Ninne Pelladata: ఎవర్‌గ్రీన్‌ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’కు 25ఏళ్లు

Ninne Pelladata: నాగార్జున, టబు కీలక పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం 25ఏళ్లు పూర్తి చేసుకుంది.

Published : 04 Oct 2021 10:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కృష్ణవంశీ మొదటి సినిమా గులాబీ సూపర్‌హిట్‌. చిత్రపరిశ్రమలో ఎటు చూసినా ప్రశంసల వెల్లువ. కానీ ఆ ప్రశంసల్లో ‘అచ్చం మీ గురువు ఆర్జీవీలా తీశారు’ అని ప్రశంసే ఆయన్ను ఆలోచనలో పడేసింది. ఆ ముద్రను చెరిపేయడానికి తనదైన ముద్ర వేయడానికి తీసిన సినిమానే ‘నిన్నేపెళ్లాడతా’. తెలుగులోనే ఎవర్‌గ్రీన్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోయిందీ చిత్రం. ఈ సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ విడుదలై(అక్టోబరు 4) నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

వైవిధ్యమైన కథలు ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ‘శివ’లాంటి క్రైమ్‌ డ్రామాను అందించి తెలుగు చిత్రసీమను ఆలోచనలో పడేసిన హీరో ఆయన. క్లాస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో హిట్టు కొట్టి  మరోసారి కొత్త ఒరవడి సృష్టించాడు. అదే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్నే పెళ్లాడతా’. నాగార్జున-టబుల కెమెస్ట్రీ, కృష్ణవంశీ టేకింగ్‌, సందీప్‌ చౌతా సంగీతం సినిమాను విజయ పథంలో నడిపాయి. ఇందులో నటించిన ప్రతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి క్లాసిక్‌ చిత్రం ఎలా పట్టాలెక్కిందంటే..

నాగార్జునతో యాక్షన్‌ మూవీ చేద్దామనుకుని..

కృష్ణవంశీ అప్పటికే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దగ్గర శిష్యుడిగా చేస్తున్నారు. ‘అనగనగా ఒకరోజు’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్‌ దాటిపోతుండటంతో అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, కృష్ణవంశీ ప్రతిభ తెలిసిన వర్మ ‘గులాబీ’తో మరో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా పాటల చిత్రీకరణ చూసిన నాగార్జున ఒక రోజు కృష్ణవంశీని పిలిచి ‘నాతో సినిమా చేస్తావా’ అని అడిగారు. ‘మీరు నాతో చేస్తారా’ అని కృష్ణవంశీ బదులిచ్చారట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ మంచి యాక్షన్‌ కథను నాగార్జునకు వినిపించారు కృష్ణవంశీ. నాగ్‌కు కూడా అది నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. ఇక లొకేషన్స్‌ చూడటానికి విశాఖ వెళ్లగా, అక్కడ కృష్ణవంశీని గుర్తుపట్టిన ఓ వ్యక్తి ‘గులాబీ సినిమా రామ్‌గోపాల్‌వర్మలా బాగా తీశారు’ అని అన్నాడట. ఆ మాటలు కృష్ణవంశీని ఆలోచనలో పడేశాయి. ‘రాముడొచ్చాడు’ షూటింగ్‌లో ఉన్న నాగార్జునకు ఫోన్‌ చేసి ‘సర్‌ నేను మీకు చెప్పిన కథతో సినిమా చేయను. మరో కథ చెబుతా’ అని అన్నారట. ‘నీకేమైనా పిచ్చా’ అంటూ నాగార్జున అసహనం వ్యక్తం చేయగా, మరుసటి రోజు హైదరాబాద్‌ వచ్చి నాగార్జునకు ‘నిన్నే పెళ్లాడతా’ పాయింట్‌ వినిపించారు. అప్పట్లో బాలీవుడ్‌లో ‘హమ్‌ ఆప్‌ హై కౌన్‌’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రాలు ఓ ట్రెండ్‌ సృష్టించాయి. వాటి ఆత్మను తీసుకుని తెలుగుదనం, కుటుంబ అనుబంధాలకు దగ్గరగా కథ రాసుకున్నారు. అది ఆయనకు కూడా నచ్చడంతో పది రోజుల్లో స్క్రిప్ట్‌ పూర్తి చేశారు. అది నాగార్జునకు వినిపిస్తే, ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

కథానాయిక ఎవరు?

నాగార్జున కథ ఓకే చేశారు. మరి హీరోయిన్‌ ఎవరు? కథానాయిక కోసం ముంబయి, మద్రాసుల్లో ఆడిషన్‌ నిర్వహించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 65మందిని ఆ పాత్ర కోసం పరిశీలించారు. అలా ఒకరోజు హీరోయిన్‌ కోసం వెతుకుతుండగా, టబు గుర్తొచ్చారు. ఎలాగో ఆమె అడ్రస్‌ కనుక్కొని కృష్ణవంశీ ముంబయి వెళ్లారు. అయితే ఆమె బిజీ షెడ్యూల్‌ కారణంగా రోడ్డుపైనే టబుకు కథ చెప్పాల్సి వచ్చింది. సినిమా థీమ్‌ ఆమెకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తర్వాత మద్రాసు వెళ్లి పూర్తి కథను టబుకు వినిపించారు. అలా ‘నిన్నే పెళ్లాడతా’ పట్టాలెక్కింది. అన్నపూర్ణా బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మించారు. సంగీత దర్శకుడిగా సందీప్‌ చౌతాను ఎంచుకున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం.

ఇదీ కథ

శీను(నాగార్జున) ఉత్సాహం ఉరకలెత్తే యువకుడు. భయమన్నదే ఎరుగని నైజం. కుటుంబసభ్యులు, స్నేహితులతో జీవితాన్ని జాలీగా ఆస్వాదిస్తుంటాడు. వాళ్లింటి వాతావరణం ఎప్పుడూ సరదాగా, అమ్మానాన్న, బాబాయిలతో కళకళలాడుతూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనందం ఆ ఇంటి చిరునామా. మహాలక్ష్మి(లక్ష్మి)కి తన కుమారుడు శీను అంటే వల్లమాలిన ప్రేమ. ఆ ఇంటి పక్కనే మూర్తి(చంద్రమోహన్‌) కుటుంబం కూడా నివాసముంటుంది. రెండు కుటుంబాలు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉంటాయి. ఇదే సమయంలో మహాలక్ష్మి(టబు) పైలెట్‌గా శిక్షణ తీసుకోడానికి హైదరాబాద్‌కు వస్తుంది. మూర్తి వాళ్ల ఇంట్లో ఉండి శిక్షణ తీసుకునేందుకు వచ్చిన టబుకి అక్కడి వాతావరణం బాగా నచ్చుతుంది. అన్నింటికన్నా ఎక్కువగా శీను నచ్చుతాడు. ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. శీను కుటుంబానికి కూడా పండు నచ్చడంతో పెళ్లికి అంగీకరిస్తారు. అయితే ఆ పండు ఎవరో కాదు. పెళ్లిరోజే ఇంట్లోంచి పారిపోయిన శీను సొంత మేనత్త కూతరు. ఈ నిజం తెలిసిన తర్వాత శీను కుటుంబం ఎలా స్పందించింది? కుటుంబ గొడవల మధ్య శీను, పండు ప్రేమ ఎటు దారితీసింది? చివరకు వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా?లేదా? అనేది మిగతా కథ.

నాగ్‌,టబుల కెమిస్ట్రీ అదిరిపోయింది

ఇప్పటికి వచ్చిన ప్రేమకథల్లో ‘నిన్నేపెళ్లాడతా’ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. శీను, పండుల జంట కూడా అంతగానే హిట్ అయింది. నాగ్‌ ఈ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. గ్రీకు వీరుడు పాట అదే స్థాయి విజయాన్ని అందుకుంది. టబు తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అప్పటిదాకా కరుడుగట్టిన విలన్‌పాత్రలు వేస్తూ వచ్చిన చలపతిరావు ఇందులో నాగార్జునకు తండ్రిగా చేశారు. తల్లిగా లక్ష్మి ఒదిగిపోయారు. బ్రహ్మాజీ, చంద్రమోహన్‌, ఉత్తేజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెడతాయి. సినిమా ఆరంభంలో వచ్చే బైక్‌ రేసింగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత నాగార్జున ‘అన్నమయ్య’లో నటించడం విశేషం.

ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్‌

‘నిన్నే పెళ్లాడతా’ చిత్రానికి సందీప్‌ చౌతా అందించిన పాటలు కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ పాట ఆల్‌టైమ్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక ‘గ్రీకువీరుడు’పాట కొన్నాళ్లపాటు అమ్మాయిలు హమ్‌ చేస్తూనే ఉన్నారు. ఇందులో ఏడు పాటలు ఉండగా, ఆరు పాటలు సిరి వెన్నెల కలం నుంచి జాలు వారాయి. ‘నా మొగుడు..’పాటను సుద్దాల అశోక్‌ తేజ రాశారు. ఆ కాలానికి చాలా అడ్వాన్స్‌గా తీసిన సినిమా ఇది. టెలిఫోన్‌ ద్వారా నాగ్‌, టబులు వీడియో కాల్‌ మాట్లాడుకుంటారు. బంధాలు, అనుబంధాలు గురించి కృష్ణవంశీ సినిమాలో చూపించిన విధానానికి కుటుంబ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత సుమారు 15మంది నిర్మాతలు తమతో కూడా ఈ తరహా మూవీ తీయమని కృష్ణవంశీకి బ్లాంక్‌ చెక్కులు, భారీ రెమ్మునరేషన్స్‌ ఆఫర్‌ చేశారట.

‘నిన్నే పెళ్లాడతా’ గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు..

* నాగార్జున కెరీర్‌లోనే మొదటి సిల్వర్‌ జూబ్లీ సినిమా ఇది!

* 39 సెంటర్స్‌లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.

* ఏడాది తర్వాత తమిళంలోనూ ‘ఉన్నైయే కల్యాణమ్‌ పన్నికిరెన్‌’గా అనువాదం చేస్తే అక్కడా విజయం సాధించింది.

* అప్పట్లో మొత్తం రూ.12కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషించాయి.

* ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకోగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అక్కినేని అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాజేశ్‌ కృష్ణన్‌(ఎటో వెళ్లిపోయింది మనసు) నంది అవార్డు అందుకున్నారు.

* ఉత్తమ జాతీయ చిత్రం(తెలుగు)గా ‘నిన్నే పెళ్లాడతా’ను అవార్డు వరించింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని