Varalaxmi Sarathkumar: మా మౌనాన్ని బలహీనతగా చూడొద్దు: వరలక్ష్మి ఆగ్రహం

తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన పలు మీడియా సంస్థలపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌనాన్ని బలహీనతగా భావించవద్దన్నారు.

Published : 14 Mar 2024 17:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాదక ద్రవ్యాల కేసులో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎన్‌ఐఏ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై వరలక్ష్మి తాజాగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి అసత్య కథనాలు ప్రచురించిన పలు మీడియా సంస్థలపై మండిపడుతూ ఎక్స్‌లో(ట్విటర్‌) పోస్ట్‌ పెట్టారు.

‘‘మంచి వార్తలు లేకపోవడంతో పలు మీడియా సంస్థలు అవాస్తవమైన పాత వార్తలు ప్రసారం చేయడం నిజంగా విచారకరం. విలేకర్లు, స్వయంప్రకటిత వెబ్‌సైట్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. అసలైన జర్నలిజాన్ని మీరెందుకు ప్రారంభించకూడదు. సెలబ్రిటీల్లో లోపాలు వెతకడం ఇకనైనా మానండి. పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించేందుకు మేము శ్రమిస్తున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. మరి, మీ పని మీరెందుకు చేయడం లేదు. సమాజంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలున్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. మా మౌనాన్ని బలహీనతగా భావించకండి. పరువునష్టం కేసులు కూడా ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతున్నాయి. కాబట్టి, ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానండి’’ అని తెలిపారు.

డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఐఏ అధికారులు వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారంటూ గతంలోనూ వార్తలు వచ్చాయి. దీనిపై ఓ మీడియా సమావేశంలో ఆమె స్పందించారు. ‘‘డ్రగ్స్‌ కేసుకు నాకూ ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎలాంటి సమన్లు, లేదా ఫోన్‌ కాల్స్‌ రాలేదు. గతంలో నావద్ద ఆదిలింగం అనే వ్యక్తి ఫ్రీలాన్స్‌ మేనేజర్‌గా పని చేశారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు ఏమీ తెలియదు. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఆయన పేరుతో వార్తలు వచ్చాయి. దానికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో నా ఫొటోని ఉపయోగించి ‘వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు’ అని వార్తలు వేస్తున్నారు’ అంతే తప్ప ఆ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు’’ అని అప్పట్లో స్పష్టత నిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని