America: బస్సుంది... డ్రైవర్‌ లేడు..

అమెరికా బోస్టన్‌లోని ఓ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఇటీవల తన విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లాలనుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. చార్టర్డ్ ఎల్లో స్కూల్ బస్సులో వెళ్లాలి. వాహనాన్ని బుక్‌ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. అవతలి వైపునుంచి ఒక సమాధానం...

Updated : 19 Oct 2021 03:45 IST

అగ్రరాజ్యాన్ని వేధిస్తున్న స్కూల్‌ బస్‌ డ్రైవర్ల కొరత

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా బోస్టన్‌లోని ఓ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఇటీవల తన విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లాలనుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. చార్టర్డ్ ఎల్లో స్కూల్ బస్సులో వెళ్లాలి. వాహనాన్ని బుక్‌ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. అవతలి వైపునుంచి ఒక సమాధానం వచ్చింది. ‘డ్రైవర్లు లేరు’ అని. దీంతో చేసేదేమీ లేక ప్రైవేట్ పార్టీలకు వినియోగించే ఓ బస్సులో తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది కేవలం బోస్టన్‌లోని ఓ స్కూల్‌ పిల్లలకు మాత్రమే ఎదురైన సమస్య కాదు. ఇప్పుడు అగ్రరాజ్యం అంతా.. స్కూల్‌ బస్‌ డ్రైవర్ల కొరతతో అల్లాడుతోంది! ఇటీవల మాసాచుసెట్స్‌లో పిల్లలను బడులకు తీసుకెళ్లేందుకుగానూ అక్కడి గవర్నర్ సైన్యంలోని 250 మందిని డ్రైవర్లుగా నియమించడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. టెక్సాస్‌లో స్కూల్‌ డిస్టిక్స్‌(పాఠశాలల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంగణాలు).. తమ ఉపాధ్యాయులు, బాస్కెట్‌బాల్ కోచ్‌లను బస్సులు నడపమని కోరుతుండటం గమనార్హం. పెన్సిల్వేనియాలో అయితే కొన్ని స్కూల్‌ డిస్టిక్స్‌.. స్వచ్ఛందంగా బస్సు సేవలు వదులుకోవాలని కోరుతూ విద్యార్థుల కుటుంబాలకు నెలకు 300 డాలర్లు చెల్లిస్తున్నాయి.

5 లక్షలకు పైగా బస్సులు..

అమెరికావ్యాప్తంగా ఏటా ఒకటినుంచి 12వ తరగతిలోపు విద్యార్థుల్లో దాదాపు 55 శాతం(2.5 కోట్లు) మంది స్కూల్‌ బస్సులను ఆశ్రయిస్తారు. మొత్తం 5 లక్షలకు పైగా బస్సులు ఉన్నాయి. దాదాపు 13,800 స్కూల్‌ డిస్టిక్స్‌ అన్ని కలిపి ఏడాదికి రూ.2200 కోట్లు విద్యార్థుల రవాణాపై ఖర్చు చేస్తాయి. మొత్తం బస్సుల్లో 60 శాతం ఆయా స్కూళ్లవే కాగ, మిగతా 40 శాతం ప్రైవేటువి. అంతా బాగున్న రోజుల్లో ప్రైవేటు సంస్థలూ భారీ లాభాలు ఆర్జించాయి. కానీ.. ఇప్పుడు డ్రైవర్లు లేక బస్సులు రోడ్డెక్కని దుస్థితి. వాస్తవానికి ఈ సమస్య కొత్తేమి కాదు. కరోనా ముందు కూడ ఎదురయినదే. కానీ.. మహమ్మారి కారణంగా పాఠశాలలకు ఏడాదికి పైగా సుదీర్ఘ విరామం రావడంతో సమస్య తీవ్రమైంది. ఇప్పుడు స్కూళ్లు పునః ప్రారంభమైనా.. డ్రైవర్ల కొరత 30 శాతంనుంచి 50 శాతానికి పెరగడంతో ఇక్కట్లు మొదలయ్యాయి.

అసలు ఎందుకీ సమస్య..

* కరోనా నేపథ్యంలో గతేడాది అమెరికాలోని 95 శాతం పాఠశాలలు ఆన్‌లైన్‌ విద్యాబోధన వైపు మళ్లాయి. దీంతో బస్సులు మూలకు చేరాయి. ఏడాదిలో 180 రోజులు స్కూళ్లపై ఆధారపడే ప్రైవేటు బస్సు సంస్థలూ తమ డ్రైవర్లను తొలగించాయి. కొన్ని లే ఆఫ్‌ విధించాయి. దీంతో సదరు డ్రైవర్లు ఇతర ఉద్యోగాలు వెతుక్కున్నారు. ఇప్పుడు వారు తిరిగి రావడం లేదు.
* ప్రస్తుతం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. మిగిలిన కొంతమంది డ్రైవర్లు కూడ ఆరోగ్య సమస్యలతో స్వచ్ఛందంగా విధులకు స్వస్తి పలికారు. కఠినమైన పని వేళలు, తక్కువ వేతనాలు, రెండు షిఫ్టుల్లో విధుల కారణంగా ఇతర ఆదాయ మార్గాలు కష్టతరమవుతుండటంతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు.
* అమెరికాలో స్కూలు బస్సు డ్రైవర్ల సగటు వయస్సు 56. అక్కడి సాధారణ కార్మికుడి సగటు కంటే 14 ఏళ్లు ఎక్కువ. వయస్సు పైబడినవారికి కొవిడ్‌ సోకడం, మరణించే అవకాశాలు ఎక్కువని ప్రచారం ఉండటం, పైగా వృత్తిలో భాగంగా ఇన్పెక్షన్‌ సోకే ప్రమాదం అధికమని చాలామంది భావిస్తున్నారు. దీంతో విధులకు వచ్చేందుకు భయపడుతున్నారు!
* డ్రైవర్లకు వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌ తప్పనిసరి. ఇది పొందాలంటే అమెరికాలో దాదాపు 12 వారాల సమయం పడుతుంది. దాదాపు వెయ్యి డాలర్ల వరకు ఖర్చవుతుంది. ఇది భరించలేక కొత్తవారు ఇటువైపు రావడం లేదు. పైగా ఈ లైసెన్సు ఉన్నవారికి ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. అమెజాన్‌ తదితర సంస్థలు అధిక వేతనాలు ఆఫర్‌ చేస్తున్నాయి.
* తరగతుల నిర్వహణ ఏడాదికి 180 రోజులు మాత్రమే ఉంటుంది. మిగతా సమయాల్లో బస్సు డ్రైవర్లకు వేతనాలు చెల్లించరు! జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలు తక్కువే.

సర్వేలో ఆసక్తికర అంశాలు..

బస్సుల కొరత సమస్యపై ఇటీవల  దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం.. 81 శాతం కంటే ఎక్కువ స్కూల్‌ డిస్టిక్స్‌ సరిపడ బస్సు డ్రైవర్లను సమకూర్చుకోలేకపోయాయి.
* 51 శాతానికి పైగా స్కూల్‌ డిస్టిక్స్‌ ఈ సమస్యను తీవ్రమైన, తీర్చలేనిదిగా పేర్కొన్నాయి.
* డ్రైవర్ల కొరత తీవ్రంగా మారుతోందా అంటే 78 శాతం అవునని బదులిచ్చాయి.
* మాకు ఎదురవుతున్న సమస్యల్లో ఇదే మొదటిదని 65 శాతం వెల్లడించాయి. 

పరిష్కారానికి ఏం చేస్తున్నారు..

బస్సు డ్రైవర్ల వేతనాలు పెంచేందుకు ప్రైవేటు యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. సాధారణంగా ఈ విధులు నిర్వహించే వారికి గంటకు 16 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం ‘ఫస్ట్‌ స్టూడెంట్‌’ అనే ప్రైవేటు సంస్థ గంటకు 21 డాలర్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. పెన్సిల్వేనియా, అరిజోనా, వర్జినియా తదితర రాష్ట్రాలు బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. కానీ.. ‘ది గ్రేట్‌ రెజిగ్నేషన్‌’ సంక్షోభం కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో అగ్రరాజ్యం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో ఎదురు చూడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని