Updated : 02 Jul 2022 08:07 IST

Tollywood: అందరి గురి సంక్రాంతి బరి

ముగిసింది వేసవి సీజనే. జులైలో బాక్సాఫీసుకి విరామం లేకుండా వరుస కడుతున్నాయి కొత్త సినిమాలు. ఆ తర్వాత దసరా, దీపావళి చిత్రాలు ఉండనే ఉంటాయి. వాటి సందడి ఇంకా షురూ అవ్వనే లేదు. అప్పుడే చిత్రసీమ సంక్రాంతిపై (Sankranthi) గురి పెట్టింది. పెద్ద పండగ తీసుకొస్తున్న పెద్ద సీజన్‌ కోసం వరుసగా కట్చీఫ్‌ వేసేస్తున్నాయి సినిమాలు. మరికొంతమంది నిర్మాతలు మనకీ బెర్తు దొరక్కపోతుందా? అంటూ నిశితంగా గమనిస్తున్నారు.

తెలుగులో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు నాలుగే. వీటి మధ్యలో ఒకట్రెండు చిన్న సినిమాలకీ చోటు దక్కే అవకాశాలు ఉంటాయి. పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్ర కథానాయకుల చిత్రాలు నువ్వా నేనా అన్నట్టుగా సంక్రాంతి రేసులోకి వస్తుంటాయి. నిర్మాణంలో జాప్యం వల్లో... నిర్మాణానంతర పనులు పూర్తి కాలేదనో... ఇలా చాలా సినిమాలు మధ్యలోనే వెనకడుగు వేస్తుంటాయి. కొన్నిసార్లు ఎవ్వరూ ఊహించనివి సంక్రాంతి బరిలోకి దిగుతుంటాయి. రెండేళ్లుగా అదే జరిగింది. 2023 సంక్రాంతికి పక్కాగా వచ్చే సినిమాలేవనేది చెప్పలేం కానీ... ఇప్పటికి వచ్చేస్తున్నాం అని ఖరారు చేసినవి నాలుగు. చిరంజీవి 154వ చిత్రం, ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’, (Adipurush) విజయ్‌ ‘వారసుడు’, (Varasudu) పంజా వైష్ణవ్‌తేజ్‌ (Vaishnav Tej) కొత్త చిత్రం... ఇలా ఈ నాలుగూ పండగకొస్తున్నట్టుగా పోస్టర్లతో చెప్పేశాయి.

తనయుడి చిత్రం కాదని...

రామ్‌చరణ్‌ (RamCharan) - శంకర్‌ (Shankar) (RC15) కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతి లక్ష్యంగా చిత్రీకరణ సాగింది. నిర్మాత దిల్‌రాజు (Dilraju) సంక్రాంతికి తీసుకొస్తామని పలుమార్లు వెల్లడించారు. ఇప్పుడీ చిత్రం ఆ రేసు నుంచి దాదాపుగా వైదొలగినట్టే. బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి (Chiranjeevi) 154వ (Chiru 154) చిత్రం సంక్రాంతి బరిలో దిగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రమది. ఇటీవలే ఆ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తున్నాం అని ప్రకటించారు నిర్మాతలు. దిల్‌రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘వారసుడు’ (Varasudu) సంక్రాంతికి విడుదల ఖరారైంది. విజయ్‌ (Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర కెక్కుతున్న చిత్రమిది.

ఆ రెండూ...

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). మోషన్‌ క్యాప్చర్‌ సాంకేతితతో రూపొందుతున్న ఈ సినిమా 12 జనవరి 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ (Omraut) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపిస్తారు. సైఫ్‌ అలీఖాన్‌ (Saif Alikhan) రావణుడిగా నటించారు. కృతిసనన్‌, సన్నీసింగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైష్ణవ్‌తేజ్‌ (Vaishnav Tej) కథానాయకుడిగా శ్రీకాంత్‌రెడ్డి అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమా సంక్రాంతికే విడుదలవుతుంది. ఆ మేరకు చిత్రబృందం పోస్టర్‌తోపాటుగా విడుదల విషయాన్ని ప్రకటించింది. అగ్ర తారలు నటిస్తున్న మరికొన్ని సినిమాలూ సంక్రాంతినే లక్ష్యంగా చేసుకున్నాయి. బయటికి ప్రకటించకపోయినా ఆలోపు అన్ని పనులూ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో ముస్తాబవుతున్నాయి. మధ్యలో ఏ సినిమా రేసు నుంచి తప్పుకొన్నా వాటి స్థానంలో కొత్త చిత్రాలు బరిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts