upcoming movies in telugu: ఆగస్టు నెల.. ఆఖరి వారం.. అలరించే చిత్రాలు!

గత వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయగా, ఆగస్టు ఆఖరి వారంలో కొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంతేకాదు, ఓటీటీలోనూ దుమ్మురేపే చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

Published : 21 Aug 2023 10:03 IST

మరో విభిన్న పాత్రతో దుల్కర్‌

కొత్తదనంతో నిండిన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan). ఇప్పుడు ఆయన మరో భిన్నమైన కథతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.


వరుణ్‌ యాక్షన్‌

రుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడితే వాటిని అతనెలా ఎదుర్కొన్నాడు? ప్రాణాల్ని పరిరక్షించడంలో అతను ఎలాంటి వ్యూహాలు పన్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


బెదురులంక గ్రామంలో ఏం జరిగింది?

కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్‌ దర్శకత్వంలో  రూపొందిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Bedurulanka 2012). రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది. దీంట్లో మనసుకు నచ్చినట్లుగా జీవించే కుర్రాడిగా కార్తికేయ కనిపిస్తారు. సమాజానికి నచ్చినట్లు బతకడం సమంజసమా.. మనసుకు నచ్చినట్లు బతకడం సమంజసమా? అన్నది సినిమాలో చూడాలి’ అని చిత్ర బృందం తెలిపింది.


హాలీవుడ్‌ సినిమాల్లో కూడా చూడరేమో!

విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ (Em chestunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. ‘ద్వితీయార్ధంలో చూపు తిప్పుకోనివ్వని విధంగా సన్నివేశాలుంటాయి. ప్రతి పది నిమిషాలకు ఒక ఆసక్తికరమైన మలుపు వస్తుంటుంది. హాలీవుడ్‌ సినిమాల్లో కూడా చూడని హెలికాప్టర్‌ సీక్వెన్స్‌ ఒకటి ఉంది. ఈ చిత్రం చూసిన వారు మంచి అనుభూతితో థియేటర్‌ నుంచి బయటకు వెళ్తారు’ అని చిత్ర బృందం చెబుతోంది.


కన్నడలో సూపర్‌ హిట్‌.. ఇప్పుడు తెలుగులో..

చిన్న చిత్రంగా విడుదలై కన్నడలో ఘనవిజయం సాధించిన మూవీ ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’. అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’ (Boys Hostel) పేరుతో విడుదల చేస్తున్నారు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించగా.. రిషబ్‌ శెట్టి, రష్మీ గౌతమ్‌, తరుణ్‌భాస్కర్‌ అతిథి పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రం యువతను ఆకట్టుకునేలా ఉంది. డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు

‘బ్రో’ వచ్చేస్తున్నాడు

వన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.


యువత ఎదురు చూపులకు శుక్రవారంతో తెర

బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు.


  • ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు
  • నెట్‌ఫ్లిక్స్‌
  • రగ్నరోక్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 24
  • కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ (హాలీవుడ్) ఆగస్టు 25
  • లిఫ్ట్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ఆఖ్రి సోచ్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 25
  • బుక్‌ మై షో
  • సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 21
  • లయన్స్‌గేట్‌ప్లే
  • ఎబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25
  • జియో సినిమా
  • లఖన్‌ లీలా భార్గవ (హిందీ) ఆగస్టు 21
  • బజావ్‌ (హిందీ) ఆగస్టు 25
  • యాపిల్‌ టీవీ ప్లస్‌
  • ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌)ఆగస్టు 23
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని