చంద్రబాబు తిరిగి ఏపీ సీఎం కావడం చారిత్రక అవసరం: జయరాం కోమటి

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెదేపా యూఎస్ఏ సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు.

Updated : 07 Dec 2022 06:42 IST

ఫ్లోరిడా: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తిరిగి ఏపీ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని ఎన్ఆర్ఐ తెదేపా యూఎస్ఏ సమన్వయకర్త జయరాం కోమటి  అన్నారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఏపీలోని తమతమ గ్రామాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు అమెరికాలోని 26 రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటుచేశామన్నారు.

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని అన్నారు. ‘‘తెలుగునాట జరుగుతున్న సకల, సామాజిక, రాజకీయ, సాంస్కృతి ఉద్యమాలతో మమేకై తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుంది. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షానే పోరాడుతూనే ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ సిద్ధాంత స్ఫూర్తితో పనిచేయాలి’’ అని సూచించారు. పేదలకు కూడు, గూడు లక్ష్య సాధన కోసం తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రతిన పూనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ముందుచూపు లేదన్నారు. నేరం, రాజకీయం జంటగా అంటకాగుతున్నాయని విమర్శించారు. అవినీతి, స్వార్థ రాజకీయ విషకౌగిలిలో చిక్కిన రాష్ట్రానికి మూడున్నరేళ్లుగా ఊపిరాడటం లేదని జయరాం కోమటి అన్నారు. 

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 9 నెలల కాలంలో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం విజయ బావుటా ఎగురవేశారు. ప్రస్తుత జగన్ రెడ్డి పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగింది. తమ తప్పు తెలుసుకున్న ప్రజలు తిరిగి చంద్రబాబునాయుడుకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జీ-20 దేశాల సదస్సు నిర్వహణపై ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు విజన్‌ను ప్రశంసించడం ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు.

తెలుగుదేశం పార్టీ టాంపా నగర అధ్యక్షుడిగా సుధాకర్ మున్నంగి, ఉపాధ్యక్షుడిగా రామ్మోహన్ కర్పూరపు, జనరల్ సెక్రటరీగా స్వరూప్ అంచె, కోశాధికారిగా చంద్ర పెద్దు, సోషల్ మీడియా సమన్వయకర్తగా నాగ సుమంత్ రామినేని, రీజనల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్‌గా అజయ్ దండమూడిని నియమించారు. 

ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, శ్రీనివాస్ గుత్తికొండ, మన్నవ మోహన్ కృష్ణ, ప్రశాంత్ పిన్నమనేని, నాగేంద్ర తుమ్మల, అశోక్ యార్లగడ్డ, సుధీర్ వేమూరి, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ కొసరాజు, సుమంత్ రామినేని, వేణుబాబు నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు