ్గా ఆ సమయానికి ఓ కుక్క అటువైపుగా వస్తోంది. దాన్ని చూసి వెంటనే జంధ్యాల గారు ‘‘ఏ ఊరకుక్కయినా దగ్గరకొచ్చి కాలెత్తితే పావనమైపోతుంది మహాప్రభో’’ అనే డైలాగ్‌ అప్పటికప్పుడు రాశారు’’

‘‘ఆ సన్నివేశం చూసి జనాలు ఇప్పటికీ నవ్వుకుంటుంటారు గానీ, ఆ రోజు నా తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కాళ్లూ, చేతులు కదపకుండా కేవలం ముఖ కవళికలే ప్రదర్శించడం అంత తేలికైన విషయం కాదు. పైగా.. మిట్టమధ్యాహ్నం ఎండ సుర్రుమంటుంది. అదేంటో నిజంగానే ముక్కు తెగ దురద పెట్టింది. నేనా గోక్కోలేను. ఎవరినైనా పిలిచి ‘సార్‌... కాస్త గోకి పెట్టరూ..’ అని అడగలేను. ‘ఈ సీన్‌ ఎప్పుడైపోతుంది భగవంతుడా’ అనుకున్నానంటే నమ్మండి. సీన్‌ అవ్వగానే... నన్ను అలానే వదిలేసి అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ‘మహానుభావా.. నన్ను ఈ గోతులోంచి తీసేదేమైనా ఉందా’ అంటూ గట్టిగా అరిస్తే... టీమ్‌లో ఎవరో వచ్చి నన్ను బయటకు లాగారు. ఈ విషయం ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తుంటుంది’’ అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని