
Aarya: తండ్రి అయిన ఆర్య.. హీరో ఇంట డబుల్ ధమాకా
చెన్నై: కోలీవుడ్ నటుడు ఆర్య తండ్రయ్యారు. ఆయన సతీమణి, నటి సాయేషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నటుడు విశాల్ శుక్రవారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. ‘నా సోదరుడు ఆర్య తండ్రి అయ్యాడనే శుభవార్త చెప్పడం నాకెంతో ఆనందంగా ఉంది. పండంటి పాపకు సాయేషా జన్మనిచ్చింది. నేను బాబాయ్‌ని అయ్యాను. షూటింగ్ మధ్యలో ఉన్న నేను.. సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను. వాళ్లకి అంతా మంచే జరగాలని.. ఆ పాపకు దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని విశాల్ ట్వీట్ చేశారు.
‘అఖిల్’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సాయేషాని ఆర్య ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నేనే అంబానీ’, ‘రాజా రాణి’లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ఆర్య.. ‘సైజ్ జీరో’, ‘వరుడు’ వంటి డైరెక్ట్ తెలుగు చిత్రాల్లోనూ కీలకపాత్రలు పోషించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘సార్పట్ట’ చిత్రం ఓటీటీ వేదికగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన ఇంట డబుల్ ధమాకా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.