సినీ కెప్టెన్ల... టీ20 ఆట

అలనాటి చిత్రాలను టెస్టు క్రికెట్‌తో పోలిస్తే... ప్రస్తుత చిత్రాలను వన్డే మ్యాచ్‌లు అనుకుంటే... ఇక ఓటీటీలను టీ20 క్రికెట్‌ అనుకోవచ్చు. వన్డేల్లో దుమ్మురేపిన చాలామంది సినీ కెప్టెన్లు ఇప్పుడు టీ20 మ్యాచ్‌ల్లో అ

Updated : 22 Jul 2020 15:16 IST

అలనాటి చిత్రాలను టెస్టు క్రికెట్‌తో పోలిస్తే... ప్రస్తుత చిత్రాలను వన్డే మ్యాచ్‌లు అనుకుంటే... ఇక ఓటీటీలను టీ20 క్రికెట్‌ అనుకోవచ్చు. వన్డేల్లో దుమ్మురేపిన చాలామంది సినీ కెప్టెన్లు ఇప్పుడు టీ20 మ్యాచ్‌ల్లో అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. కొందరు దర్శకత్వం వహిస్తుంటే... ఇంకొందరు కథలు, కథా సహకారం అందిస్తున్నారు. వీరిలో ఒకరిద్దరు ఇప్పటికే అరంగేట్రం చేయసేయగా... మిగిలినవాళ్లు సిద్ధమవుతున్నారు. వారెవరో.. ఆ ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూద్దాం!


‘గ్యాంగ్‌స్టార్స్‌’ క్రియేటర్‌

ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌లు చేసిన దర్శకుల గురించి మాట్లాడుకుంటే.. తొలుత ప్రస్తావించాల్సిన పేరు నందిని రెడ్డి. ‘గ్యాంగ్‌స్టార్స్‌’ అనే వెబ్‌సిరీస్‌ను రూపొందించారామే. రెండేళ్ల క్రితం క్రైమ్‌ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కు ఆ రోజుల్లో మంచి స్పందనే వచ్చింది. అజయ్‌ భుయాన్‌ దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేశ్‌, కృష్ణ భగవాన్‌‌, రాహుల్‌ రామకృష్ణ తదితరుల నటించారు. ఇప్పుడు నందినీ రెడ్డి ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెలుగు వెర్షన్‌లో ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారట. త్వరలోనే ఈ సిరీస్‌ విడుదలవుతుందని తెలుస్తోంది. 


‘మస్తీ’ చేసి చూపించాడు

మనసుకు హత్తుకునే సినిమాలు తీయడంలో దిట్ట అయిన క్రిష్‌... ‘మస్తీస్‌’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టాడు. ఆయన క్రియేటర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ ‘ఆహా’ ఓటీటీలో అందుబాటులో ఉంది. దీన్ని కూడా అజయ్‌ భుయాన్‌ తెరకెక్కించాడు. వేర్వేరు నేపథ్యాలు ఉన్న ఆరుగురు వ్యక్తుల కథ ఇది. ఎనిమిది ఎపిసోడ్లుగా ప్రసారమైన ఈ వెబ్‌సిరీస్‌కు మంచి స్పందనే వచ్చింది. ఇందులో నవదీప్‌, చాందినీ చౌదరి, బిందు మాధవి, హెబ్బా పటేల్‌ తదితరులు నటించారు.


మేర్లపాక గాంధీ ‘ఓటీటీ’ ఎక్స్‌ప్రెస్‌

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’లతో మంచి హిట్‌లు కొట్టినా ఆ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’తో కాస్త డీలా పడిపోయాడు మేర్లపాక గాంధీ. ప్రస్తుతం నితిన్‌ కథానాయకుడిగా ‘అంధాదున్‌’ రీమేక్‌ పనుల్లో బిజీగా ఉన్న మేర్లపాక గాంధీ ఓ వెబ్‌ సిరీస్‌కు కథ సిద్ధం చేశారట. తన డైరెక్షన్‌ టీమ్‌లో చాలా రోజులుగా ఉన్న అసోసియేట్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. యూత్‌ను ఆకట్టుకునేలా అడల్ట్‌ కామెడీ జోనర్‌లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో యువ నటులు సంతోష్‌ శోభన్‌, బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు ముఖ్యపాత్రలు పోషిస్తారని ఓటీటీ వర్గాల టాక్‌. ‘ఆహా’ యాప్‌ కోసం ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోందనే వార్తలూ వినిపిస్తున్నాయి.  గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ కలిసి కొన్ని సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే విశాఖపట్నంలో సముద్రపు ఒడ్డున ఓ రిసార్ట్‌ కూడా అద్దెకు తీసుకున్నారని అనుకుంటున్నారు. 


ఏం రేంజీలో ఉంటుందో

ఏ హీరోతో చేస్తే... ఆ హీరో అభిమానుల మనసు నిండేలా సినిమాలు చేయడం హరీశ్‌ శంకర్‌ స్పెషాలిటీ. స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి మెప్పించడం... కుర్ర హీరోలతో సినిమా తీసి హిట్‌ కొట్టడం ఆయనకు అలవాటు. ఇప్పుడు అదే జోరుతో ఓటీటీవైపు వస్తున్నారు. అయితే ఈసారి ఆయన దర్శకత్వం వహించడం లేదు. అలా అని కథ కూడా సిద్ధం చేయడం లేదు. ఓటీటీ కోసం ఓ పాయింట్‌ అనుకొని... తన టీమ్‌తో కథ సిద్ధం చేయిస్తున్నారట. కథ సిద్ధమయ్యాక దానిని ఆయన చూడకుండా ఉండరు... మార్పులు చెప్పకుండా ఉండరు. కాబట్టి హరీశ్‌ శంకర్‌ కూడా ఓటీటీవైపు వచ్చినట్లే. 


ఈ సారి ఏ జోనరో...

ఓటీటీలో తెలుగు వెబ్‌సిరీస్‌ వచ్చిన తొలినాళ్లలో వినిపించిన పేరు మారుతి. తనదైన శైలిలో ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించడానికి మారుతి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. ‘ఆహా’ యాప్‌ కోసం ఆ సిరీస్‌ రూపొందిస్తున్నారనే మాటలూ వినిపించాయి. అయితే ఇప్పటివరకు దానిపై అధికారిక ప్రకటన లేదు. అయితే మారుతి వెబ్‌సిరీస్‌ కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. కథ, నిర్మాణ సంబంధిత కార్యక్రమాలు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. అయితే ఆ వెబ్‌సిరీస్‌కు ఆయనే దర్శకత్వం వహిస్తారా లేక క్రియేటర్‌గా నిలిచిపోతారా అనేది చూడాలి.


పూరి స్టైల్‌లో... 

ఊర మాస్‌ హీరోయిజం, పంచ్‌ డైలాగ్‌లు, అందమైన హీరోయిన్లు... ఈ కాంబినేషన్‌ అంటే ఠక్కున మెదడులో తట్టే దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఇలాంటి అంశాల కలయిక ఓటీటీలకు బాగుంటుంది. ఈ కాన్సెప్ట్‌తో వెబ్‌సిరీస్‌లు చేస్తే... బాగుంటాయని కొన్ని వెబ్‌సిరీస్‌లు చూస్తే అర్థమవుతుంది. అందుకేనేమో పూరి కూడా ఈ వైపు వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని ఛార్మి ఇటీవల చెప్పారు. తమ ప్రొడక్షన్‌ హౌస్‌లో వెబ్‌ సిరీస్‌లు చేస్తామని... దానికి సంబంధించి పూరి స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. పూరి సినిమా మొదలుపెడితేనే 40 -50 రోజుల్లో చుట్టేస్తారు. మరి వెబ్‌సిరీస్‌ వారంలో తీసేస్తారేమో.


ఎప్పటినుంచో అనుకుంటున్నారు... 

వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టైలిస్‌ దర్శకుడు మెహర్‌ రమేశ్‌.. ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. ‘షాడో’ లాంటి డిజాస్టర్‌తో పూర్తిగా సైలెంట్‌ అయిపోయాడు. మొన్నామధ్య ‘మెహర్‌ రమేశ్‌తో సినిమా చేయొచ్చు’ అని చిరంజీవి చెప్పడంతో ఆయన మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆ తర్వాత ఆ ఊసు లేదు. అయితే ఇప్పుడు రామ్‌చరణ్‌ కోరిక మేరకు ఓ వెబ్‌ సిరీస్‌ చేయడానికి మెహర్‌ రమేశ్‌ అంగీకరించాడని తెలుగు ఓటీటీ వర్గాల భోగట్టా. గతేడాది కూడా ఇలాంటి పుకార్లు షికార్లు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఈసారి ఏమవుతుందో చూడాలి.


ఇద్దరూ వైవిధ్యమైన దర్శకులే... 

బాలీవుడ్‌లో ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌ ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిన విషయమే. సమాజంలో చర్చించడానికి ప్రజలు భయపడే, మొహమాట పడే అనేక అంశాలను అందులో ప్రస్తావించారు. ఈ సిరీస్‌లో తెలుగులో కూడా రూపొందించారు. ఓ ఎపిసోడ్‌కు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... మరో ఎపిసోడ్‌కు సంకల్ప్‌ రెడ్డి, ఇంకో ఎపిసోడకు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ సినిమాలతో వైవిధ్యమైన చిత్రాలు తీసి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సంకల్ప్‌ రెడ్డి... ‘లస్ట్‌ స్టోరీస్‌’ ఏం చెప్తాడో చూడాలి. అలాగే ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి సినిమాలతో తనేంటో నిరూపించుకున్న తరుణ్‌ భాస్కర్‌ ఏం చేస్తాడో చూడాలి. 


దృశ్యరూపంలో మైదానం...

చలం ‘మైదానం’ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సమాజంలో చర్చించడానికి భయపడే అంశాన్ని నేపథ్యంగా తీసుకున్న చలం రాసుకున్న ఆ రచన ఇప్పటికీ హాట్‌ టాపిక్కే. ఇప్పుడు దానికి దృశ్యరూపం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటీటీలో ‘మైదానం’ ను వెబ్‌సిరీస్‌గా తీసుకురావడానికి యువ దర్శకుడు వేణు ఉడుగుల సిద్ధమవుతున్నాడు. ‘నీది నాది ఒకే కథ’తో పరిచయమై ‘విరాటపర్వం’ తెరకెక్కిస్తున్న ఆయన నిర్మించే ఈ సిరీస్‌ ‘ఆహా’ ఓటీటీలో రాబోతోందని తెలుస్తోంది. దీంతో కవి సిద్ధార్థ అనే యువ దర్శకుడు పరిచయమవుతున్నాడు. మరి ఇందులో నటీనటులు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 


తనదైన జోనర్‌లో...

సుదీర్‌ వర్మ అంటే... ఓ డిఫరెంట్‌ సినిమాలో మదిలో మెదులుతుంది. అది తెలుగు సినిమా స్లైల్‌కి కాస్త దూరంగానే ఉంటుంది. ఓటీటీలోనూ అలాంటి మార్కు చూపించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. డార్క్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో పది ఎపిసోడ్లుగా ఈ వెబ్‌సిరీస్‌ ఉండబోతోందట. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తయిందని సమాచారం. ఇందులో ప్రధాన పాత్రధారుడిగా నవీన్‌ చంద్రను ఎంచుకున్నారనీ తెలుస్తుంది. అసలు ఇలాంటి థ్రిల్లర్‌ జోనర్స్‌కి ఓటీటీల్లో మంచి ఆదరణ ఉంది. మరి సుధీర్‌ వర్మ ఏం చేస్తాడో చూడాలి. అన్నట్లు ఇది కూడా ‘ఆహా’లోనే అందుబాటులో ఉంటుందట. 


 

 బాలీవుడ్‌లో ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌ ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిన విషయమే. సమాజంలో చర్చించడానికి ప్రజలు భయపడే, మొహమాట పడే అనేక అంశాలను అందులో ప్రస్తావించారు. ఈ సిరీస్‌లో తెలుగులో కూడా రూపొందించారు. ఓ ఎపిసోడ్‌కు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... మరో ఎపిసోడ్‌కు సంకల్ప్‌ రెడ్డి, ఇంకో ఎపిసోడకు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ సినిమాలతో వైవిధ్యమైన చిత్రాలు తీసి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సంకల్ప్‌ రెడ్డి... ‘లస్ట్‌ స్టోరీస్‌’ ఏం చెప్తాడో చూడాలి. అలాగే ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి సినిమాలతో తనేంటో నిరూపించుకున్న తరుణ్‌ భాస్కర్‌ ఏం చేస్తాడో చూడాలి. అలాగే ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా ఓ వెబ్‌సిరీస్‌ను ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.  వీళ్లు మాత్రమే కాకుండా లాక్‌డౌన్‌, కరోనా టైమ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి తేజ, వంశీ పైడిపల్లి, సురేందర్‌ రెడ్డి, రాహుల్‌ రవీంద్రన్‌ లాంటివాళ్లు ఓటీటీ బాట పడుతున్నారని అంటున్నారు. వీరి విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని