Tollywood: ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్‌లు బంద్‌.. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్ణయం

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని

Updated : 26 Jul 2022 19:33 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్ణయించింది. మంగళవారం అన్నపూర్ణా స్టూడియోలో గిల్డ్‌ సమావేశం జరిగింది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలందరూ ఈ సమావేశానికి హాజరై సినీ ఇండస్ట్రీలోని వివిధ సమస్యలపై చర్చించారు. నిర్మాతల మండలి నిర్ణయాలు, బడ్జెట్ నష్టాలు, ఓటీటీలో విడుదలపై గంటపాటు చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానం చేశారు.

ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలు నిలిపివేయనుండటంతో పలు అగ్రహీరోల చిత్రాలపై ప్రభావం పడనుంది. చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, బాలకృష్ణ 107వ సినిమా, ప్రభాస్ ప్రాజెక్ట్ -కె, అఖిల్ ఏజెంట్, సమంత యశోద, విజయ్ దేవరకొండ ఖుషి, రవితేజ రావణాసుర, రామ్ చరణ్-శంకర్ చిత్రంతోపాటు వంశీపైడిపల్లి-విజయ్ ల వారసుడు చిత్రాలకు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

చిత్ర పరిశ్రమను సర్వీసింగ్‌ చేయాలి: సినీ వర్గాలు

‘‘ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపై చర్చించేందుకు నిర్మాతలందరూ ముందుకు రావటం లేదు. అడిగితే ‘షూటింగ్స్‌ ఉన్నాయి. కుదరడం లేదు’ అంటున్నారు. అందుకే మొత్తం షూటింగ్స్‌ ఆపేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఆ తర్వాత షూటింగ్స్‌ కొనసాగించాలనేది కొందరి అభిప్రాయం. కరోనా సమయంలో కొన్ని రోజుల పాటు చిత్రీకరణలు నిలిచిపోయాయి కదా! అలాగే ఇప్పుడు కూడా కొన్ని రోజులు తాత్కాలికంగా చిత్రీకరణలు నిలపివేసి, కేవలం చర్చలకే సమయం కేటాయించాలి. ఏడాదికొకసారి కర్మాగారాలు, వాహనాలకు ఏవిధంగానైతే సర్వీసింగ్‌ చేస్తారో అలాగే, చిత్ర పరిశ్రమకూ సర్వీసింగ్‌ జరగాలి. ఇండస్ట్రీలో ఉన్న ప్రధాన సమస్యల్లో ఓటీటీ కూడా ఒకటి. సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వటం వల్ల థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్ని రోజులకు ఓటీటీకి ఇవ్వాలనే దాన్ని ఒక స్పష్టత వస్తే బాగుంటుంది. అలాగే టికెట్‌ ధరలను క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదాని మొత్తం ప్రేక్షకుల మీద పడేసి రుద్ద కూడదు. సినిమాకో ధర పెట్టడం వల్ల థియేటర్‌కు వచ్చే వాళ్లు తికమక పడుతున్నారు. వీపీఎఫ్‌ ఛార్జీలు నెలకు రూ.50కోట్లు దాటుతున్నాయి. దీనిపై కూడా నిర్మాతలందరూ కలిసి చర్చించాలి. అందుకే కొన్ని రోజులు చిత్రీకరణలు నిలిపివేసి పూర్తిస్థాయి చర్చలు జరిపితే బాగుంటుందని భావిస్తున్నాం.’’ చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని