Pushpa: సుకుమార్‌ లేనిదే నేను లేను: అల్లు అర్జున్‌

‘‘వన్‌ డిగ్రీ ఆఫ్‌ డిఫరెన్షయేషన్‌’ అని ఇంగ్లీషులో ఒక నానుడి ఉంటుంది. ఓడలు ఏ దిశగా ప్రయాణం చేయాలనేది... ఓడలోని ఓ మీటర్‌ సూచిస్తుంటుంది. అక్కడ మీటర్‌లో ఒక డిగ్రీ కోణం మార్చి ప్రయాణం సాగిస్తే... మనం వేరే ఖండానికే వెళ్తాం.

Updated : 29 Dec 2021 07:04 IST

‘‘వన్‌ డిగ్రీ ఆఫ్‌ డిఫరెన్షయేషన్‌’ అని ఇంగ్లీషులో ఒక నానుడి ఉంటుంది. ఓడలు ఏ దిశగా ప్రయాణం చేయాలనేది... ఓడలోని ఓ మీటర్‌ సూచిస్తుంటుంది. అక్కడ మీటర్‌లో ఒక డిగ్రీ కోణం మార్చి ప్రయాణం సాగిస్తే... మనం వేరే ఖండానికే వెళ్తాం. అదే ఆ ఒక్క డిగ్రీ మార్చకుండా వెళితే వేరే ఖండానికి చేరుకుంటాం. అలా దర్శకుడు సుకుమార్‌ నా జీవితంలో ఆ ఒక డిగ్రీ కోణంలాంటి వారు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆయనే. సుకుమార్‌ లేనిదే నేను లేను’’ అన్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన నటించిన చిత్రం ‘పుష్ప’. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా సినిమాగా విడుదలై... దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరా బాద్‌లో ‘థ్యాంక్స్‌ మీట్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘ఆర్య నుంచి పుష్ప దాకా నా ప్రయాణంలో వెన్నంటి ఉండి నడిపించిన సుకుమార్‌ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి, అక్కడ విజయం రావడానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్య వాదాలు తెలియజేసుకుంటున్నా’’ అన్నారు.

దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘నేను ‘పుష్ప’ను పూర్తిగా తెలుగు సినిమా అనుకునే తీశాను. అల్లు అర్జున్‌, నిర్మాతలు పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లి విజయవంతమయ్యారు. ఎంతో సంతోషంగా ఉంది. దీనికోసం ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎంతో మందిని కలిసి... పెద్ద పరిశోధన చేశాం. ‘పుష్ప-2.. ది రూల్‌’ తర్వాత ఎర్రచందనం నేపథ్యంలోనే వెబ్‌సిరీస్‌ చేయాలనుకుంటున్నాం. అల్లు అర్జున్‌ గురించి ఏం చెప్పాలి? నేను మునిగిపోతున్నప్పుడు నన్ను లాగి గట్టునవేశాడు. మా ఇద్దరి అనుబంధం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ప్రపంచంలోనే అద్భుతమైన ఆదరణ పొందుతున్న పాటలు ఇచ్చిన దేవీశ్రీప్రసాద్‌కు, సాహిత్యం అందించిన చంద్ర బోస్‌కు కృతజ్ఞతలు. తెలుగు చిత్ర పరిశ్రమలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తర్వాత ఆ స్థాయి ఎవరిది అని ఆలోచిస్తే..నాకు చంద్రబోసే కన్పించారు. ఈ సందర్భంగా గీత రచయిత చంద్రబోస్‌ను వేదిక మీదికి ఆహ్వానించి ఆయనలోని పాండిత్యానికి పాదాభివందనం చేశారు. యూనిట్‌లో బాగా కష్టపడి పనిచేసిన సెట్‌బాయ్స్‌, ప్రొడక్షన్‌ బాయ్స్‌కు ఒక్కొక్కరికీ రూ.లక్ష బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ ‘‘ఊ అంటారా.. మామ ఉఊ అంటారా’’ పాట యూట్యూబ్ గ్లోబ్‌ నంబర్‌ సాంగ్‌గా నిలవడం, 4, 54 స్థానాల్లోనూ ‘శ్రీవల్లీ..’ ‘స్వామిస్వామి’ పాటలు నిలవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం సుకుమార్‌, రచయిత చంద్రబోస్‌ వారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంత మంచి పాటలు రాసే అవకాశాలిస్తున్న సుకుమార్‌, దేవీశ్రీప్రసాద్‌లకు ధన్యవాదాలు... మా స్నేహమే ఇంత గొప్ప పాటలు రావడానికి కారణం’’ అన్నారు చంద్రబోస్‌. నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కృతజ్ఞతలు. తెలుగులో ఎంత ప్రేక్షకాదరణ పొందిందో... ఇతర భాషల్లోనూ అంతే ఆదరణతో నడుస్తోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రష్మిక, రవిశంకర్‌, సునీల్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని