Vishva Karthikeya: ముగింపు వరకూ కనిపెట్టలేం

‘‘ఎలాంటి పాత్రనైనా చేయగలడనే పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అందుకే నటన పరంగా సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా ఓ బలమైన నమ్మకంతో ఈ సినిమా చేశా

Updated : 27 Mar 2024 11:36 IST

‘‘ఎలాంటి పాత్రనైనా చేయగలడనే పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అందుకే నటన పరంగా సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా ఓ బలమైన నమ్మకంతో ఈ సినిమా చేశా. నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రమిది’’ అన్నారు విశ్వ కార్తికేయ. బాల నటుడిగా పలు చిత్రాల్లో మెరిసిన ఆయన... కథానాయకుడిగా  ‘కళా పోషకులు’, ‘అల్లంత దూరానా’, ‘జై సేన’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇటీవల రమాకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో ‘కలియుగం పట్టణంలో’ అనే చిత్రం చేశారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విశ్వ కార్తికేయ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలివీ..

‘‘నేను ఇంతకుముందు కుటుంబ కథతో కూడిన చిత్రం చేశా. ప్రేమకథతో లవర్‌బాయ్‌గానూ  కనిపించా. ఇతరత్రా సినిమాలతో ఎనర్జిటిక్‌ హీరో అనే పేరు తెచ్చుకున్నా. వాటితో పోలిస్తే ఈ సినిమా వేరు. ప్రతి రెండు మూడు సన్నివేశాలకి ఓ కొత్త జానర్‌ సినిమా అనిపిస్తుంది. ఇలాంటి కథలు అరుదుగా దొరుకుతుంటాయి. దర్శకుడు చెప్పిన కథ, కథనాలు, పాత్రల తీరు తెన్నులు విన్నాక ఆశ్చర్యపోయా. పతాక సన్నివేశాల వరకూ కథలో ఏం జరుగుతుందో కనిపెట్టలేం. దర్శకుడు ఎంతో విజన్‌తో ఈ సినిమా చేశారు. తప్పకుండా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతుంది’’.

  • ‘‘థ్రిల్లర్‌, సస్పెన్స్‌ అంశాలతోపాటు... పలు రకాల  భావోద్వేగాలకూ ప్రాధాన్యం ఉన్న కథ ఇది. నంద్యాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా పెంచకూడదో ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. చెడుని చెడు కోణంలోనే చెప్పిన విధానమే ఈ సినిమా ప్రత్యేకత. కథానాయిక ఆయుషి తెలుగమ్మాయి కావడం సినిమాకి కలిసొచ్చింది. చిత్ర శుక్లా పరిశోధన చేసే అధికారిగా కీలక పాత్రలో కనిపిస్తారు. నిర్మాతలు కథని నమ్మి రాజీపడకుండా ఖర్చు పెట్టారు. ఆనాణ్యత తెరపై కనిపిస్తుంది’’.
  • ‘‘బాలనటుడిగా చిన్నప్పటి నుంచీ పరిశ్రమలో ఉన్నా. హీరోలు, దర్శకులు మంచి సహకారం అందిస్తున్నారు. అన్నపూర్ణ సంస్థ  మా సినిమాని పంపిణీ చేస్తుండడం ఆనందంగా ఉంది. నేనొక  సినిమా చేస్తున్నానంటే అందులో కచ్చితంగా ఓ మంచి విషయం ఉండాలనుకుంటా. చెడుని ప్రోత్సహించేలా మాత్రం ఏ కథా వుండదు. ప్రస్తుతం ఓ ఇండోనేషియా ప్రాజెక్ట్‌ చేస్తున్నా. అందులోనూ ఆయుషి కథానాయికగా నటిస్తోంది. బ్లాక్‌మేజిక్‌ నేపథ్యంలో ఆ సినిమా సాగుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని