Venkatesh Maha: ‘కేజీయఫ్‌’పై వెంకటేశ్‌ మహా కామెంట్స్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఫ్యాన్స్‌

‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ వంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించి సినీ ప్రియులకు చేరువయ్యారు దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha). ‘కేజీయఫ్‌’ (KGF)ని ఉద్దేశిస్తూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చకు దారి తీశాయి.

Published : 06 Mar 2023 17:17 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) చిక్కుల్లో పడ్డారు. ‘కేజీయఫ్‌’ (KGF) చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. కన్నడ సినీ ప్రియులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంటనే సారీ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ చర్చా వేదికలో దర్శకులు శివా నిర్వాణ, వివేక్‌ ఆత్రేయ, నందినిరెడ్డి, మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి, వెంకటేశ్‌ మహా పాల్గొన్నారు. ఇందులో భాగంగా వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) యశ్ (Yash) నటించిన ‘కేజీయఫ్‌’పై కామెంట్స్‌ చేశారు. ‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ సినిమా గురించి ఇబ్బందికరంగా మాట్లాడటం తగదంటున్నారు. వెంకటేశ్‌ మహా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని సోషల్‌మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.

నందినిరెడ్డి క్షమాపణలు

కమర్షియల్‌ చిత్రాలను ఉద్దేశిస్తూ వెంకటేశ్‌ మహా కామెంట్స్‌ చేసిన సమయంలో అక్కడే ఉన్న నందిని రెడ్డి (Nandini Reddy) నవ్వడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ఆమెపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. దీనిపై నందిని రెడ్డి స్పందిస్తూ తాజాగా క్షమాపణలు చెప్పారు. ‘‘ప్రతి కమర్షియల్‌ చిత్రం విజయం సాధిస్తుందంటే.. చిత్రబృందం శ్రమ ప్రేక్షకులకు నచ్చిందని అర్థం. ‘కమర్షియల్‌ సినిమా’పై తాజాగా జరిగిన చర్చా కార్యక్రమంలో మేం చేసిన వ్యాఖ్యలు ఎవరినీ కించపరచాలని కాదు. ఆ వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించండి. అలాగే, వెంకటేశ్‌ మహా మాట్లాడిన విధానం, ఆయన హావభావాల వల్ల నాకు నవ్వొచ్చింది. అది ఎలాంటి తప్పుడు సంకేతాలు పంపిందో నాకిప్పుడు అర్థమైంది’’ అని ఆమె వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని