దిగ్విజయంగా జరుగుతున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా సాగే 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు మొదటి రెండు రోజులు ఘనంగా జరిగింది. ‘న్యూజిలాండ్

Published : 22 Sep 2022 18:12 IST

మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా సాగే 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు మొదటి రెండు రోజులు ఘనంగా జరిగింది. ‘న్యూజిలాండ్ తెలుగు సంఘం’ వారి 25వ వార్షికోత్సవ సందర్భంగా ఆక్లాండ్ మహానగరం ఇందుకు వేదికైంది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు తల్లి కెనడా, సంస్థలు సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించాయి. భారతదేశం నుంచి కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వోలేటి పార్వతీశం, అమెరికా నుంచి వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు, మల్లిక్ పుచ్చా, న్యూజిలాండ్ తెలుగు సంఘం సమన్వయకర్త మగతల శ్రీలత, అధ్యక్షురాలు అనిత మొగిలిచెర్ల, సునీల్, ఆస్ట్రేలియా నుంచి గొల్లపూడి విజయ,  శ్రీనివాసరావు  తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ వేదికపై తెలుగు కథాసంపుటి “ప్రవాస చందమామ కథలు (సతీష్ గొల్లపూడి రచన). కవి జొన్నవిత్తుల విమాన వేంకటేశ్వర శతకం, మరో మాయాబజార్ - కథాసంపుటి (రాధిక మంగిపూడి) అమెరికోవిడ్ కథలూ-కాకరకాయలూ (వంగూరి చిట్టెన్ రాజు), డయాస్పోరా కథానిక -16వ సంకలనంతో సహా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించిన ఐదు పుస్తకాలను ఆవిష్కరించారు.

16 గంటల పాటు అంతర్జాలం వేదికగా సాగిన ఈ సదస్సులో 25 దేశాల నుంచి సుమారు 100 మంది వక్తలు ప్రసంగించారు. సదస్సు కోసం ప్రత్యేకంగా సినీకవి భువనచంద్ర ఒక గీతాన్ని రచించగా, సంగీత దర్శకులు స్వర వీణాపాణి స్వరపరిచి ఆలపించారు. మలేషియా, అమెరికా నుంచి రెండు చర్చా వేదికలను నిర్వహించారు. పద్య ఆలాపన, దేశభక్తి సాహిత్యం మీద వోలేటి పార్వతీశం ఉత్తేజపూరితమైన ప్రసంగం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతర్జాల వేదికపై కెనడాకు చెందిన రచయిత్రి కొమరవోలు సరోజ జీవన సాఫల్య పురస్కారం అందుకోగా, ముగింపు సమావేశ సమయంలో ఓలేటి పార్వతీశంను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. న్యూజిలాండ్ వేదికలలో అక్కడ నివసించే తెలుగు రచయితలు, కవులు తమ ప్రసంగాలను అందించగా, మొత్తం 26 గంటల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం వివిధ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

రెండో రోజు ప్రత్యక్ష వేదిక మీద కవి జొన్నవిత్తుల తన శతకంలోని పద్యాలను వినిపించారు. ‘ప్రత్యేకంగా భారతీయ వక్తలు, అతిథుల ప్రసంగాలతో అక్టోబర్ 2న అంతర్జాలంలో మరొక 12 గంటల పాటు సదస్సు నిర్వహించబోతున్నాం’ అని సదస్సు ముఖ్య నిర్వాహకులు వంగూరి చిట్టెన్‌ రాజు తెలిపారు. సహ నిర్వాహక సంస్థల ప్రతినిధులుగా డా. వంశీ రామరాజు, శాయి రాచకొండ, రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, రాపోలు సీతారామరాజు, డా.వెంకట ప్రతాప్, లక్ష్మీ రాయవరపు, డా. వెంకట్ తరిగోపుల కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. సింగపూర్ సాంకేతిక ప్రత్యక్ష ప్రసార కేంద్రంగా నడిచిన ఈ కార్యక్రమానికి గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, మధు చెరుకూరి తదితరులు సాంకేతిక నిర్వాహకులుగా సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని